కోవిడ్ నియమాలు పాటిస్తూ పనులు జరగాలి: జలమండలి ఎండీ
ఎస్టీపీల పనులపై జలమండలి ఎండీ సమీక్ష

హైదరాబాద్ (CLiC2NEWS): కరోనా నియమాలు పాటించడంతో పాటు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఎస్టీపీల నిర్మాణ పనులు జరగాలని జలమండలి ఎండీ దానకిశోర్ సూచించారు. గురువారం ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో ఆయన కొత్త ఎస్టీపీల నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు. నిర్మాణ సంస్థల ప్రతినిధులు, అధికారులతో మాట్లాడి ఎస్టీపీల నిర్మాణ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ సైట్ల వద్ద ఉన్న అధికారులతో జూమ్ ద్వారా ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా దానకిశోర్ మాట్లాడుతూ… క్షేత్రస్థాయిలో పని చేసే కార్మికులు, అధికారులు అన్ని కోవిడ్ జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరు మాస్కులు ధరించేలా చూడాలన్నారు. అలాగే, నిర్మాణ సైట్ల వద్ద శానిటైజర్లు, మాస్కులు అందుబాటులో ఉంచాలని సూచించారు.
ఇప్పటికే పలు ఎస్టీపీల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తైందని, మిగతా ఎస్టీపీల వద్ద కెమెరాలు ఏర్పాటుచేసి ఖైరతాబాద్ జలమండలి ప్రధాన కార్యాలయానికి అనుసంధానం చేయాలని సూచించారు. పలు ఎస్టీపీలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న సాయిల్ టెస్టులు, డిజైన్‌ల తయారీ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. పనులు జరుగుతున్న చోట్ల సైట్ ఇంజనీర్ల కొరత లేకుండా చూసుకోవాలని, మూడు షిఫ్టుల్లో 24 గంటలూ పనులు జరగాల్సి ఉన్నందున, అందుకు సరిపడా సైట్ ఇంజనీర్లు ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ బాబు, జలమండలి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.