ఒక సామాన్య పౌరుడి ఇంటి నిర్మాణంలో ఎన్నో ఏళ్ల శ్రమ,కలలు ఉంటాయి: సుప్రీంకోర్టు
ఢిల్లీ (CLiC2NEWS): ఒక సామాన్య పౌరుడి ఇంటి నిర్మాణంలో అతడి ఎన్నో ఏళ్ల శ్రమ, కలలు కలగలిసి ఉంటాయి. దానిలో వారి భవిష్యత్తు, భద్రత ఇమిడి ఉంటుంది. రాష్ట్రాల ఏకపక్ష చర్యల నుండి పౌర హక్కులకు రాజ్యాంగం రక్షణ కల్పిస్తుంది. ఏకపక్షంగా వ్యక్తుల ఆస్తులను ఎలా కూల్చివేస్తారని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. బుల్డోజర్ కూల్చివేతలు తగవని నేడు స్పష్టం చేసింది. కూల్చివేతలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది.
అధికారులు ఒక వ్యక్తి దోషి అని తేల్చి చెప్పలేరని, న్యాయమూర్తిలా వ్యవహరించి నిందితుల స్థిరాస్తులను కూల్చివేయడం తగదని స్పష్టం చేసింది. రాష్ట్రాలు, ఆయా ప్రభుత్వాల అధికారులు మితిమీరిన చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే ధిక్కార చర్యలు తీసుకుంటామని ధర్మాసనం హెచ్చరించింది. కూల్చివేత ప్రక్రియలో నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే, ఆ ఆస్తి పునరుద్ధరణకు సంబంధించిన పరిహారాన్ని అధికారుల జీతం నుండి వసూలు చేస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఇటీవల బుల్డోజర్ న్యాయం పేరుతో పలు రాష్ట్రాలు.. అక్రమ కట్టడాలను బుల్డోజర్‌లతో కూల్చివేసిన సంగతి తెలిసిందే. రహదారులు,పుట్‌పాత్‌లు,జలాశయాలు , ప్రభుత్వ స్థలాల పరిధిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఇది దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలలో కొనసాగింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు నిందితుల ఇళ్లు , ప్రేవేటు ఆస్తులపైకి బుల్డోజర్‌లను పంపించడాన్ని ఉన్నత న్యాయస్తానం ఇప్పటికే పలుమార్లు తప్పుబట్టింది. ఇది సరికాదని స్పష్టం చేస్తూ.. అక్రమంగా ఒక కట్టడాన్ని ధ్వంసం చేసినా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్లేనని హెచ్చరించింది.
అక్రమ కట్టడాల తొలగింపు కోసం ఇంటి యజమానికి 15 రోజుల గడువు ఇవ్వాలి. అంతేకాకుండా మూడు నెలల్లో మున్సిపల్ అధికారులు ఒక డిజిటల్ పోర్టల్ను సిద్ధం చేయాలి. ఇప్పటివరకు ఇచ్చిన షోకాజ్ నోటీసులు, అక్రమ నిర్మాణాలపై తుది ఉత్తర్వులకు సంబంధింఇంచినవివరాలు అందులో పొందుపరచాలి అని ధర్మాసనం తీర్పునిచ్చింది.