ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా.. గవర్నర్ ఆమోదం
ముంబయి (CLiC2NEWS): మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తన సిఎం పదవికి రాజీనామా చేశారు. గురువారం శాసనసభలో జరిగే బలపరీక్షకు ముందే సిఎం పదవి నుంచి ఆయన వైదొలిగారు. ఆ వెంటనే గరవ్నర్ కొశియారి రాజీనామాకు ఆమోదించారు. దీంతో మహారాష్ట్రలో శివసేన షిండే వర్గం రెబెల్ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో జరిగిన పరిణామాల నేపథ్యంలో మహావికాస్ అఘాడీ సర్కార్ కూలిపోయింది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సర్కార్ శాసన సభలో గురువారం పరీక్ష ఎదుర్కోవాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పిన నిమిషాల వ్యవధిలోనే ఉద్ధవ్ ఠాక్రే తన రాజీనామాను ప్రకటించారు.
అనంతరం ఉద్ధవ్ ఠాక్రే తన ఫేస్‌బుక్ లైవ్‌లో ప్రసంగించారు. దేశఅత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నానని తెలిపారు. తనకు సహకరించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎస్సీపీ అధినేత శరద్ పవార్ కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రభుత్వానికి దిష్టి తగిలిందని అని అన్నారు. తగిలిన దిష్టి ఎవరిదో దేశంలో అందరికి తెలుసు అని పేర్కొన్నారు. కాగా సొంత పార్టీ వాళ్లే తనను మోసం చేశారని ఉద్ధవ్ ఠాక్రే ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు మహారాష్ట్ర రాజకీయాల్లో తాజా పరిణామాల నేపథ్యంలో ఆ రాష్ట్ర బిజెపి నేతలు ముంబయిలోని తాజ్ ప్రెసిడెంట్ హోటల్‌లో సంబురాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు.
మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 288. కాగా ప్రస్తుతం 287 మంది సభ్యులు ఉన్నారు.
వీరిలో భారతీయ జనతాపార్టీకి 106 మంది ఎమ్మెల్యేలు. శివసేనకు 55, ఎన్సీపికి 53, కాంగ్రెస్‌కు 44 మంది సభ్యులు ఉన్నారు
తమకు స్వతంత్ర్య ఎమ్మెల్యేలతో కలిపి మొత్తం 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని శివసేన రెబల్ నేత షిండే ప్రకటించిన విషయం తెలిసిందే.