కేంద్రమంత్రి నారాయణ్ రాణేకు బెయిల్ మంజూరు

ముంబయి (CLiC2NEWS): మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్ ఠాక్రేపై కేంద్ర మంత్రి నారాయణ్ రాణే చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీశాయి. ఈ కేసులో పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. కొద్ది గంటల తర్వాత ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. ముఖ్యమంత్రి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఆయనను అరెస్టు చేయడం సమర్థనీయమే అని బెయిల్ విచారణ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
గత సోమవారం మహారాష్ట్ర సిఎం ఉద్దవ్ ఠాక్రేపై భారతీయ జనతాపార్టీ నేత, కేంద్ర మంత్రి నారాయణ్ రాణే కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సిఎంపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై మహారాష్ట్రలోని పోలీస్‌స్టేషన్లలో నాలుగు చోట్ల ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. నిన్న (మంగళవారం) కేంద్రమంత్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన కాసేపటికి మహద్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. 15 వేల పూచీకత్తుతో ఆయనకు బెయిల్‌ను మంజూరు చేశారు. అయితే, రాణేను 7 రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టును కోరగా, ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, బెయిల్ ఇవ్వాలని రాణే తరపు న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న మహద్ కోర్టు, కేంద్ర మంత్రి రాణేకు బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఈనెల 30, సెప్టెంబర్ 13వ తేదీన కోర్టుకు హాజరుకావాలని మంత్రిని ఆదేశించింది.
తప్పకచదవండి: `చెంపదెబ్బ` వ్యాఖ్యలు.. కేంద్రమంత్రి రాణే అరెస్టు..