TS: జూన్ 11 నుంచి భూముల డిజిట‌ల్ స‌ర్వే!

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ‌ రాష్ట్రంలోని వ్యవసాయ భూములకు డిజిటల్ సర్వే నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్ర‌శేఖ‌ర‌రావు నిర్ణయించారు. డిజిటల్‌ సర్వే ఏజెన్సీలతో బుధ‌వారం ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి సమీక్ష నిర్వహించారు. సర్వే విధివిధానాలపై స‌మీక్ష‌లో చర్చించారు. ఇంచు కూడా తేడా రాకుండా సాంకేతికత వాడాలని ముఖ్య‌మంత్రి ఆదేశించారు. అందులో భాగంగా ముందుగా జూన్ 11 నుంచి పైలట్ డిజిటల్ సర్వేను చేపట్టాలన్నారు. అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 27 గ్రామాలను ఎంపిక చేయాలని నిర్ణ‌యించారు. వాటిలో 3 గ్రామాలను గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎంపిక చేయాలని, మిగతా 24 గ్రామాలను రాష్ట్రంలోని ఇరవై నాలుగు జిల్లాల నుంచి ఎంపిక చేయాలని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌ను సిఎం ఆదేశించారు. భూతగాదాలు లేని తెలంగాణే లక్ష్యంగా డిజిటల్‌ సర్వే సాగాలని సీఎం ఆకాంక్షించారు. పట్టాదారుల భూములకు శాశ్వత రక్షణే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

సిఎం నిర్వహించిన సమీక్షా స‌మావేశంలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, ఇత‌ర ఉన్న‌తాధికారులు, డిజిటల్ సర్వే సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.