బంగారు భారతదేశాన్ని తయారు చేసుకుందాం: సిఎం కెసిఆర్

సంగారెడ్డి (CLiC2NEWS): నారాయణఖేడ్ లో సంగమేశ్వర – బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు ముఖ్యమంత్రి కెసిఆర్ సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో సిఎం మాట్లాడుతూ.. సంగారెడ్డి ప్రజలకు ఇచ్చిన మాట మేరకు ఎత్తిపోతలకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని అన్నారు. బంగారు తెలంగాణను ఎలా తయారు చేసుకున్నామో.. బంగారు దేశాన్ని కూడా తయారు చేసుకుందామన్నారు.
తెలంగాణ ఉద్యమం జరిగే సందర్భంలో ఈ ప్రాంతానికి వస్తే పది మంది కార్యకర్తలు ఉండేవారు. ప్రజల్లో పెద్దగా ఆశ ఉండేది కాదు. కెసిఆర్ వస్తుండా.. పోతుండా.. తెలంగాణ వస్తదా.. రాదా..అని అనే సందేహాలు ఇక్కడి ప్రజల్లో ఉండేవి. వేరే పార్టీల వారు కూడా ప్రజలను గందరగోళానికి గురి చేసేవారు. తెలంగాణ వస్తే తప్ప పరిస్థితులు మారవని ఉద్యమం చేశా. ఉదృతంగా ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్నాం.