మేడారం జాతరకు హైదరాబాద్ నుండి ప్రత్యేక బస్సులు..

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలోని మేడారం జాతరకు హైదరాబాద్ నుండి ప్రత్యేక బస్సులు నడపాలని టిఎస్ఆర్టిసి నిర్ణయించింది. ఫిబ్రవరి 16 వ తేదీ నుండి 19వ తేదీ వరకు జాతర జరగనున్న విషయం తెలిసినదే. ఖైరతాబాద్‌లోని రవాణాశాఖ ప్రధాన కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్టిసి ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, ఎండి సజ్జనార్,రవాణా,ఆర్టిసి అధికారులు పాల్గొన్నారు.
ఫిబ్రవరి 16 నుండి ఎంజిబిఎస్ నుండి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు మంత్రి తెలిపారు. ప్రయాణికులు ఆర్టిసి వెబ్ సైట్లో, టిఎస్ఆర్ టిసి యాప్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ ప్రత్యేక బస్సులకు రూ. 398లు ఛార్జీలు వసూలు చేయనున్నారు.
హైదరాబాద్ డిపో-1 సూపర్ లగ్జరీ బస్సులు ఎంజిబిఎస్ నుండి ఉదయం 6 గంటకు బయలుదేరతాయి.మేడారం నుండి మధ్యాహ్నం 3 గంటలకు తిరుగు పయనమవుతాయి. హైదరాబాద్ డిపో-2 బస్సులు ఎంజిబిఎస్ నుండి ఉదయం 7 గంటలకు ప్రారంభమై మేడారం నుండి సాయంత్రం 4 గంటలకు బయలుర్దేరుతాయి. పికెట్ డిపో బస్సులు ఎంజిబిఎస్ నుండి ఉదయం 8గంటలకు ప్రారంబమై మేడారం నుండి సాయంత్రం 5 గంటలకు తిరుగుపయనమవుతాయి.