సమతామూర్తి విగ్రహం ప్రపంచంలో ఎనిమిదో అద్భుతం
-ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
హైదరాబాద్ (CLiC2NEWS): ముచ్చింతల్లోని సమతా క్షేత్రాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రులు ప్రహ్లాద్ జోషి, అశ్వనీకుమార్ చౌబే సందర్శించారు. 216 అడుగుల శ్రీభగవద్రామానుజుల విగ్రహాన్ని దర్శించుకున్నారు. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలోని 108 దివ్యదేశాలను సందర్శించారు. ఆలయాల విశిష్టతను, సమతామూర్తి ప్రాంగణ విశేషాలను వారికి వివరించారు త్రిదండి చిన జీయర్ స్వామీ, మైహోంగ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు. అనంతరం డిజిటల్ గైడ్ ద్వారా రామానుజాచార్యుల జీవితచరిత్రను తెలుసుకున్నారు. ఉపరాష్ట్రపతి సహా అతిథులకు రామానుజాచార్యుల ప్రతిమను బహూకరించి సత్కరించారు త్రిదండి చిన్నజీయర్ స్వామీ, మైహోంగ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు.
ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. 216 అడుగుల సమతామూర్తి విగ్రహ ఏర్పాటు ప్రపంచంలో ఎనిమిదో అద్భుతం ఉపరాష్ట్రతి వెంకయ్యనాయుడు అని అన్నారు. ఈ మహత్ కార్యాన్ని విజయవంతం చేసిన త్రిదండి చిన్నజీయర్ స్వామీజీకి, మై హోంగ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావుకు భారత ప్రభుత్వం తరపున అభినందనలు తెలుపుతున్నానన్నారు. సనాతన ధర్మ విప్లవానికి నాందిపలికిన శ్రీభగవద్రామానుజుల విగ్రహాన్ని సందర్శించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సామాజిక సంస్కరణ అభిలాషిగా సమాజంపై రామానుజాచార్యులు చెరగని ముద్ర వేశారన్నారు. ఆయన సమాజంలోని అసమానతలను తొలగించేందుకు కృషి చేశారన్నారు. కుల, లింగ వివక్షపై వెయ్యేళ్ల క్రితమే పోరాడిన మహనీయులు రామానుజాచార్యులన్నారు అని అన్నారు. విశిష్ట అద్వైత సిద్ధాంతంతో సమాజంలో వివక్షను పారదోలారన్నారు. కులం కన్నా గుణం మిన్నా అని చెప్పడమే కాకుండా ఆచరణలో చూపించారన్నారు. ప్రతి ఒక్కరూ కన్నతల్లి, జన్మభూమి, మాతృభాష, మాతృదేశాన్ని, గురువును గుర్తుపెట్టుకోవాలి పేర్కొన్నారు. పీఠాధిపతులు, మఠాధిపతులు భక్తిమార్గం ద్వారా జనానికి మంచి మార్గాన్ని చూపించాలన్నారు. త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ భక్తిమార్గంలో ప్రజలకు మంచి మార్గాన్ని చూపిస్తున్నారన్నారని ఉపరాష్ట్రపతి కొనియాడారు.
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ..
త్రిదండి చిన్నజీయర్ స్వామీ ముచ్చింతల్లో 216 అడుగుల రామానుజాచార్యుల విగ్రహం ఏర్పాటు చేసి అద్భుతం చేశారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఉత్తరాన ఆదిశంకరాచార్యుల విగ్రహం, దక్షిణాన రామానుజాచార్యుల విగ్రహం ఏర్పాటు చేయడం ద్వారా హిందూ సంస్కృతి పునరుద్ధరణకు నాంది పలికినట్టు అయిందన్నారు. రామానుజాచార్యులు కులాలను రూపుమాపి సమాజంలో సమానత్వాన్ని పెంపొందించారన్నారు. రామానుజాచార్యుల భారీ విగ్రహాన్ని చూస్తుంటేనే స్ఫూర్తి కలుగుతుందన్నారు. భగవద్రామానుజాచార్యుల సమతా సందేశం భవిష్యత్ తరాలకు అందుతుందని మంత్రి పేర్కొన్నారు.
హర్యానా గవర్నర్ దత్తాత్రేయ మాట్లాడుతూ..
భారత్కు సమతామూర్తి విగ్రహం శోభాయమానంగా నిలుస్తుందని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. వెయ్యేళ్ల క్రితమే రామానుజాచార్యులు అంటరానితనం, కుల వివక్షపై పోరాడారన్నారు. రామానుజాచార్యులు మానవునిలోనే మాధవుడు ఉన్నాడని ఆనాడే చెప్పిన మహనీయుడని పేర్కొన్నారు. దైవభక్తి, దేశభక్తి భారత్కు కవచాల లాంటివన్నారు. ఆధ్యాత్మికత లేకపోతే భారతదేశం లేదన్నారు. మనదేశంలో ఆధ్యాత్మికత పెంపొందించేందుకు రామానుజాచార్యులు విశేష కృషిచేశారని పేర్కొన్నారు.
తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ..
తెలంగాణలో ఏర్పాటు చేసిన 216 అడుగుల సమతా మూర్తిపై ప్రపంచమంతా మాట్లాడుకోవడం సంతోషంగా ఉందని తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ, మైహోంగ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు విగ్రహ ఏర్పాటు కోసం అహర్నిషలు కృషి చేశారన్నారు.
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ..
సమతామూర్తిని దర్శించుకోవడం తన పూర్వజన్మ సుకృతమని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. సమతామూర్తి భారీ విగ్రహం ప్రపంచంలో ఎనిమిదో అద్భుతమన్న ఉపరాష్ట్రపతి వ్యాఖ్యలు అక్షరసత్యమన్నారు. 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ, మైహోంగ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు చరిత్రలో నిలిచిపోతారన్నారు.
ఇంకా ఇవాళ నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ హరీశ్ శంకర్ రామానుజాచార్యుల భారీ విగ్రహాన్ని దర్శించుకున్నారు . 108 దివ్యదేశాలను సందర్శించారు.