3 నెలల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి: హైకోర్టు

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు నెలల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. విద్యా సంస్థల్లోనూ సిబ్బందికి రెండు నెలల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని పేర్కొంది. ఆర్టీపీసీఆర్ టెస్టులను పెంచాలని ఆదేశించింది.
మొత్తం పరీక్షల్లో 10 శాతమే ఆర్టీపీసీఆర్ జరుగుతున్నాయని.. ప్రభుత్వ పాలసీలే అమలు చేస్తారా.. కోర్టు ఆదేశాలు అమలు చేయరా? అంటూ హైకోర్టు ఘాటుగా స్పందించింది. తమ ఆదేశాలు అమలు చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ధర్మాసనం హెచ్చరించింది.
కలర్ కోడెడ్ గ్రేడెడ్ రెస్పాన్స్ (సీసీజీఆర్ఏ ) కార్యాచరణ ప్రణాళికలో జాప్యంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇప్పటి కే రెండు సార్లు ఆదేశించినప్పటికీ ఎందుకు సమర్పించలేదని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు (డిహెచ్) డాక్టర్ శ్రీనివాస్‌ను ప్రశ్నించింది. ఈనెల 30లోగా సీసీజీఆర్ఏ రూపొందించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
కరోనా మందులను అత్యవసర జాబితాలో చేర్చకపోవడంపై కూడా అసహనం వ్యక్తం చేసింది. ఇంకా ఎంతమంది మరణించాక చేరుస్తారని ప్రశ్నించింది. అక్టోబరు 31లోగా అత్యవసర జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబరు 4కి వాయిదా వేసింది.
మూడో దశ ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు.. డిహెచ్
తెలంగాణలో కరోనా పరిస్థితులపై డిహెచ్ శ్రీనివాస్ హైకోర్టుకు నివేదిక సమర్పించారు. “తెలంగాణలో ఇప్పటి వరకు 2.58 కోట్ల కరోనా పరీక్షలు నిర్వహించాం. ఈ నెల 19 వరకు 6,63,450 కేసులు నమోదు అయ్యాయి. రెండునెల్లో పాజిటివిటీ రేటు 0.51 శాతానికి తగ్గింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2.20 కోట్ల డోసుల వ్యాక్సిన్లు వేశాం. గ్రేటర్ హైదరాబాద్‌లో 97 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేశాం. ఇప్పటి వరకు రాష్ట్రంలో 60 శాతం మందికి మొదటిడోస్, 38 శాతం మందికి రెండో డోసు పూర్తి చేశాం. తెలంగాణలో మూడో దశ ఎదుర్కొనేందకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం“ అని హైకోర్టుకు అందించిన నివేదికలో డిహెచ్ పేర్కొన్నారు.