క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలతోనే ఉంటా.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ
ఉక్రెయిన్ అధ్యక్షడు జెలెన్‌స్కీ తాను రాజధాని విడిచి పోయినట్టు వస్తున్న వార్తల్ని ఖండించారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలతోనే ఉంటానని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఒంటరిగా పోరాడుతున్నామని, ప్రపంచ దేశాల సాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ దేశ పౌరులపైనా దాడులు జరుగుతున్నాయని అన్నారు.
‘అత్యంత శక్తిమంతమైన దేశం కేవలం దూరం నుండి చూస్తూ ఉంది’.. అంటూ పరోక్షంగా అగ్రరాజ్యం అమెరికాపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ భూభాగంలోకి ప్రవేశించిన విదేశీ సేనల్ని వెనక్కి పంపేందుకు కేవలం ఆంక్షలు సరిపోవని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ పై రష్యా జరుపుతున్న సైనిక చర్యను అమెరికా, యూకె, కెనడా సహా అనేక దేశాలు ఖండించాయి. రష్యా వైఖరిని నిరసిస్తూ ఆ దేశంపై కఠిన ఆర్ధిక పరమైన ఆంక్షలు విధించాయి. ఇప్పటికే రష్యాలోని కీలక బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు, సంపన్నులపై అమెరికా సహా ఇతర దేశాలు కఠిన ఆంక్షలు విధించాయి. అయినా రష్యా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.