TS: గ్రూప్-1 ప్రిలీమ్స్ రద్దు
తెలంగాణ హైకోర్టు ఆదేశం
హైదరాబాద్ (CLiC2NEWS): టిఎస్‌పిఎస్ సి (తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్) నిర్వహించిన గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షను హైకోర్టు రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ప్రిలిమ్స్ పరీక్షను మరోసారి నిర్వహించాలని ఉన్నతన్యాయస్థానం ఆదేశించింది. గతంలో జూన్ 11వ తేదీన తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించిన గ్రూప్ -1 పరీక్ష ను 2.22 లక్షల మందికి పైగా అభ్యర్థులు రాశారు. 503 గ్రూప్ -1 ఉద్యోగాల ను భర్తీ చేయడం కోసం ఈ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈ గ్రూప్-1 పరీక్ష ను రద్దు చేసి మరోసారి నిర్వహించాలని తెలంగాణ ఉన్నత న్యాయస్థానంలో పలువురు గ్రూప్ -1 అభ్యర్థులు పిటిషన్ లు దాఖలు చేశారు. నిర్వహించిన పరీక్షలో బయోమెట్రిక్ వివరాలు తీసుకోలేదని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే పరీక్ష నిర్వహణ సమయంలో హాల్‌టికెట్ నంబర్లు లేకుండానే ఒఎంఆర్ పత్రాలు ఇచ్చారని అభ్యర్థుల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. వాదనలు విన్న ఉన్నతన్యాయస్థానం పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది. కాగా గతంలో కూడా పేపర్ లీకేజీ కారణంగా గ్రూప్ -1 పరీక్ష ఒక సారి రద్దయిన విషయం తెలిసిందే.