`చెంపదెబ్బ` వ్యాఖ్యలు.. కేంద్రమంత్రి రాణే అరెస్టు..
ముంబయి (CLiC2NEWS): మహారాష్ట్ర సిఎం ఉద్దవ్ ఠాక్రేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి నారాయణ రాణేను పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్యమంత్రికి స్వాతంత్ర్యం వచ్చి ఎన్నేళ్లయిందో కూడా తెలియదని, అలాంటి వ్యక్తి చెంప పగలగొట్టాలని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు గానూ ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. దీంతో రత్నగిరి పర్యటనలో ఉన్న ఆయనను నేడు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
అధిక రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్నానని రాణె చెప్పగా.. వైద్యులను పిలిపించి పరీక్షలు చేయించారు పోలీసులు.
పిటిషన్ తిరస్కరణ!
అంతకుముందు.. పోలీసుల అరెస్టు నుంచి రక్షణ కోసం రాణె చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు కేంద్ర మంత్రి. తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని అభ్యర్థించారు. పిటిషన్‌పై మంగళవారమే అత్యవసర విచారణ చేపట్టాల్సిందిగా రాణె తరఫున న్యాయవాది హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. న్యాయవాది అభ్యర్థనను తిరస్కరించిన జస్టిస్ ఎస్ఎస్ శిండే, జస్టిస్ ఎన్జే జమాదర్తో కూడిన ధర్మాసనం.. సరైన ప్రక్రియను అనుసరించాలని ఆదేశించింది. తొలుత.. రిజిస్ట్రీ విభాగంలో అత్యవసర విచారణకు దరఖాస్తు చేసుకోవాలని, ఆ తర్వాత పిటిషన్‌పై విచారణ చేపట్టాలా? వద్దా? అన్న విషయాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేసింది.
అసలేం జరిగిందంటే..
నారాయణ్ రాణె జన్ రాయ్‌గఢ్ జిల్లాలో సోమవారం ఆశీర్వాద్ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం ఠాక్రేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15న ఠాక్రే చేసిన ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ..
దేశానికి స్వాతంత్ర్యం ఏ ఏడాదిలో వచ్చిందో తెలియని ఉద్ధవ్ ఠాక్రేను తాను కొడదామనుకున్నా అని రాణె అన్నారు. స్వాతంత్ర్యం ఏ ఏడాది వచ్చిందో ముఖ్యమంత్రికి తెలియకపోవడం సిగ్గు చేటు. ఆయన ప్రసంగం సందర్భంగా ఇది ఎన్నో స్వాతంత్ర్య దినోత్సవమో కనుక్కొని మరీ చెప్పారు. ఒకవేళ నేను అక్కడే ఉండి ఉంటే.. ఆయనను గట్టిగా కొట్టేవాడిని అని నారాయణ్ రాణె అన్నారు.