UGC: ఉన్నత విద్యాసంస్థల్లో ఏడాదికి రెండు సార్లు ప్రవేశాలు..!

ఢిల్లీ (CLiC2NEWS): భారత్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు శుభవార్త.. విదేశీ విశ్వవిద్యాలయాల మాదిరిగానే భారత్లో ఇక నుండి ఉన్నత విద్యాసంస్థల్లో ఏడాదికి రెండు సార్లు ప్రవేశాలు కల్పించనున్నట్లు సమాచారం. ఈ విధంగా రెండు సార్లు అడ్మిషన్ ప్రక్రియ వలన విద్యార్థులకు ఏడాది సమయం వృథా కాకుండా ఉంటుందని యుజిసి చీఫ్ వెల్లడించారు. ఈ ప్రతిపాదనకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం. 2024-25 విద్యా సంవత్సరం నుండి రెండు దఫాల్లో .. జులై- ఆగస్టు, జనవరి-ఫిబ్రవరిలలో ప్రవేశాలు కల్పించేందుకు అనుమతిస్తామని యుజిసి చీఫ్ జగదీశ్ కుమార్ పేర్కొన్నారు. దేశంలోని అన్ని యూనివర్సిటీలు ఈ విధానాన్ని పాటించడం తప్పనిసరి కాదని.. అవసరమైన మౌలిక సదుపాయాలు, బోధనా సిబ్బంది కలిగిన ఉన్నత విద్యా సంస్థలు మాత్రం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చన్నారు.