ముందు అనుమతులు.. తర్వాత కూల్చివేతలా..?

హైదరాబాద్ (CLiC2NEWS): అక్రమ నిర్మాణాలు కూల్చివేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించనవసరంలేదని ఉన్నత న్యాయస్థానం తెలపింది. అక్రమమని తెలిసీ.. అధికారులు అనుమతులు ఇచ్చినపుడు , వాటిని కూల్చి వేసినందుకు ప్రభుత్వం ఎందుకు చెల్లించాలని హైకోర్టు ప్రశ్నించింది. ఆ నష్ట పరిహారాన్ని అధికారులు నుండే రాబట్టాలి. వారి ఆస్తులను జప్తు చేయాలి. చెరువులు, కుంటలు వంటి జలవనరుల్లో నిర్మాణాలకు అనుమతులు ఎలా మంజూరు చేశారని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కుడ గ్రామంలోని మంగర్షి కుంట ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్న నిర్మాణాలను తొలగించాలంటూ ఇరిగేషన్ అధికారులు నోటీసులు ఇచ్చారు. దీనిని సవాల్ చేస్తూ కొందరు హైకోర్టును అశ్రయించారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం బుధవారం విచారణ చేపట్టింది. డిసెంబర్ 4వ తేదీన నీటి పారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గోడకు నోటీసులు అతికించారని, ఏడు రోజుల్లో ఎఫ్‌టిఎల్/ బఫర్ జోన్ పరిధిలో ఉన్న నిర్మాణాలనున తొలగించాలని దానిలో పేర్కొన్నారు. అనుమతులు తీసుకొని నిర్మించిన రేకుల ఇళ్లనుకూల్చివేయడానికి ప్రయత్నిస్తున్నారని.. తమ నిర్మాణాల విషయంలో జోక్యం చేసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు.
వాదనలు విన్న న్యాయమూర్తి .. అధికారులు ఇచ్చిన అనుమతులతో కట్టుకున్న ఇళ్లను ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించారు. బఫర్ జోన్/ ఎఫ్‌టిఎల్ పరిధి ఎంత మేర ఉంటుందో స్పష్టత ఉంటుందని.. ఇరిగేషన్, మున్సిపల్ , పంచాయతీ అధికారులు జిఒ 168 ప్రకారం అనుమతలును ఎందుకివ్వరని ప్రశ్నించింది. అక్రమ నిర్మాణాలు కూల్చివేసి.. చెరువులు పరిరక్షణ చేపట్టాలని సుప్రీంకోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. అలాగని నిబంధనలను ఉల్లంఘించరాదని తెలిపింది. అక్రమ నిర్మాణాలని తేలినపుడు నోటీసులు జారీ చేసి, వివరణ తీసుకుని చర్యలకు ఉపక్రమించాల్సి ఉంటుందని తెలపింది. ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన నోటీసులపై పిటిషనర్లు 15 రోజుల్లో అన్ని ఆధారాలు, పత్రాలతో సమాధానం ఇవ్వాలని.. ఈ లోగా నోటీసులపై ఎలాంటి చర్యలు తీసుకోరాధని అధికారులను ఆదేశించారు.