TS: కోర్టుల్లో అన్‌లాక్ మొదలు
ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలోని కోర్టుల్లో అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభించాలని రాష్ట్ర హైకోర్టు నిర్ణయించింది. సిబ్బంది మొత్తం విధులకు హాజరుకావాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఆన్‌లైన్ పిటిషన్లు మాత్రమే స్వీకరించడం.. వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా విచారణ చేయడం లాంటి చర్యలు తీసుకోవాల్సి వచ్చింది.
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో.. కోర్టుల్లో అన్ లాక్ ప్రారంభించాలని హైకోర్టు నిర్ణయించింది. సిబ్బంది అందరూ విధులకు హాజరు కావాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు రోజు విడిచి రోజు సగం మంది సిబ్బంది హాజరవుతున్నారు. కాగా ఈ నెల 19 నుంచి కోర్టుల్లో పాక్షికంగా ప్రత్యక్ష విచారణ ప్రారంభించాలని హైకోర్టు నిర్ణయంచింది. రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలు మినహా రాష్ట్రంలో పాక్షిక ప్రత్యక్ష విచారణ ప్రారంభించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల్లోఈనెల 31 వరకు ఆన్ లైన్ విచారణ కొనసాగించాలని పేర్కొంది. అలాగే మిగతా ఉమ్మడి జిల్లాల్లో ఈనెల 16 వరకు ఆన్ లైన్ విచారణ జరగాలని.. మిగతా జిల్లాల్లో ఈనెల 19 నుంచి పాక్షికంగా ప్రత్యక్షంగా విచారణ ప్రారంభించాలని పేర్కొంది. ఇక, హైకోర్టులో మాత్రం ఈనెల 31వ తేదీ వరకు ఆన్ లైన్ విచారణ విధానం కొనసాగనున్నట్టు తెలిపారు.