వానాకాలం నేపథ్యంలో జలమండలి అప్రమత్తం
మ్యాన్‌హోల్ మూతలు తెరవొద్దని ప్రజలకు సూచన
హైదరాబాద్ (CLiC2NEWS): వానాకాలంలో మ్యాన్‌హోళ్ల ఓవర్‌ఫ్లో, రోడ్లపై వర్షపు నీరు నిలవడం లాంటి సమస్యలను వెంటనే పరిష్కరించడంతో పాటు ప్రజల భద్రత కోసం జలమండలి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందు కోసం మాన్‌సూన్ సేఫ్టీ టీమ్‌లను, వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వాహనాలను మంగళవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఎండీ దానకిశోర్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరవ్యాప్తంగా వర్షాకాలంలో నిరంతరం అందుబాటులో ఉండేలా మొత్తం 16 మాన్‌సూన్ సేఫ్టీ టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒక్కో టీమ్‌లో ఐదుగురు సభ్యులు ఉంటారని, ఈ టీమ్‌లకు ప్రత్యేక వాహనాలు 24 గంటలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. జీహెచ్ఎంసీ గుర్తించిన మొత్తం 211 నీరు నిలిచే ప్రాంతాలపైన ఈ బృందాలు ప్రత్యేక దృష్టి పెడతాయని వివరించారు.
ఈ 16 మాన్‌సూన్ సేఫ్టీ టీమ్ వాహనాలతో పాటు మరో 16 మినీ ఎయిర్‌టెక్ వాహనాలను కూడా అందుబాటులో ఉండేలా చూస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన జలమండలి అధికారులకు పలు సూచనలు చేశారు. ముంపునకై గురయ్యే ప్రాంతాల్లో మ్యాన్‌హోళ్ల దగ్గర హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేయాలని, డీప్ మ్యాన్‌మోళ్ల దగ్గర సీవరేజి సూపర్‌వైజర్ల పర్యవేక్షణ ఉండేలా చూడాలని పేర్కొన్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది తప్పనిసరిగా రక్షణ పరికరాలను ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జీఎంలు కలుషిత నీటి సమస్యలు, మ్యాన్‌హోళ్ల ఓవర్‌ఫ్లోపై వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ఎక్కడైనా నీరు నిలిచినా, మ్యాన్‌హోల్ మూత ధ్వంసమైనా, తెరిచి ఉన్నా జలమండలి కస్టమర్ కేర్ నెంబరు 155313కి ఫోన్ చేయాలని సూచించారు. ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఎస్ఎంఎస్‌లు, వాయిస్ కాల్స్, ఎఫ్ఎం రేడీయోతో పాటు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కల్పిస్తున్నట్లు ఎండీ దానకిశోర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఎన్‌సీ, ఆపరేషన్స్ డైరెక్టర్ – 1 అజ్మీరా కృష్ణా, ఆపరేషన్స్ డైరెక్టర్ – 2 స్వామి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.