ఎపి హైకోర్టు కీలక తీర్పు..
అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలి

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులు, రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సిఆర్డిఎ) రద్దు పిటిషన్లపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. సిఆర్డిఎ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలి అని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒప్పందం ప్రకారం 6 నెలల్లో మాస్టర్ ప్లాన్ను పూర్తి చేయాలని ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ మిశ్ర నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది,.
అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలి. మూడు నెలల్లోపు వాటాదారులకు ప్లాట్లు నిర్ణయించాలి. ఆరు నెలల్లోపు మౌలిక సదుపాయాలు కల్పించాలి. మాస్టర్ ప్లాన్లో ఉన్నది ఉన్నట్లుగా అమలు చేయాలి. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదు. లేని అధికారాలతో చట్టాన్ని రద్దు చేయలేరు. అధికారం లేనపుడు సిఆర్డిఎ చట్టం రద్దు కుదరదు. అమరావతి నుండి ఏ కార్యాలయాన్ని తరలించకూడదు. పిటిషనర్లందరికీ ఖర్చుల కింద రూ. 50 వేలు చెల్లించాలి అని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.