తొలి అండర్‌వాటర్ మెట్రో.. ప్రారంభించిన ప్రధానమంత్రి

కోల్‌కతా (CLiC2NEWS): దేశంలో తొలిసారిగా అండర్‌వాటర్ మెట్రో రైలును ప్రధాని నరేంద్రమోడి బుధవారం ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో నీటి అడుగున మెట్రో టన్నెల్ మార్గాన్ని నిర్మించారు. దేశంలో మొదటి సారిగా మెట్రో సేవలు 1984లో ప్రారంభమైంది కూడా కోల్‌కతాలోనే. తాజాగా నీటి అడుగున మెట్రో రైలు కూడా ఈ నగరంలోనే ప్రారంభమైంది. కోల్‌కతాలో అండర్‌వాటర్ మెట్రోతో పాటు పలు మెట్రో ప్రాజెక్టులను మోడీ ప్రారంభించారు. మెట్రో రైలును ప్రారంభించిన అనంతరం విద్యార్థులతో కలిసి రైలులో ప్రయాణించారు. ఎస్‌ప్లనేడ్ నుండి హావ్‌డా మైదాన్ స్టేషన్ వరకు ప్రధాని ప్రయాణించారు. ఆయనతో పాటు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్, ఎమ్మెల్యే సువేందు అధికారి ఉన్నారు.
ఈస్ట్-వెస్ట్ మెట్రో కారిడార్ పనులు 2009 ఫిబ్రవరిలో మొదలైంది. ఈ అండర్ వాటర్ మార్గం నిర్మాణం 2017లో ప్రారంభించారు. దాదాపు రూ.120 కోట్ల వ్యయంతో ఈ సొరంగ రైలు మార్గాన్ని హుగ్లీ నది దిగువన నిర్మించారు. కోల్‌కతా ఈస్ట్-వెస్ట్ మెట్రో మార్గం పొడవు మొత్తం 16.6 కిలోమీటర్లు.. దీనిలో 10.8 కిలోమీటర్లు భూగర్భంలో ఉంటుంది. హావ్‌డా మైదాన్ నుండి ఎస్‌ప్టెనెడ్ స్టేషన్ల మధ్య 4.8 కిలో మీటర్ల మేర ఉన్న లైనులో భాగంగా 520 మీటర్ల పొడవైన అండర్‌వాటర్ మెట్రో టన్నెల్‌ను నిర్మించారు,. ఈ దూరాన్ని మెట్రో రైలు 45 సెకన్లలో దాటుతుంది.