TS: ఐటిలో దేశంతో పోలిస్తే రెట్టింపు వృద్ధి: మంత్రి కెటిఆర్‌

హైదరాబాద్‌ (CLiC2NEWS): క‌రోనా మ‌హ‌మ్మారి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మంచి పురోగతి సాధించామని ఐటి మంత్రి కెటిఆర్‌ అన్నారు. ముఖ్య‌మంత్రి కెసిఆర్ ప్ర‌వేశ‌పెడుత‌న్న విధానాలు, సమష్టి కృషితోనే రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతిపథంలో దూసుకెళ్తోందని మంత్రి చెప్పారు. హైద‌రాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్‌డీలో పరిశ్రమలు, ఐటీ శాఖ వార్షిక నివేదికలను ఐటి మంత్రి కెటిఆర్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… కొవిడ్‌ సమయంలోనూ దేశ సగటును మించి అన్నిరంగాల్లో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధించిందని తెలిపారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ ఐటీ, పారిశ్రామిక రంగాల్లో మంచిప్రగతి సాధించామని వివరించారు.  2020-21లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.9.78 లక్షల కోట్లుగా ఉందని మంత్రి అన్నారు. వ్యవసాయ రంగంలో 20.9 శాతం వృద్ధి సాధించామని చెప్పారు. దేశ తలసరి ఆదాయం రూ.1,27,768గా ఉండగా, రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,27,145గా ఉందన్నారు. 2019-20లో రాష్ట్ర ఐటీ ఎగుమతులు రూ.1.28 లక్షల కోట్లు కాగా, 2020-21లో అవి రూ.1.45 లక్షల కోట్లకు పెరిగాయని చెప్పారు. ఐటీలో దేశంతో పోలిస్తే రెట్టింపు వృద్ధి సాధించామన్నారు.

మల్టీనేషనల్ కంపెనీలు హైదరాబాద్‌కు వస్తున్నాయని చెప్పారు. ప్రముఖ కంపెనీలు నగరంలో తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయన్నారు. కార్యాలయాల విస్తీర్ణంలో బెంగళూరును అధిగమించామని చెప్పారు. రామగుండం, సిద్దిపేట, నల్లగొండలోనూ త్వరలో ఐటీ టవర్లను ఏర్పాటుచేస్తామన్నారు. పారదర్శకత కోసం వార్షిక నివేదికలు విడుదల చేస్తున్నామని వెల్లడించారు. కరోనా కారణంగా సాదాసీదాగా కార్యక్రమం జరుపుతున్నామని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.