నేడు.. ఏక్‌ షామ్‌.. చార్మినార్‌కే నామ్‌

చార్మినార్‌ వద్ద ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్ (CLiC2NEWS): పర్యాటకులు, వ్యాపారులు, వాహనాలతో కిటకిటలాడే చార్మినార్‌ నేడు (ఆదివారం) ప్రశాంత వాతావరణంలో క‌నువిందు చేయ‌నుంది. గత కొన్ని రోజులుగా ప్రతి ఆదివారం ట్యాంక్‌బండ్‌పై సండే-ఫండే కార్యక్రమం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈక్ర‌మంలో ఇవాళ్టి నుంచి ఈ కార్యక్రమాన్ని చార్మినార్‌ వద్ద ‘ఏక్‌ షామ్‌ చార్మినార్‌ కే నామ్‌’ పేరుతో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు.

ప్రతి ఆదివారం చార్మినార్ వ‌ద్ద సాయంత్రం 5 గంట‌ల నుంచి అర్ధరాత్రి వ‌ర‌కు సండే-ఫ‌న్‌డే కార్యక్రమం కొన‌సాగ‌నుంది. సాయంత్రం 6:30 గంట‌ల‌కు పోలీస్ బ్యాండ్ నిర్వహించ‌నున్నారు. రాత్రి 8:30 గంట‌ల‌కు ద‌క్కనీ మ‌జాహియా ముషారియా ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. ఇక అర్ధరాత్రి వ‌ర‌కు లాడ్ బ‌జార్‌ను తెరిచి ఉంచ‌నున్నారు.

ఇవాళ మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10 గంటల వరకు చార్మినార్‌ పరిసరాల్లోకి వాహనాల అనుమతించబోమని శనివారం నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ పేర్కొన్నారు.

ట్రాఫిక్‌ మళ్లింపులు..

  • అఫ్జల్‌గంజ్, మదీనా నుంచి వచ్చే వాహనాలను గుల్జార్‌ హౌస్‌ నుంచి మేతీ కా షేర్, కాలీకమాన్, ఏతిబజార్‌ వైపు మ‌ళ్లిస్తారు.
  • ఫలక్‌నుమా, హిమ్మత్‌పురా వైపు నుంచి వచ్చే వాటిని పంచ్‌మొహల్లా నుంచి షా ఫంక్షన్‌ హాల్, మొఘల్‌పురా ఫైర్‌ స్టేషన్‌ రోడ్, బీబీ బజార్‌ వైపు మళ్లిస్తారు.
  • బీబీ బజార్, మొఘల్‌పురా వాటర్‌ ట్యాంక్, హఫీజ్‌ ధన్కా మాస్క్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను సర్దార్‌ మహల్‌ నుంచి కోట్ల అలీజా, ఏతీ బజార్‌ చౌక్‌ వైపు మ‌ళ్లిస్తారు.
  • ముసాబౌలి, ముర్గీ చౌక్, ఘాన్సీ బజార్‌ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను లాడ్‌ బజార్, మోతీగల్లీల వద్ద నుంచి ఖిల్వత్‌ రోడ్‌లోకి మ‌ళ్లిస్తారు.
Leave A Reply

Your email address will not be published.