శ్రీవాణి ట్రస్టు రద్దు.. టిటిడి కీలక నిర్ణయాలు వెల్లడి..
తిరుమల (CLiC2NEWS): తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన సోమవారం ధర్మకర్తల మండలి సమావేశమయింది. ఈ సమావేశంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలు మీడియాకు వెల్లడించారు. శ్రీవాణి ట్రస్టు రద్దు చేయాలని, సర్వదర్శనానికి వచ్చే భక్తులకు 2 నుండి 3 గంటల సమయంలో దర్శన భాగ్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. టిటిడిలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను ప్రభుత్వానికి అప్పగించనున్నట్లు సమాచారం.
శ్రీనివాస సేతు పై వంతెనకు గరుడ వారధిగా నామకరణం చేయాలని నిర్ణయించినట్లు ఛైర్మన్ వెల్లడించారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడకుండా చర్యలు తీసుకుంటామని, ప్రైవేటు బ్యాంకుల్లో నగదును ప్రభుత్వ బ్యాంకుల్లో బదలాయిస్తామన్నారు. శారదాపీఠం లీజును రద్దు చేసి స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. తిరుపతి ప్రజలకు ప్రతి నెల మొదటి మంగళవారం దర్శనానికి అవకాశం కల్పిస్తామన్నారు. అలిపిరిలో టూరిజం కార్పొరేషన్ ద్వారా దేవలోక్‌కు కేటాయించిన 20 ఎకరాల భూమిని వెనక్కి తీసుకొని టిటిడి ఇచ్చేలా ప్రభుత్వాన్ని కోరతామన్నారు. నూతనంగా నిర్మిస్తున్న ముంతాజ్ హోటల్ అనుమతలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.