హైదరాబాద్ శివారులో జంట హత్యలు.. మృతిరాలి భర్తే ..
రంగారెడ్డి (CLiC2NEWS) హైదరాబాదు శివారులో అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కొత్తగూడెం సమీపంలోని జంట మృతదేహాల కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వివాహేతర సంబంధమే ఈ హత్యలకు కారణమయి ఉంటుందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సమీపంలో నిలిపి ఉన్న ద్విచక్ర వాహనం ఆధారంగా వివరాలు సేకరించారు. బండి యజమాని వారాసిగూడకు చెందిన యడ్ల అనిరుధ్‌ను రప్పించారు. మృత దేహం తన సోదరుడు యశ్వంత్ (22)గా గుర్తుపట్టారు. అక్కడ దొరికిన హ్యాండ్ బ్యాగ్‌లోని రసీదు ఆధారంగా మృతురాలు వారాసిగూడకు చెందిన జ్యోతి (30) గా గుర్తించారు. సాంకేతిక ఆధారాల సాయంతో మృతురాలి భర్తను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా.. ఆయనే ఈ హత్యలు చేశానని ఒప్పుకున్నట్లు సమాచారం.
వివరాలు ఇలా..
వారాసిగూడకు చెందిన యడ్ల యశ్వంత్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. అతని తండ్రి కొబ్బరిబొండాలు విక్రయించేవారు. అదే ప్రాంతంలో జ్యోతి కుటుంబం ఉంది. జ్యోతి భర్త స్టీలు సామాన్ల వ్యాపారం చేసేవాడు. వారికి ఇద్దరు పిల్లలు. గతంలో ఒకసారి వీరిద్దరినీ మృతురాలి భర్త హెచ్చరించాడు. అయినా వీరిలో ఏమాత్రం మార్పురాలేదు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం యశ్వంత్, జ్యోతిని వెంటబెట్టుకని ఘటనా స్థలానికి వెళ్లాడు. వీరిని గమనించిన జ్యోతి భర్త వారిని వెంబడించాడు. ఎన్నిసార్లు మందలించినా తమ తీరు మార్చుకోకపోయేసరికి ఆవేశంతో జ్యోతి భర్తే ఈ హత్యలు చేశానని ఒప్పుకున్నాడు. ఈ హత్యలు తానొక్కడినే చేశానని చెబుతున్నాడు. పోలీసులు మాత్రం ఒక్కడే ఈ హత్యలు చేశాడా? ఇంకెవరి ప్రమేయమైనా ఉందా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
హైదరాబాద్ శివారులో జంట మృతదేహాలు..