మారేడుమిల్లి విహారయాత్రకు వెళ్లిన ఇద్దరు వైద్యవిద్యార్థులు మృతి

మారేడుమిల్లి (CLiC2NEWS): విహారయాత్రకు వెళ్లిన విద్యార్థులలో ఇద్దరు వైద్యవిద్యార్థినిలు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం సెలవులరోజు కావడంతో ఏలూరులోని ఆవ్రం కళాశాలలో ఎంబిబియస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న 14 మంది విద్యార్ధులు విహారయాత్రకు వెళ్లారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి పర్యాటక ప్రాంతానికి ట్రావెలర్ వాహనంలో వెళ్లారు. అక్కడనుండి అంతరాష్ట్ర రహదారిలోని జలతరంగిణి జలపాతం వద్దకు చేరుకున్నారు. జలపాతంలో దిగిన అనంతరం భారీ వర్షం కురవడంతో జలపాతం ఉద్ధృతి పెరిగి ఐదుగురు విద్యార్థులు కొట్టుకుపోయారు. ఇద్దరిని అక్కడేఉన్న పర్యాటకులు రక్షించారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. సౌమ్య, హరదీప్ , అమృత జలపాతంలో కొట్టుకుపోయారు. వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం సౌమ్య, అమృత మృతదేహాలు లభ్యమయ్యాయి. హరదీప్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.