రక్షణ దళానికి చెందిన హెలికాప్టర్ కూలి ముగ్గురు మృతి
పోర్ బందర్ (CLiC2NEWS): గుజరాత్‌లోని పోర్ బందర్ తీరంలో రక్షక దళానికి చెందిన ఎఎల్ హెచ్ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సిబ్బంది మృతి చెందినట్లు సమాచారం. సాంకేతిక సమస్యల కారణంతో హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. గతేడాది కూడా ఈ శ్రేణి హెలికాప్టర్లు ప్రమాదాలకు గరయ్యాయి. గతేడాది మార్చి 8వ తేదీన నౌకాదళానికి చెందిన ఎఎల్ హెచ్ ధ్రువ్ ముంబయి తీరంలో ప్రమాదానికి గురైంది. అందులోని ముగ్గురు సిబ్బందిని నేవీ పెట్రోలింగ్ ఎయిర్‌క్రాప్ట్ సాయంతో రక్షించారు. ఈ ఘటన అనంతరం వీటి వినియోగాన్ని త్రివిధ దళాల్లో నిలిపివేసినట్లు సమాచారం.
కొంతకాలం తర్వాత సైన్యం ఈ హెలికాప్టర్ల సేవలను పునరిద్దరించింది. అయితే, మరో హెలికాప్టర్ కూలిపోవడం గమనార్హం. ఈ హెలికాప్టర్ ప్రయాణం మొదలు పెట్టాక సాంకేతిక సమస్యలను ఎదుర్కొంది. తర్వాత కొంతసేపటికే కూలిపోయింది. దీనిపై కోస్టు గార్డు దర్యాప్తు చేపట్టింది. ప్రమాద సమయంలో ఇద్దరు పైలట్స్ ఉన్నట్లు భావిస్తున్నారు.