ప‌రీక్ష‌కు ముందురోజు రాత్రే నీట్ పేప‌ర్ అందింది.. అంగీక‌రించిన విద్యార్థులు

NEET 2024: దేశ‌వ్యాప్తంగా వైద్య‌విద్య కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు నిర్వ‌హించే నీట్ – యుజి ప్ర‌వేశ ప‌రీక్ష ప్ర‌శ్నా పత్రం లీకేజి నిజ‌మేన‌ని.. ప‌రీక్ష ముందు రోజు రాత్రే పేప‌ర్ అందింద‌ని కొంద‌రు విద్యార్థులు పోలీసుల ఎదుట అంగీక‌రించారు. నీట్ ప్‌శ్నాప‌త్రం లీకేజి ఆరోప‌ణ‌ల‌పై ద‌ర్యాప్తు చేసిన సిట్ ఇప్ప‌టివ‌ర‌కు 14 మందిని అరెస్టు చేసింది. వీరిలో బిహార్ ప్ర‌భుత్వ విభాగంలో ప‌నిచేసే ఓ జూనియ‌ర్ ఇంజినీర్‌తో పాటు ముగ్గురు నీట్ అభ్య‌ర్థులు కూడా ఉన్నారు. ఈ ముగ్గ‌రిలో ఒక‌రు జూనియ‌ర్ ఇంజినీర్‌కు స్వ‌యానా మేన‌ల్లుడు కావ‌డం గ‌మ‌నార్హం. త‌న మామ‌య్య నీట్ ప‌రీక్షకు ముందు రోజు రాత్రి ప్ర‌శ్నాప‌త్రంతో పాటు ఆన్స‌ర్ షీట్ కూడా ఇచ్చిన‌ట్లు తెలిపాడు. ఆరాత్రంతా బ‌ట్టీ ప‌ట్టి .. మ‌రుస‌టి రోజు ప‌రీక్ష కేంద్రానికి వెళ్లిన త‌ర్వాత చూస్తే.. తాము చ‌దివిన పేప‌ర్‌తో పూర్తిగా మ్యాచ్ అయిన‌ద‌ని వెల్ల‌డించాడు. ఇదే విష‌యాన్ని లిఖిత‌పూర్వ‌కంగా పోలీసుల‌కు రాసిచ్చాడు.

నీట్ ప‌రీక్ష మే నెల 5వ తేదీన నిర్వ‌హించ‌గా.. నీట్ యుజి 2024 ఫ‌లితాల్లో 67 మంది విద్యార్థులు ఆలిండియా ఫ‌స్ట్ ర్యాంకును సాధించారు. దీనిపై స‌ర్వ‌త్రా అనుమానాలు రేకెత్తాయి. పేప‌ర్ లీక్ జ‌రిగింద‌ని ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. ఆ ర్యాంక‌ర్ల‌లో కొంద‌రు ఒకే ఎగ్జామ్ సెంట‌ర్ నుండి వ‌చ్చిన వారు కూడా ఉండ‌టంతో ఆందోళ‌న‌లు పెరిగాయి. వైద్య వృత్తి కోర్సుల్లో ప్ర‌వేశాలు క‌ల్పించేందుకు నిర్వ‌హించే నీట్‌ పరీక్ష లో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని దేశ‌వ్యాప్తంగా ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ద‌ర్యాప్తున‌కు ఆదేశించింది. ఈ ద‌ర్యాప్తులో విస్తుపోయే వాస్త‌వాలు వెలుగుచూశాయి. బీహార్లో చేప‌ట్టిన ద‌ర్యాప్తులో సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. నీట్ పేప‌ర్‌ను లీక్ చేసినందుకు అభ్య‌ర్థుల నుండి రూ. 30 ల‌క్ష‌ల చొప్పున వ‌సూలు చేసిన‌ట్లు స‌మాచారం.

నీట్ ప్ర‌శ్నాప‌త్రం లీక్ అయిన‌ట్లు ప‌లు నేష‌న‌ల్ మీడియాల్లో వార్త‌లు రావ‌డంతో దేశ‌వ్యాప్తంగా విద్యార్థులు వారి త‌ల్లిదండ్రులు తీవ్ర ఆందోళ‌నలు చేప‌ట్టారు. దీంతో బీహార్ ప్ర‌భుత్వం స్పెష‌ల్ ఇన్వెస్టిగేష‌న్ టీమ్ – సిట్ ను ఏర్పాటు చేసింది. కానీ.. కేంద్ర ప్ర‌భుత్వం, నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ () ప‌రీక్ష‌లో ఎటువంటి అక్ర‌మాలు జ‌ర‌గలేద‌ని తెలిపింది. ద‌ర్యాప్తు ప్రారంభించిన సిట్ అధికారులు ఈ కేసులో ఇప్ప‌టి వ‌ర‌కు 14 మందిని అరెస్ట్ చేశారు. వారిలో బీహార్ ప్ర‌భుత్వ విభాగంలో ప‌నిచేసే ఓ జూనియ‌ర్ ఇంజినీర్ ఉన్నాడు. అత‌నిని ప‌లు ర‌కాలుగా విచార‌ణ చేయ‌గా.. పేప‌ర్ లీక్ గ్యాంగ్ తో క‌లిసి తాను అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డిన‌ట్లు అంగీక‌రించిన‌ట్లు స‌మాచారం. అఏదే విధంగా నీట్ రాసే విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌తో తాను ట‌చ్‌లో ఉన్న‌ట్లు ఇంజినీర్ సిట్‌కు వెల్ల‌డించిన‌ట్లు సమాచారం.

 

Leave A Reply

Your email address will not be published.