నౌకలో మంటలు.. సముద్రంలోకి దూకిన ప్రయాణికులు
KM Barcelona 5 Ferry: ఇండోనేషియా నుండి ప్రయాణికులతో వెళుతున్న నౌకలో అగ్నిప్రమాదం జరిగింది. సులవేసి ద్వీపం వద్ద ఈప్రమాదం చోటుచేసుకుంది. తలౌడ్ నుండి ఉత్తర సులవేసి ప్రావిన్సు రాజధాని మనాడోకు వెళుతున్న ‘కె ఎం బార్సిలోనా 5 ఫెర్రీ’ నౌకలో మంటలు భారీగా వ్యాపించాయి. దీంతో ప్రాణాలు రక్షించుకునేందుకు ప్రయాణికులు సముద్రంలోకి దూకేశారు. స్థానిక మత్స్య కారుల సాయంతో రెస్క్యూ సిబ్బంది ఇప్పటి వరకు 284 మందిని రక్షించారు. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
నౌకలో భారీ స్థాయిలో మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. మంటలు అలుముకోవడంతో పాటు దట్టంగా పొగ వ్యాపించడంతో ఊపిరాడక ఇబ్బందులకు గురయ్యారు. ఈ ప్రమాద సమయంలో నౌకలో ఎంత మంది ఉన్నారు.. ఎంతమందికి గాయాలయ్యాయనే విషయంపై స్పష్టత లేదు.