గుజరాత్‌లో తీగల వంతెన కూలి.. 60 మంది మృతి

అహ్మదాబాద్ (CLiC2NEWS): గుజరాత్‌లోని మోర్బీ పట్టణంలో ఉన్న మచ్చూనదిపై ఉన్నటువంటి తీగల వంతెన కూలిపోయింది. ఈ ప్రమాదంలో భారీ సంఖ్యలో సందర్శకులు నదిలో పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సత్వరమే సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. ఇటీవలే ఈ తీగల వంతెనకు మరమ్మతులు పూర్తిచేసి తిరిగి ప్రారంభించిన ఐదు రోజులకే ఈ ప్రమాదం జరిగింది. ఆదివారం కావడంతో భారీ సంఖ్యలో సందర్శకులు ఈ వంతెనపై ఉండటంతో.. సామర్థ్యానికి మించి బరువు ఎక్కువై వంతెన కూలినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్రమోడి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మరోవైపు రాష్ట్ర సిఎం భూపేంద్ర పటేల్ మోర్బికి బయలుదేరారు. ఈ ప్రమాదంలో మరణించిన వారికి తన సంతాపం ప్రకటించిన సిఎం.. వారి కుటుంబాలకు ప్రభుత్వం తరపున రూ. 4లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50వేలు చొప్పున పరిహారం ప్రకటిస్తూ ట్వీట్ చేశారు. ప్రధాన మంత్రి సహాయనిధి నుండి మృతులకు రూ. 2లక్షలు.. క్షతగాత్రులకు రూ. 50వేలు చొప్పున పరిహారం ప్రకటించారు.