భద్రాచలం వద్ద ఉగ్రగోదావరి
భద్రాచలం (CLiC2NEWS): ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదికి వరద మళ్లీ క్రమంగా పెరుగుతోంది. నిన్నటి (శుక్రవారం) వరకు హెచ్చుతగ్గులతో కొనసాగిన గోదావరి నది వరద ప్రభావం.. ఇవాళ (శనివారం) ఉదయం నుంచి పెరుగుతోంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు 52.1 అడుగు చేరింది. ప్రస్తుతం భద్రాచలంలో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఈ ప్రవాహం 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయాల్సి ఉంటుంది.
గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో భద్రాచలం చుట్టుపక్కల ప్రాంతాల్లో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. స్థానిక ఎఎంసి కాలనీ చుట్టుపక్కల బ్యాక్ వాటర్ చేరుకోవడంతో బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఈ మేరకు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ జితేష్ ప్రకటించారు. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేయాలని, ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా గోదావరికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. భారీ వరద ప్రవాహంతో ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 13.70 అడుగుల నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో అధికారులు రెండు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దాంతో సముద్రంలోకి 12.72 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.