భారీ టెక్ కంపెనీలకు ట్రంప్ హెచ్చరిక..
వాషింగ్టన్ (CLiC2NEWS): దేశంలో లభించిన స్వేచ్ఛను వాడుకొని చాలా టెక్ కంపెనీలు ఇతర దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాయని.. వాటిల్లో భారతీయులను నియమించుకొని అమెరికన్లను పట్టించుకోవడం లేదని అమెరికా అద్యక్షుడు ట్రంప్ అన్నారు. వాషింగ్టన్ డిసిలో జరిగిన ఎఐ సదస్సులో ట్రంప్ మాట్లాడుతూ.. గూగూల్, మైక్రో సాప్ట్ వంటి భారీ టెక్ కంపెనీలు భారతీయులను నియమించుకోవడం ఆపి.. అమెరికన్లపై దృష్టి పెట్టాలన్నారు. ఈ సదస్సులో ట్రంప్ కృత్రిమ మేధకు సంబంధించి మూడు కీలక ఆదేశాలపై సంతకాలు చేశారు. ఎఐకు ఉన్న ఆటంకాలను తొలగించడం.. అభివృద్ధిని వేగవంతం చేయడం, ప్రభుత్వ నిధులు పొందుతున్న సంస్థలు తయారుచేసే ఎఐ టూల్స్ రాజకీయంగా తటస్థ వైఖరితో ఉండేలా చూడటం వంటి అంశాలు ఉన్నాయి.
టెక్ కంపెనీల గ్లోబలిస్ట్ మైండ్‌సెట్‌ను ట్రంప్ విమర్శిస్తూ.. చాలా మంది అమెరికన్లు తమను పట్టించుకోవడం లేదన్న భావనలో ఉన్నట్లు పేర్కొన్నారు. మనదేశంలోని చాలా భారీ టెక్ కంపెనీలు చైనాలో కంపెనీలు నిర్మించి.. భారతీయ ఉద్యోగులను నియమించుకుంటూ.. ఐర్లాండ్‌ను అడ్డంపెట్టుకొని తక్కువ లాభాలు చూపుతూ స్వేచ్చను అనుభవించాయి. ఇక్కడి ప్రజలు అవకాశాలను పట్టించుకోకపోవడం, నిర్లక్ష్యం చేయడం వంటివి చేశారు. తన పాలనలో ఆ రోజులు ముగిసిపోతాయన్నారు.
ఎఐ రేసులో విజయం సాధించాలంటే.. సిలికాన్ వ్యాలీలో సరికొత్త దేశభక్తి అవసరమని ట్రంప్ అన్నారు. ఇక్కడ ఉన్న టెక్నాలజి కంపెనీలన్నీ అమెరికా కోసమే . దేశానికే మెదటి ప్రాధాన్యం ఇవ్వాలని.. ప్రాధాన్యం ఇస్తూ పనిచేయాలన్నారు. అదే మీరూ కూడా చేయాలని.. అదే నేను కోరుతున్నానని ట్రంప్ పేర్కొన్నారు.