గుడిలోనే అర్చకుడిని కాలితో తన్నిన వైనం..

కాకినాడ (CLiC2NEWS): దేవాలయంలోని పూజారులను సాక్షాత్తు భగవంతుని ప్రతినిధులుగా మొక్కుతాము. అలాంటిది గుడిలో అర్చన సరిగా చేయలేదని మాజి కార్పొరేటర్ ఆ పూజారిని కాలితోతన్ని, చెంపపై కొట్టాడు. ఈ ఘటన కాకినాడ నగరం దేవాలయం వీధిలోని పురాతన శివాలయంలో చోటుచేసుకుంది. సోమవారం పౌర్ణమి సందర్భంగా కాకినాడ లోని పెద్ద శివాలయంలో మాజి కార్పొరేటర్, వైఎస్ ఆర్‌సిపి నేత సిరియాల చంద్రరావు భక్తుల సమక్షంలోనే పూజారిని అసభ్య పదజాలంతో దూషిస్తూ, కాలితో తన్నాడు. తాను తెచ్చిన పాలు శివలింగంపై సరిగ్గా పోయలేదని.. అధికార పార్టీ నాయకుడికి ఇచ్చే విలువ ఇదేనా అంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆసమయంలో పక్కన ఉన్న మరో పూజారి వారించగా ఆయనను సైతం చెంపపై కొట్టాడు. ఈ తతంంగానికి భక్తులు నివ్వెరపోయారు. ఈ ఘటనను పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఆలయ ఇఒ రాజేశ్వరరావు బాధిత అర్చకులతో కలిసి కాకినాడ ఒకటో పట్టణ పిసిలో ఫిర్యాదు చేశారు. సెక్షన్ 332 కింద సిఐ సురేశ్‌బాబు కేసు నమోదు చేశారు.