వయనాడ్‌లో మహిళపై పెద్దపులి దాడి
వయనాడ్ (CLiC2NEWS): కేరళలోని వయనాడ్ జిల్లాలో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళపై పెద్దపులి దాడి చేయడంతో ఆమె మృతి చెందింది. మనంతవాడి సమీపంలో ఉన్న కాఫీ తోటలో పనిచేస్తున్న రాధ అనే మహిళపై పులి దాడి చేసింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగా ఇలా జరిగిందంటూ నిరసనలకు దిగారు. ప్రజలపై మృగాల దాడులకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.
మనంతవాడి ఎమ్మెల్యే, కేరళ ఎస్‌సి, ఎస్‌టి సంక్షేమ శాఖ మంత్రి కార్యాలయం వద్ద ప్రజలు నిరసనలు చేపట్టారు. గత పదేళ్ల నుండి జంతువుల దాడిలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని.. ఎన్ని సార్లు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. మనుషులపై అడవి జంతువుల దాడి చేయడం తగ్గిందంటూ అటవీ శాఖ మంత్రి శశీంద్రన్ అసెంబ్లీలో ప్రకటించారు. ఆ మరుసటి రోజే ఈ ఘటన చోటుచేసుకుంది. మహిళపై దాడి చేసిన పులిని పట్టుకోవాలని స్థానికులు డిమాండ్ చేయగా.. దానిని బంధించేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అటవీ ప్రాంతాలకు సమీపంగా ఉండే గ్రామల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.