ప్రకటనల కోసం వేల కోట్ల రూపాయలా..? సుప్రీంకోర్టు
ఢిల్లీ (CLiC2NEWS): రీజినల్ ర్యాపిడ్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ (RRRT) కోసం నిధులు మంజూరు చేయడంలో అలసత్వం వహించడంపై ఢిల్లీ ప్రభుత్వంను సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు ధర్మాసనం.. ప్రకటనల కోసం వేల కోట్ల రూపాయాలు ఖర్చు చేస్తున్నారు కానీ.. మౌలిక వసతుల కల్పన కోసం చేపట్టిన ప్రాజెక్టుకు ఎందుకు కేటాయించలేకపోతున్నారని ప్రశ్నించింది. గత మూడేళ్లో ఢిల్లీ ప్రభుత్వం ప్రకటనల కోసం రూ. 1,100 కోట్లు ఖర్చుచేసింది, మరి ప్రాజెక్టుకోసం కేవలం రూ. 415 కోట్లు ఎందుకు ఖర్చు చేయలేకపోయింది? అంతేకాకుండా ఈ ఏడాది కూడా ప్రకటనల కోసం రూ. 550 కోట్లు విడుదల చేసింది. అయితే ఈ ఏడాది జులై 24న విచారణ జరగగా.. ఆ సమయంలో నిధులు విడుదల చేస్తామని ఢిల్లీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ మాట నిలబెట్టుకోలేకపోయిందని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ నవంబర్ 28కి వాయిదా వేసింది.
నవంబర్ 28 లోగా ఆప్ ప్రభుత్వం ఆర్ ఆర్ టిఎస్ ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోతే.. ప్రభుత్వ ప్రకటనల కోసం విడుదల చేసిన నిదులను ప్రాజెక్టుకు మళ్లించాలని ఆదేశాలు జారీ చేసింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో దేశంలోనే తొలి ఆర్ఆర్‌టిఎస్ కారిడార్ నిర్మాణం నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పోరేషన్ చేపట్టింది. దీనికి అయ్యే మొత్తం వ్యయం రూ. 30 వేల కోట్లు. 85.2 కిలోమీటర్ల మేర ఢిల్లీ-ఘజియాబాద్-మేరఠ్ కారిడార్‌ను 2025 నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనిలో 17 కిలోమీటర్ల మేర తొలి దశ కారిడార్‌ను ప్రధాని మోడీ కిందటి నెల 20 న ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం, యుపి, ఢిల్లీ ప్రభుత్వాలు నిధులు కేటాయించాలి. కేంద్రం, యుపి ప్రభుత్వం తమ వాటా నిధులు విడుదల చేయగా.. ఢిల్లీ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు నిధులు విడుదల చేయలేదు.