జ‌ల‌మండ‌లిలో భ‌ద్ర‌తా వారోత్స‌వాలు ప్రారంభం

కార్మికుల భ‌ద్ర‌త‌పై అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు

హైదరాబాద్‌ (CLiC2NEWS): విధుల్లో కార్మికులు, సిబ్బంది తీసుకోవాల్సిన‌ ర‌క్ష‌ణ చ‌ర్య‌ల‌పై, మ్యాన్‌హోళ్ల విష‌యంలో ప్ర‌జ‌లు తీసుకోవాల్సిన జాగ్రత్త‌ల‌పై సంపూర్ణ‌ అవ‌గాహ‌న క‌ల్పించ‌డం కోసం భ‌ద్ర‌తా వారోత్స‌వాల‌ను చేప‌ట్టిన‌ట్లు జ‌ల‌మండలి ఎండీ దాన‌కిశోర్ పేర్కొన్నారు. బుధ‌వారం న‌గ‌రంతో పాటు ఓఆర్ఆర్ ప‌రిధిలోని అన్ని జ‌ల‌మండ‌లి డివిజ‌న్ల‌లో భ‌ద్ర‌తా వారోత్స‌వాలు ప్రారంభ‌మ‌య్యాయి. జ‌ల‌మండ‌లి కార్మికులు, సిబ్బందితో నిర్వ‌హించిన అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాల్లో ప్ర‌జాప్ర‌తినిధులు, జ‌ల‌మండ‌లి అధికారులు పాల్గొన్నారు. ప‌నులు చేస్తున్న‌ప్పుడు ర‌క్ష‌ణ ప‌రిక‌రాల‌ను క‌చ్చితంగా ఉప‌యోగిస్తామ‌ని కార్మికుల చేత ప్ర‌తిజ్ఞ చేయించారు.

ఈ సంద‌ర్భంగా జ‌ల‌మండ‌లి ఎండీ దాన‌కిశోర్ మాట్లాడుతూ.. జ‌ల‌మండ‌లిలో ప‌నిచేస్తున్న‌ సీవ‌రేజి కార్మికులకు మురుగునీటి నిర్వ‌హ‌ణ, భ‌ద్ర‌తపై మే 25 నుంచి జూన్ 1 వ‌ర‌కు వారం రోజులు అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. కార్మికులు ఏమాత్రం ప్ర‌మాద‌క‌ర‌మైన ప‌రిస్థితుల్లో ప‌నిచేయ‌కూడ‌ద‌నే ఆలోచ‌న‌తోనే ఈ అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాల‌కు మంత్రి కేటీఆర్ ఆదేశాల‌తో రూప‌క‌ల్ప‌న చేసినట్లు తెలిపారు. జ‌ల‌మండ‌లి ప్ర‌తీయేటా ఈ భ‌ద్ర‌తా అవ‌గాహన కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తోందని పేర్కొన్నారు.

దేశంలో ఎక్క‌డా లేని విధంగా మాన‌వ ర‌హిత పారిశుధ్య ప‌నుల కోసం మినీ ఎయిర్ టెక్ మిష‌న్ల‌ను జ‌ల‌మండ‌లి ఉప‌యోగిస్తున్న విష‌యాన్ని గుర్తుచేశారు. అంతే కాకుండా మ్యాన్ హోళ్ల‌ను యంత్రాల స‌హాయంతో శుభ్ర‌ప‌ర‌చ‌డానికి సివ‌ర్ క్రాక్ లాంటి ప‌రిక‌రాల‌ను రూపొందించింద‌ని తెలిపారు. దీని వ‌ల్ల మ్యాన్ హోళ్ళ క్లీనింగ్ లో మాన‌వ ప్ర‌మేయం లేకుండా చేశామ‌ని పేర్కొన్నారు.

కార్మికులు విధి నిర్వ‌హ‌ణ‌లో త‌ప్ప‌కుండా హ్యండ్ గ్లౌజులు, గ‌మ్ బూట్స్, మాస్కులు, బాడీ సూట్ వంటి భ‌ద్ర‌తా ప‌రిక‌రాల‌ను ధ‌రించేలాగా ప్ర‌తీ మేనేజ‌ర్ త‌మ సెక్ష‌న్ ప‌రిధిలోని సీవ‌రేజి కార్మికులంద‌రికి అవ‌గాహన క‌ల్పించాల‌ని ఎండీ దాన‌కిశోర్ ఆదేశించారు.

న‌గ‌రంలో మూడున్న‌ర ల‌క్ష‌ల మ్యాన్‌హోళ్లు ఉన్నాయ‌ని, వీటి మూత‌ల‌ను న‌గ‌ర వాసులు తెర‌వొద్ద‌ని కోరారు. షాంపూ ప్యాకెట్లు, ప్లాస్టిక్ వ్యర్థాలు, ఆహార ప‌దార్థాల వ్య‌ర్థాలు, బ‌ట్ట‌లు, దిండ్లు, ప‌రుపులు, పాలిథిన్ క‌వ‌ర్లు, సీసాలు, గాజు ముక్క‌లు, రాళ్లు, ఇటుక‌లు వంటి వ్య‌ర్థాల‌ను మ్యాన్ హోళ్ల‌లో వేయొద్ద‌ని కోరారు. అపార్ట‌మెంట్లు, వాణిజ్య భ‌వ‌నాల‌లో సిల్ట్ చాంబ‌ర్లు త‌ప్ప‌నిస‌రిగా నిర్మించుకోవాల‌ని ఆయ‌న కోరారు. మ‌నుషుల‌ను మ్యాన్‌హోళ్ల‌లోకి దించ‌వ‌ద్ద‌ని, ఇది చ‌ట్ట‌రీత్యా నేర‌మ‌ని అన్నారు. ఎలాంటి స‌మ‌స్య‌లు ఉన్నా జ‌ల‌మండ‌లి క‌స్ట‌మ‌ర్ కేర్ నెంబ‌రు 155313కి ఫోన్ చేస్తే ప‌రిష్క‌రిస్తామ‌ని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.