నూరుశాతం మురుగునీటి శుద్ధే ల‌క్ష్యంగా కొత్త ఎస్టీపీలు

– రూ.3,866 కోట్ల‌తో 31 ఎస్టీపీల నిర్మాణం

– ప్యాకేజ్‌-3లో 5 ఎస్టీపీల నిర్మాణ ప‌నులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): హైదరాబాద్ లో రూ.3,866 కోట్ల‌తో చేప‌ట్టిన 31 కొత్త ఎస్టీపీల నిర్మాణ ప్రాజెక్టులోని ప్యాకేజ్ – 3 ప‌నుల‌కు మంగ‌ళ‌వారం కుత్బుల్లాపూర్‌లో మున్సిప‌ల్ మంత్రి కెటిఆర్ శంకుస్థాప‌న చేశారు. కుత్బుల్లాపూర్ స‌ర్కిల్ ప‌రిధిలో ప్యాకేజ్ – 3లో రూ.248.44 కోట్ల‌ వ్య‌యంతో మొత్తం 5 సీవ‌రేజి ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్మాణం జ‌రుగుతుంది. వీటి మొత్తం సామర్థ్యం 66 ఎంఎల్‌డీలు. ఫాక్స్ సాగ‌ర్‌, వెన్నెల‌గ‌డ్డ‌, గాయ‌త్రిన‌గ‌ర్‌, ప‌రికిచెరువు, శివాల‌య‌న‌గ‌ర్ ప్రాంతాల్లో కొత్త ఎస్టీపీలు ఏర్పాటు కానున్నాయి.

జీహెచ్ఎంసీ ప‌రిధిలో జ‌రుగుతున్న ప‌లు అభివృద్ధి ప‌నుల‌తో పాటు జ‌ల‌మండ‌లి నిర్మిస్తున్న‌ కొత్త ఎస్టీపీల ప‌నుల‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న చేశారు. అనంత‌రం జ‌రిగిన కార్య‌క్ర‌మంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ…

హైద‌రాబాద్ న‌గ‌రంలో ప్ర‌స్తుతం ప్ర‌తీరోజు 2 వేల మిలియ‌న్ లీట‌ర్ల‌ మురుగునీరు ఉత్ప‌త్తి అవుతోందని, ఈ మొత్తం మురుగునీటిని ట్రీట్‌మెంట్ చేసిన త‌ర్వాత‌నే నాలాల్లోకి, చెరువుల్లోకి వెళ్లాల‌నే ఆలోచ‌న‌తో కొత్త ఎస్టీపీల నిర్మాణాన్ని చేప‌ట్టిన‌ట్లు తెలిపారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ప‌ర్యావ‌ర‌ణంపైన ఉండే ప్రేమ‌, హైద‌రాబాద్‌పైన ఉండే శ్ర‌ద్ధతోనే ఈ నిర్ణ‌యం తీసుకున్నట్లు చెప్పారు. రూ.3,866 కోట్ల‌తో న‌గ‌రంలో వంద శాతం మురుగు నీరు శుద్ధి చేసేందుకు 31 కొత్త ఎస్టీపీల నిర్మాణం చేప‌ట్టిన‌ట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా కుత్బుల్లాపూర్‌లో రూ.248.44 కోట్ల వ్య‌యంతో ఐదు ఎస్టీపీల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన‌ట్లు తెలిపారు.

