TS: సెప్టెంబర్‌ 1 నుంచి విద్యా సంస్థలు పునఃప్రారంభం

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో సెప్టెంబరు 1 నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోమవారం ఆదేశాలు జారీ చేశారు. కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో మూతపడ్డ విద్యాసంస్థల ప్రారంభంపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ క్రమంలో వీరితో చర్చలు జరిపిన అనంతరం వచ్చే నెల ఒకటో తేదీ నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

కాగా విడతల వారీగా తరగతులను ప్రారంభించే యోచనలో విద్యాశాఖ ఉన్నట్లు తెలుస్తోంది. 8వ తరగతి నుంచి పీజీ వరకు ప్రత్యక్ష బోధన ప్రారంభించే అవకాశం ఉంది. ఒక్కో తరగతిలో 20 మంది పిల్లలకు పైగా ఉంటే రెండు సెక్షన్‌లుగా విభజించాలని భావిస్తున్నారు. అలాగే ప‌లు రాష్ట్రాల్లో విద్యాసంస్థ‌లు తెరిచేందుకు అమలు చేస్తున్న విధానాలపై కేస్ స్టడీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే స్కూళ్లు తెరిచేందుకు అనుమ‌తి ఇవ్వాలంటూ విద్యాశాఖ సీఎంఓకు ప్ర‌తిపాద‌న‌లు పంపింది.

క‌రోనా ప్ర‌భావంతో గ‌త మార్చిలో విద్యాసంస్థ‌లు మూత‌ప‌డ్డాయి. మ‌ధ్య‌లో 9వ త‌ర‌గ‌తి నుంచి పై త‌ర‌గ‌తులు పాక్షికంగా ప్రారంభించ‌గా.. రెండో ద‌శ క‌రోనా తీవ్ర‌త పెర‌గ‌డంతో మ‌ళ్లీ ఆన్‌లైన్ లో బోధ‌న‌కే ప‌రిమితం చేశారు. ఈ క్ర‌మంలో గ‌త నెల 1వ తేదీ నుంచి త‌ర‌గ‌తులు ప్రారంభించాల‌ని స‌ర్కార్ భావించినప్ప‌టికీ రాష్ట్ర హైకోర్టు ప‌లు ర‌కాల ప్ర‌శ్న‌లు సంధించ‌డంతో వెనక్కి తగ్గింది.

కాగా గ‌త కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌డం.. రోజువారీ కేసులు రాష్ట్రంలో త‌క్కువ‌సంఖ్య‌లో న‌మోదు అవుతున్నాయి. అలాగే ప‌లు రాష్ట్రాలు ఈ నెల‌లోనే విద్యాసంస్థ‌లు పునఃప్రారంభించేశాయి. మ‌రి కొన్ని తెరుస్తున్నాయి. వీట‌న్నింటినీ ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని తెలంగాణ స‌ర్కార్ విద్యాసంస్థ‌ల‌ను పునఃప్రారంభించాల‌ని నిర్ణ‌యించింది.

Leave A Reply

Your email address will not be published.