ద్విచక్ర వాహనం నడుపుతూ ముగ్గురు చిన్నారులు దుర్మరణం
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలో ముగ్గురు విద్యార్థులు రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అత్తాపూర్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. సోమవారం అర్ధరాత్రి దాటిన అనంతరం ముగ్గురు చిన్నారులు ద్విచక్ర వాహనం నడుపుతూ ప్రమాదానికి గురయ్యారు. ఆర్ధరాత్రి ఒంటిగంట దాటాక ముగ్గురు జూపార్క్ నుండి ఆరాంఘర్ వరకు కొత్తగా నిర్మించిన ఫ్లై ఓవర్‌పై ప్రయాణిస్తూ డివైడర్‌ను ఢీకొట్టారు. ముగ్గురి తలలకు తీవ్రగాయాలై ప్రాణాలు కోల్పోయారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని అత్తాపూర్ ఠాణా పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాతనగరానికి చెందిన ఇలియాస్ కుమారుడు అహ్మద్, మొహినుద్దీన్ ఖాద్రి కుమారుడు మహ్మద్ ఖాద్రి ఎనిమిదవ తరగతి చదువుతున్నారు. వీరితో పాటు అదే ప్రాంతానికి చెందిన పదో తరగతి చదువుతున్న రహీమ్ కుమారుడుఇమ్రాన్తో కలిసి సోమవారం ద్విచక్ర వాహనంపై బయలు దేరారు. ఆరోజంతా పలు ప్రాంతాలకు తిరిగి , అర్ధరాత్రి ఒంటిగంట దాటాక జూపార్క్ నుండి ఆరాంఘర్ వరకు కొత్తగా నిర్మించిన ఫ్లై ఓవర్ పైకి ఎక్కారు. వారి బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి, విద్యుత్ స్తాంభాన్ని ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలై ప్రాణాలు కోల్పోయారు. మహ్మద్ ఖాద్రి అక్కడికక్కడే మృతి చెందగా.. ఇమ్రాన్ , అహ్మద్‌లు ఉస్మానియా ఆస్పత్రి తరలిస్తుండగా మృతి చెందారు.