జి20 అధ్యక్ష బాధ్యతలు బ్చెజిల్కు అప్పగింత

ఢిల్లీ (CLiC2NEWS): దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం రెండవ రోజు జి20 సదస్సు ముగిసింది. తదుపరి అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డసల్వాకు ప్రధాని నరేంద్ర మోడీ అప్పగించారు. రెండవ రోజు వివిధ దేశాధిపతులు రాజ్‌ఘాట్‌కు చేరుకొని మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం భారత్ మండపానికి చేరుకున్నారు. ఆదివారం ప్రధాని మోడీ ఓ కీలకసూచన చేశారు. ప్రస్తుత సదస్సులో చేసిన సిఫార్సులు, తీర్మానాలను అంచనా వేయడానికి నవంబరు నెల చివర్లో వర్చువల్ సమావేశం నిర్వహించాలని సమావేశంలో దేశాధినేతలకు సూచించారు. అప్పటి వరకు భారత నాయకత్వమే కొనసాగుతుందని తెలిపారు. మీరందరూ ఈ సమావేశంలో పాల్గొంటారని ఆశిస్తున్నన్నారు.
సదస్సులో ప్రధాని మోడీ.. ఐక్యరాజ్య సమితి సహా అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అవసరమన్నారు. ఐరాసలో సభ్యదేశాలు పెరుగుతున్నప్పటికీ భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశాల సంఖ్య మారడం లేదన్నారు. ఐరాస ఏర్పడినపుడు 51దేశాలు సభ్యులుగా ఉన్నాయని.. ప్రస్తుతం ఆసంఖ్య 200కి చేరిందన్నారు. కాలానికి అనుగుణంగా మార్పుచెందని వారు ప్రాముఖ్యాన్ని కోల్పోతారని మోడీ స్పష్టం చేశారు. క్రిప్టో కరెన్సీ నియంత్రించేందుకు అంతర్జాతీయ ప్రమాణాలను రూపొందిచడం అవసరమన్నారు.