బలమైన గాలికి బ్రిడ్జి కూలిందన్న ఐఎఎస్ ఆఫీసర్.. కంగుతిన్న గడ్కరీ
న్యూఢిల్లీ (CLiC2NEWS): భీహార్‌లో ఇటీవల నిర్మాణంలో ఉన్న ఓ వంతెన కొంతభాగం కూలిపోయింది. సుల్తాన్‌గంజ్‌లోని గంగా నదిపై నిర్మిస్తున్న ఓ బ్రిడ్జి ఇటీవల కూలింది. అయితే దీనిపై కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వివరణ కోరారు. అయితే ఆ వంతెన గాలికి కూలిందని ఐఎఎస్ అధికారి ఒకరు సమాధానమిచ్చారట.. దీంతో కంగుతినడం కేంద్ర మంత్రి వంతైంది. ఈ విషయాన్ని స్వయంగా గడ్కరీనే చెప్పడం గమనార్హం. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి తెలిపారు. “బలమైన గాలులు వీస్తే బ్రిడ్జి ఎలా కూలుతుందో అర్థం కావడం లేదని మంత్రి అన్నారు. ఓ ఐఎఎస్ అధికారి ఇలాంటి వివరణ ఇవ్వడం ఆశ్చర్యం కలిగింది. అయినా గాలుల వల్ల వంతెన ఎలా కూలుతుందో నా కర్థం కాలేదు. నిర్మాణంలో ఏమైనా లోపం ఉందేమో“ అని గడ్కరీ చెప్పుకొచ్చారు.
నాణ్యతా లోపం లేకుండా తక్కువ ఖర్చుతో మన్నికైన నిర్మాణాలను చేపట్టాలని మంత్రి అన్నారు. రూ.1710 కోట్ల ఖర్చుతో ఆ బ్రిడ్జిని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. సుల్తాన్‌గంజ్, అగౌనీ ఘాట్ల మధ్య 2014 లో బ్రిడ్జి నిర్మాణం ప్రారంభమైంది. ఈ బ్రిడ్జి పొడవు 3116 మీటర్లు ఉంటుంది.