జింఖానా మైదానం వద్ద ఉద్రిక్తత.. లాఠీఛార్జీ..
హైదరాబాద్ (CLiC2NEWS): 25వ తేదీన భారత్-ఆస్ట్రేలియా జల్ల మధ్య హైదరాబాద్ ఉప్పల్ వేదికగా మూడో టి20 జరుగనున్న విషయం తెలిసిందే. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ వీక్షించేందుకు సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో టెక్కెట్ అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో జింఖానా మైదానం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టిక్కెట్ల కోసం అంచానాలకు మించి అభిమానులు వచ్చారు. భారీగా అభిమానులు తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో కొంత మంది అభిమానులు స్పృహ పత్పి పడిపోయారు. టిక్కెట్ల కోసం ప్యారాడైజ్ కూడలినుంచి జింఖానా మైదానం వరకు భారీ క్యూలైన్ ఏర్పాటు చేశారు. భారీగా వచ్చిన అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు. మెయిన్ గేట్ వైపు ఒక్కసారిగా భారీ సంఖ్యలో అభిమానులు తోసుకుని రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో పోలీసులు లాఠీ చార్జీ చేశారు. స్వల్ప తొక్కిసలాట జరిగింది. దాదాపు 20 మందికి పైగా అభిమానులు స్పృహతప్పి పడిపోయారు. ఈ ఘటనలో 10 మందికి పైగా పోలీసులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిలో యువతులు కూడా ఉన్నారు.
కాగా ఈ నేపథ్యంలో హెచ్‌సిఎ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టికెట్ల విక్రయం కోసం జింఖానా మైదానంలో నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఆన్లైన్ పేమెంట్లకు సాంకేతిక లోపం తలెత్తింది. ఎటిఎం కార్డులు, యూపిఐ పేమెంట్లకు అధికారులు అనుమతించలేదు. కేవలం నగదు చెల్లింపులకు మాత్రమే టికెట్లు విక్రయించారు. ఈ నేపథ్యంలో హెసిఎ ప్రణాళిక లేకుండా టికెట్లను విక్రయిస్తోందని పలువురు అభిమానులు మండిపడ్డారు. హెసిఎ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు విఐపి పాస్‌ల కోసం తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు ఉండటంతో హెస్సిఎ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.