ప్ర‌జ‌లు కోరితే కొత్త పార్టీ పెడ‌తా..!

బిజెపిపై ఢిల్లీలో పంచాయ‌తి పెడ‌తా: సిఎం కెసిఆర్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): దేశంలోని ప్ర‌జ‌లంతా కోరితే.. అంద‌రూ కోరితే త‌ప్ప‌కుండా దేశ‌వ్యాప్తంగా పార్టీ పెడ‌తా.. అని ముఖ్య‌మంత్రి కెసిఆర్ మీడియా స‌మావేశంలో చెప్పారు. ఆదివారం సాయంత్రం ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కెసిఆర్ మీడియా స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశంలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. ప్ర‌ధాని మోడీ చెప్పేదొక‌టి.. చేసేదొక‌ట‌ని సిఎం ఆరోపించారు.

“విద్యుత్ సంస్క‌ర‌ణ‌లు తెస్తున్నారు.. అందులో భాగంగా ముసాయిదా బిల్లును వివిధ రాష్ట్రాల‌కు పంపించారు. ఆ బిల్లుపై ఎడెనిమిది రాష్ట్రాల సిఎంలు అభిప్రాయాలు కూడా చెప్పారు. విద్యుత్ సంస్క‌ర‌ణ‌ల‌ను వ్య‌తిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి పంపించాం. విద్యుత్ సంస్క‌ర‌ణ‌ల‌కు అద‌న‌పు రుణాలు తీసుకుంటున్నారు. అద‌న‌పు రుణాల విష‌య‌మై కేంద్ర బ‌డ్జెట్‌లో కూడా చెప్పారు. కేంద్ర ముసాయిదా బిల్లుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌ర్కార్ అంగీక‌రించింది. శ్రీ‌కాకుళం జిల్లాల్లో 25 వేల వ్య‌వ‌సాయ మోటార్ల‌కు మీట‌ర్లు కూడా పెట్టారు. మిగ‌తా విద్యుత్ మీట‌ర్ల‌కు రూ.737 కోట్ల‌తో టెండ‌ర్లు పిలిచారు. విద్యుత్ సంస్క‌ర‌ణ‌లు అమ‌లు చేయ‌క‌పోతే తెలంగాణ రాష్ట్రం ఐదు సంవ‌త్స‌రాల‌లో రూ. 25 వేల కోట్లు న‌ష్ట‌పోయే అవ‌కాశ‌ముంది. విద్యుత్ సంస్క‌ర‌ణ‌లు అమ‌లు చేయ‌మ‌ని కేంద్రం చెప్పిన‌ట్లు నిరూపిస్తే క్ష‌మాప‌ణ చెబుతాన‌ని బండి సంజ‌య్ అన్నారు.. ఇవిగో ఆధారాలు బండి సంజ‌య్ క్ష‌మాప‌ణ చెప్పాలి“ అని సిఎం వెల్ల‌డించారు.

ప్ర‌జ‌లు కోరితే దేశ‌వ్యాప్త పార్టీ పెడ‌తా..

దేశంలోని ప్ర‌జ‌లంతా కోరితే.. అంద‌రూ కోరితే త‌ప్ప‌కుండా దేశ‌వ్యాప్తంగా పార్టీ పెడ‌తా.. అని సిఎం అన్నారు… “ కెసిఆర్‌కు దమ్ములేదా.. అధికారం లేదా.. త‌ప్ప‌కుండా అవ‌స‌రం వ‌స్తే పార్టీ పెడ‌దాం.. టిఆర్ ఎస్ పార్టీ పుట్టిన నాడు ఏమ‌న్నారు. ఇప్పుడు ఏమైంది… ఇది ప్ర‌జాస్వామ్యం.. ప్ర‌జ‌లు అనుకున్న నాడు త‌ల‌కిందులు అయిత‌ది…

చాయ్ అమ్ముకున్నా అని మోడీ నే చె్పారు క‌దా.. ఆయ‌న ప్ర‌ధాన మంత్రి కాలేదా.. సినిమా న‌టులు సిఎంలు కాలేదా.. ఎన్టీఆర్‌, ఎంజీఆర్ సిఎంలు అయ్యారు. ఏం జ‌రుగుతుందో నాకు తెలియ‌దు.. కానీ ఎదో ఒక‌టి మాత్రం జ‌రుగుతుంది..“ అని సిఎం స్ప‌ష్టం చేశారు.

అవితిపై ఢిల్లీలో పంచాయ‌తి పెడ‌తా..

“దేశంలో వివిధ బ్యాంకుల‌ను ముంచి 33 మంది లండ‌న్‌లో య‌థేచ్ఛ‌గా తిరుగుతున్నారు. వారిలో చాలా మంది మోడీగారి దోస్తులే.. వారిలో ఎక్కువ మంది గుజ‌రాత్‌కు చెందిన వారే.. అందుకే బిజెపిని దేశం నుంచి త‌రిమికొట్టాల‌ని చెబుతున్నాం.. వీళ్ల‌ని త‌రిమి కొట్ట‌క‌పోతే దేశం నాశ‌న‌మైపోతుంది. రఫేల్ విమానాల కొనుగోలులో గోల్‌మాల్ జ‌రిగింది. బిజెపి అవినీతిపై ఢిల్లీలో పంచాయితి పెడ‌తా.. ద‌మ్ముంటే వీటిపై మాట్లాడాలి..“ అని సిఎం కెసిఆర్ అన్నారు.

“ దేశం కోసం ముందుకు క‌ద‌లాల్సింది దేశ ప్ర‌జ‌లే.. జ‌నం ప్ర‌భంజ‌న‌మైతే ఎవ‌రూ అడ్డుకోలేరు.. ప్ర‌జ‌లు క‌దిలితే న‌య‌కులు క‌దిలి వ‌చ్చే ప‌రిస్థితి వ‌స్తుంది. దేశం కోసం అవ‌స‌ర‌మైతే కొత్త పార్టీ పెడ‌తా.. సింగ‌రేణిని ప్రైవేటీక‌ర‌ణ చెయ్యొద్ద‌ని కార్మికులు పోరాడుతున్నారు. సింగ‌రేణిలో కేంద్రం వాటాకు అవ‌స‌ర‌మైతే డబ్బులు చెల్లిస్తామ‌ని కూడా చెప్పాం. రాజ‌కీయ ఫ్రంట్‌ను ఊహించొద్దు.. ప్ర‌జ‌ల ఫ్రంట్‌ను ఊహించండి.. నేను ముంబ‌యి వెళ్తా.. ఉద్ధ‌వ్ ఠాక్రేను క‌లుస్తా.. ఏదేమైనా ఈ విష‌యంలో నేను కీల‌క పాత్ర పోషిస్తా.. దేశంలో చాలా మంది రాజ‌కీయ నాయ‌కులు ఉన్నారు.“ అని సిఎం కెసిఆర్ స్ప‌ష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.