హైద‌రాబాద్ చుట్టూ శివారు ప్రాంతాలు శ‌ర‌వేగంగా ఎదుగుతున్నాయని కేటీఆర్ అన్నారు. జ‌నాభా పెరుగుతున్నందున మౌళిక వ‌స‌తుల‌ను పెంచుకోవాల్సిన బాధ్య‌త మ‌న‌పై ఉందని పేర్కొన్నారు. ప్ర‌జ‌ల క‌నీస అవ‌స‌రాలు తీర్చాల‌నేది ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆలోచ‌న అని, ఇందులో భాగంగా గ‌త ట‌ర్మ్‌లో రూ.2000 కోట్ల‌తో జీహెచ్ఎంసీలో విలీన‌మైన శివారు ప్రాంతాల్లో, సుమారు రూ.800 కోట్ల‌తో ఔట‌ర్ రింగ్ రోడ్డు లోప‌లి ప‌లు గ్రామాలు, మున్సిపాలిటీల‌కు తాగు నీటి వ్య‌వ‌స్థ ఏర్పాటుచేసిన‌ట్లు తెలిపారు. ఇప్పుడు ఔట‌ర్‌ రింగ్ రోడ్డు లోప‌ల ఉన్న దాదాపు వెయ్యి గేటెడ్ క‌మ్యూనిటీలు, కాల‌నీల‌కు కూడా నీటిని అందించేందుకు రూ.1200 కోట్ల‌తో మంచినీటి వ్య‌వ‌స్థ ఏర్పాటుకు శంకుస్థాప‌న చేసుకోవ‌డం జ‌రిగింద‌న్నారు.

కేవ‌లం మంచినీటి కోస‌మే ఇప్ప‌టి సుమారు 2,800 కోట్లు, ఇప్పుడు రూ.1200 కోట్ల‌ను ఖ‌ర్చు చేయ‌డంతో పాటు కృష్ణా న‌ది నుంచి న‌గ‌రానికి నీటిని త‌ర‌లించే సుంకిశాల వ‌ద్ద రూ.1400 కోట్ల‌తో మ‌రొక లైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్ట‌డం జ‌రిగింద‌న్నారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కొండ‌పోచ‌మ్మ సాగ‌ర్‌, మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ నుంచి కూడా గోదావ‌రి నీళ్ల‌ను న‌గ‌ర తాగునీటి అవ‌స‌రాల కోసం త‌ర‌లించి గండిపేట‌ను నింప‌డానికి ప్ర‌తిపాద‌న‌లు రూపొందిస్తున్నామ‌ని అన్నారు. తాము ప్ర‌స్తుత‌ హైద‌రాబాద్ అవ‌స‌రాల కోసం మాత్ర‌మే కాకుండా రానున్న 30 ఏళ్ల హైదరాబాద్ గురించి ఆలోచిస్తున్నామ‌ని అన్నారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌కు 600 ఎంజీడీ నీటిని అందించే స్థాయికి చేరుకున్నామ‌ని, 2051 నాటికి మొత్తం 1000 ఎంజీడీ నీరు అవ‌స‌రం ప‌డుతుంద‌ని అంచ‌నా వేస్తున్నామ‌ని, ఈ నీటిని సైతం అందించేలా ప్ర‌ణాళిక‌బ‌ద్ధంగా ప‌ని చేస్తున్నామ‌ని అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో కార్మిక శాఖ‌ మంత్రి సీహెచ్‌.మ‌ల్లారెడ్డి, జీహెచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మీ, ఎమ్మెల్సీలు వాణిదేవి, శంభీపూర్ రాజు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, డిప్యూటీ మేయ‌ర్ శ్రీల‌త‌, జ‌ల‌మండ‌లి ఎండీ దాన‌కిశోర్‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.

31 కొత్త‌ ఎస్టీపీల వివ‌రాలు..

న‌గ‌రంతో పాటు శివారు మున్సిపాలిటీ ప్రాంతాల్లో.. సీవ‌రేజి మాస్ట‌ర్ ప్లాన్ లో భాగంగా మురుగు నీటి శుద్ధి కేంద్రాల‌ను(ఎస్టీపీ) నిర్మించాల‌ని జ‌ల‌మండ‌లి త‌ల‌పెట్టింది. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో మొత్తం మూడు ప్యాకేజీల కింద‌ నిత్యం 1257.50 ఎమ్మెల్డీల (మిలియ‌న్ లీట‌ర్ ప‌ర్ డే) మురుగు నీరు శుద్ధి చేయాల‌నే ల‌క్ష్యంతో మొత్తం 31 మురుగునీటి శుద్ధి కేంద్రాల‌ను (ఎస్టీపీ) జ‌ల‌మండ‌లి నిర్మిస్తుంది.

