TS: హౌస్ సర్జన్లు, పీజీ వైద్యులకు గుడ్న్యూస్
హైదరాబాద్ (CLiC2NEWS): జూనియర్ డాక్టర్లకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. హౌస్ సర్జన్, పీజీ వైద్యుల స్టైఫండ్ 15 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు హెల్త్ సెక్రటరీకి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేయగా, వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
జూనియర్ డాక్టర్ల డిమాండ్లపై ఇవాళ ట్విటర్ వేదికగా మంత్రి కేటీఆర్ స్పందించారు. జూనియర్ డాక్టర్లకు 15 శాతం స్టైఫండ్ పెంచుతూ ఇవాళ ఉత్తర్వులు జారీ అవుతాయని ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
స్నేహ సోమారెడ్డి అనే వైద్యురాలు ఇవాళ కేటీఆర్కు ట్వీట్ చేశారు. సార్ కరోనా కష్టకాలంలో మీరు ఎందరికో సహాయం చేసుకున్నారు. కానీ రెసిడెంట్ డాక్టర్లు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఆస్పత్రుల్లో నిరంతరం సేవలందిస్తున్నారు. గత నాలుగు నెలల నుంచి తమకు జీతాలు అందడం లేదు. కొవిడ్ డ్యూటీలకు హాజరైన వారికి ఇతర రాష్ర్టాల్లో ప్రోత్సహకాలు ఇస్తున్నారు. అలాంటివి కూడా తమకు అందడం లేదు. తమ ప్రాణాలను ఫణంగా పెడుతున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాము ఎలా వర్క్ చేయగలం సార్ ట్వీట్ చేశారు.
దీంతో మంత్రి కేటీఆర్ ఆమె ట్వీట్ కు బదులు ఇచ్చారు. హౌస్ సర్జన్లు, పీజీ వైద్యుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లానని.. వారికి 15 శాతం స్టైఫండ్ పెంచాలని హెల్త్ సెక్రటరీకి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు కేటీఆర్. ఇవాళ జీవో విడుదల అవుతుందని కూడా మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు. కేటీఆర్ ట్వీట్ అలా చేశాడో.. లేదో.. మొత్తంగా ఇవాళ మధ్యాహ్నం 15 శాతం స్టైఫండ్ పెంపునకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి.