హోంగార్డును సత్కరించిన హైకోర్టు చీఫ్ జస్టిస్
హైదరాబాద్ (CLiC2NEWS): విధులను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తున్న ఓ ట్రాఫిక్ హోంగార్డుకు ఊహించని సత్కారం లభించింది. స్వయంగా తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ హోంగార్డుకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే… ఆష్రాఫ్ అలీ అనే హోం గార్డు అబిడ్స్ ట్రాఫిక్ విభాగంలో హోంగార్డుగా పనిచేస్తున్నారు. బషీర్‌బాగ్‌లోని బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహం కూడలి వద్ద ఆయన విధులు నిర్వహిస్తున్నారు. ఆష్రఫ్ తన విధులను చిత్తశుద్ధితో నిర్వహించడాన్ని చీఫ్ జస్టిస్ ప్రతి రోజు గమనించేవారు. ఈ క్రమంలో అతని పనితీరును పట్ల ఆకర్షితులైన సిజె సతీశ్‌చంద్రశర్మ… శుక్రవారం ఉదయం తన కాన్వాయ్‌ను బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహం వద్ద ఆపారు. హోంగార్డు ఆష్రఫ్ అలీకి పుష్పగుచ్ఛం అందించి.. అభినందించారు. ఈ సందర్భంగా ఆష్రఫ్ అలీ పనితీరును మెచ్చుకుంటూ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశంసలు కురిపించారు.
హైకోర్టు సిజె సతీశ్‌చంద్ర శర్మ తనను అభినందించడం గర్వంగా ఉందని ఆష్రాఫ్ అలీ ఆనందం వ్యక్తం చేశారు. మరింత ఉత్సాహంగా తన విధులు నిర్వహిస్తానని తెలిపారు. హోంగార్డును ట్రాఫిక్ ఉన్నతాధికారులు కూడా పలువురు అభినందించారు.