శ్రీవారి లడ్డు ప్రసాదం.. కల్తీ నిజమేనన్న టిటిడి ఇఒ

తిరుమల (CLiC2NEWS): శ్రీవారి లడ్డు ప్రసాదాల తయారీలో వాడే నెయ్యి కల్తీ జరిగిన విషయం నిజమేనని టిటిడి ఇఒ జె.శ్యామలరావు తెలిపారు. నెయ్యిలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేపనూనె ఉన్నట్లు దేశంలోనే అత్యంత ప్రఖ్యాత సంస్థ గుజరాత్లోని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డిడిబి) కాఫ్ (సెంటర్ ఫర్ ఎనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైవ్సాక్ అండ్ ఫుడ్) సంస్థ నివేదికలో వెల్లడైందని తెలిపారు. నెయ్యి నాణ్యత కు ప్రామాణికమైన ఎస్-విలువ ఒక ఈక్వేషన్ ప్రకారం .. 97.96 నుండి 102.04 మధ్య ఉండాలి. కానీ పరిమితికి మించి 116.09 గా ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీనిని బట్టి పందికొవ్వు ఉన్నట్లు స్పష్టమైందని పేర్కొన్నారు. మరో ఈక్వేషన్ ప్రకారం .. 95.90 నుండి 104.10 మధ్యా ఉండాల్సిన ఎస్-విలువ అతి తక్కువగా 23.22 గా ఉంది. దీనిలో గొడ్డు కొవ్వు కలిసినట్లు వెల్లడైందని వివరించారు.