కొమురవెల్లి మల్లన్నకు గోదావరి జలాలతో అభిషేకం చేసిన సిఎం కెసిఆర్

కొమురవెల్లి (CLiC2NEWS): తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గోదావరి జలాలతో కొమురవెల్లి మల్లన్నకు జలాభిషేకం చేశారు. ప్రతిష్టాత్మకమైన మల్లన్న సాగర్ ప్రాజెక్టును పూర్తిచేసి.. ఆ జలాలతో మల్లన్న పాదాలు కడుగుతామని గతంలో ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. సిద్దిపేట జిల్లా తుక్కాపూర్ వద్ద మల్లన్న సాగర్ ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం కెసిఆర్ మల్లన్న స్వామికి జలాభిషేకం చేశారు.
మల్లన్న సాగర్ ప్రాజెక్టు జాతికి అంకితం చేసిన అనంతరం సిఎం కెసిఆర్ మాట్లాడుతూ..మల్లన్న సాగర్‌ను ప్రారంభించుకోవడం చారిత్రక ఘట్టమని అన్నారు. ఈ మహాయజ్ఞంలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో 58వేలకు పైగా కార్మికులు పాల్గొన్నారని తెలిపారు. ఈ ప్రాజెక్టు వలన ఒక్క సిద్దిపేట జిల్లాకు మాత్రమే హైదరాబాద్ నగరానికి శాశ్వతంగా మంచినీటి సమస్యను దూరం చేసే గొప్ప ప్రాజెక్టు ఇది అని కెసిఆర్ తెలిపారు.
పాలమూరు జిల్లాలోనూ మల్లన్న సాగర్ వంటి ప్రాజెక్టులు ప్రారంభం కాబోతున్నాయని సిఎం వెల్లడించారు. ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు త్వరలో పూర్తవుతుందన్నారు. తెలంగాణకు కరవు రాకుండా చేసే ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. దేశమంతా కరువు వచ్చినా.. తెలంగాణకు రాదు. పంజాబ్‌తో పోటీ పడుతూ తెలంగాణలో ధాన్యం పండిస్తున్నాం. ఐటీ ఉద్యోగులు సైతం నేడు వ్యవసాయం చేస్తున్నారు. అద్భుత గ్రామీణ తెలంగాణ సాకారమవుతుంది. పాడి పరిశ్రమ, గ్రామీణ ఆర్ధక వ్యవస్థ పటిష్టమవుతోందని కెసిఆర్ అన్నారు.