3 ప్యాకేజీల్లో నిర్మాణం

ఇందులో భాగంగా ప్యాకేజీ-I లో అల్వాల్, మ‌ల్కాజ్ గిరి, కాప్రా, ఉప్ప‌ల్ స‌ర్కిల్ ప్రాంతాల్లో.. రూ.1230.21 కోట్ల‌తో 8 ఎస్టీపీల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. వీటి ద్వారా 402.50 ఎమ్మెల్డీల మురుగు నీటిని శుద్ధి చేస్తారు.

ప్యాకేజీ-II లో రాజేంద్ర‌న‌గ‌ర్, ఎల్బీ న‌గ‌ర్ స‌ర్కిల్ ప్రాతాల్లో రూ. 1355.33 కోట్ల‌తో 6 ఎస్టీపీల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. ఇక్క‌డ 480.50 ఎమ్మెల్డీల మురుగు నీటిని శుద్ధి చేస్తారు.

ఇక మిగిలిన ప్యాకేజీ-III లో కూక‌ట్ ప‌ల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంప‌ల్లి స‌ర్కిల్ ప్రాంతాల్లో రూ.1280.87 కోట్ల వ్య‌యంతో 17 ఎస్టీపీల‌ను ఏర్పాటు చేసి, ఇక్క‌డ 376.5 ఎమ్మెల్డీల మురుగు నీటిని శుద్ధి చేయ‌నున్నారు. కుత్బుల్లాపూర్ స‌ర్కిల్ ప‌రిధిలో ప్యాకేజీ-III లో రూ.248.44 కోట్ల వ్య‌యంతో మొత్తం 5 సీవ‌రేజి ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్మాణం జ‌రుగుతుంది. వీటి మొత్తం సామర్థ్యం 66 ఎంఎల్‌డీలు. ఫాక్స్ సాగ‌ర్‌, వెన్నెల‌గ‌డ్డ‌, గాయ‌త్రిన‌గ‌ర్‌, ప‌రికిచెరువు, శివాల‌య‌న‌గ‌ర్ ప్రాంతాల్లో కొత్త ఎస్టీపీల నిర్మాణానికి మంత్రి కేటీఆర్ మంగ‌ళ‌వారం శంకుస్థాప‌న చేశారు.

I. కుత్బుల్లాపూర్ స‌ర్కిల్‌లో 5 ఎస్టీపీల కీల‌క అంశాలు

  1.  ఎస్టీపీల నిర్మాణ ఖ‌ర్చు – 248.44 కోట్లు (15 ఏళ్ల ఎంఓఎంతో క‌లిపి)
  2. ఎస్టీపీల సామ‌ర్థ్యం – 66 ఎంఎల్‌డీ
  3. ఎస్టీపీల సాంకేతిక‌త‌ – సీక్వెన్ష‌ల్ బ్యాట్చ్ రియాక్ట‌ర్స్‌(ఎస్‌బీఆర్‌)
  4. మొత్తం ఎస్టీపీలు – 5

సామ‌ర్థ్యం – ఖ‌ర్చు

  1. ఫాక్స్ సాగ‌ర్‌ – 14 ఎంఎల్‌డీ – 52.12కోట్లు
  2. వెన్నెల‌గ‌డ్డ‌ – 5 ఎంఎల్‌డీ – 23.80కోట్లు
  3. గాయత్రిన‌గ‌ర్‌ – 5 ఎంఎల్‌డీ – 23.80కోట్లు
  4. ప‌రికిచెరువు – 28 ఎంఎల్‌డీ – 96.59కోట్లు
  5. శివాల‌య‌న‌గ‌ర్‌ – 14 ఎంఎల్‌డీ – 52.13కోట్లు
Leave A Reply

Your email address will not be published.