విజయవాడలో ప్రయాణికులపైకి దూసుకెళ్లిన బస్సు.. ముగ్గురు మృతి
విజయవాడ (CLiC2NEWS): బస్టాండ్‌లో ఉన్న ప్రయాణికులపైకి దూసుకెళ్లింది ఓ అర్‌టిసి బస్సు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. నగరంలోని పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో 12వ ప్లాట్‌ఫాంపై వేచిఉన్న ప్రయాణికులపైకి బస్సు దూసుకొచ్చింది. మరణించిన వారిలో ఆర్‌టిసి బుకింగ్ క్లర్క్, ఓ మహిళ, చిన్నారి ఉన్నారు. మరో మహిళకు గాయాలయ్యాయి. బస్టాండ్‌లోని 11,12వ ప్లాట్‌ఫాంల వద్ద దిమ్మెలు విరిగి ఫెన్సింగ్, కుర్చీలు ధ్వంసమయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 24 మంది ప్రయాణికులు ఉన్నారు.
ఘటనా స్థలాన్ని అర్‌టిసి ఎండి ద్వారకా తిరుమలరావు పరిశీలించారు. ఈ ప్రమాదంపై 24 గంటల్లో పూర్తి స్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు పరిహారం అందజేస్తామన్నారు.
ఆర్‌టిసి బస్సు ప్రమాదం గురించి తెలుసుకున్న సిఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఆర్ధిక సాయం ఇవ్వనున్నట్లు తెలిపారు.