విజయుడు (ధారావాహిక నవల పార్ట్-10)
భూలోకం గురించే పదేపదే ప్రస్తావిస్తున్న విజయ్ అంతరంగం అర్థమైనప్పటికీ మహావిష్టువు గుంభనంగా ఉండిపోయారు. ఈ జీవున్ని తిరిగి అదే శరీరంలోకి పంపించడం వల్ల ఆ దేశ ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు ఏర్పడగలవనే విషయంపై తన నిర్ణయం ఆధారపడి ఉంటుందని శ్రీహరి అంచనా వేస్తున్నారు. ప్రత్యేకంగా భారత దేశంలో పెరుగుతున్న అశాంతి, దారిద్య్రం, ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగం, కల్తీ మందులు, వ్యాపార కేంద్రాలుగా మారిన వైద్య శాలలు ఎన్నో సమస్యలున్నాయి సరే కానీ ఈ జీవుని వల్ల వాటన్నింటికి సరైన పరిష్కారం లభిస్తుందా? ఈ జీవుడు రాజకీయాల్లోనే ఉన్నందున ఏమేరకు సత్ఫలితాలు రాగలవు? గతంలో ఏ సమయంలోనూ వైకుంఠం చేరిన జీవి తిరిగి భూలోకం పై ద్యాస పెట్టినది లేదు.. ఈ జీవుని లక్ష్యం ఏమిటో కానీ నా సమక్షంలోనే భూలోకంపై చింత పెంచుకుంటున్నాడు. ఇహపర సుఖం కంటే జీవుడు ఇతర సమస్యలేక ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా ఉంది. చూద్దామని భావించి
ఏమిటి బ్రహ్మదేవున్ని కూడా సందర్శించి నీ తలరాత ఎందుకు ఇలా మారిందో తెలుసుకుంటావా? అని విజయ్‌ను ప్రశ్నించారు శ్రీమన్నారయణుడు.
నా తలరాతకేమి స్వామి దివ్యంగా ఉంది. నేరుగా వైకుంఠానికి వచ్చిన నాకు ఇంతకంటే ఏమి కావాలి. మీ కరుణ కటాక్ష, వీక్షనాలు నాపై ఉండగా మరో ఆలోచనకు తావు లేదు దేవా… కానీ ఎందుకో నా అంతరంగ మథనం నన్ను నిలవనీయడం లేదు. నవ యవ్వనంలో ఉన్న నేను ఇప్పుడిప్పుడే రాజకీయంగా నిలదొక్కుకుంటున్నాను. ప్రజాసేవలో ముందుండి నా నియోజకవర్గ సమస్యలకు తోడు రాష్ట్ర సమస్యలన్నింటి పరిష్కారం కోసం కృషి చేస్తున్నా… అధికార పార్టీలో ఉన్నప్పటికీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు అసెంబ్లీ వేధికను వినియోగించుకుంటున్నా. నేను ప్రస్తావించే ఏ అంశం అయినా నిస్వార్థం, నిజాయితీగా ఉన్నందున మా ముఖ్యమంత్రి కూడా ఏ నాడు ఆక్షేపించలేదు సరికదా తన మంత్రివర్గ సభ్యుల కంటే నాకే అధిక గౌరవం ఇస్తున్నారు. మొదటిసారి శాసనసభ్యునిగా ఎన్నికై నందున ఇదే అనర్హతగా నాకు మంత్రి పదవి ఇవ్వలేదని కూడా సిఎం నాతో అన్నారు. మళ్లీ ఎన్నికల్లో మన పార్టీ గెలిస్తే కీలక మంత్రిత్వ శాఖ నీకే అంటూ పలు సందర్భాల్లో సిఎం చెప్పారు కూడా.. మంత్రి పదవిపై నాకు పెద్దగా ఆశలు లేకపోయినా.. ప్రభుత్వ నిర్వహణలో మంత్రులకు సమిష్టి బాధ్యత ఉంటుంది. అంతే కాదు ముఖ్యమంత్రి కూడా మంత్రివర్గంలో ఒక సభ్యుడే కానీ ఆయన మొదటివారని మాత్రమే రాజ్యాంగం నిర్వచిస్తోంది. ప్రజాస్వామ్యం అదే. కానీ మహాదేవ రాష్ట్రాల్లో కానీయండి, దేశ ప్రధాని కానివ్వండి ఆచరణలో అలా జరగడం లేదని పలు సందర్భాల్లో నేను గుర్తించాను. రాష్ట్రాలు తమజాగీరులుగా భావిస్తూ, తామే సర్వాధికారులుగా ముఖ్యమంత్రులు భావిస్తున్నారు.
ఇష్టాను సారం నిర్ణయాలు తీసుకుంటూ వాటినే మంత్రివర్గ నిర్ణయాలుగా తీర్మానాలు చేయిస్తూ ప్రభుత్వమంటే తానే అన్నట్లుగా యధేచ్చగా సర్వాధికారాలు అనుభవిస్తున్నారు. ఇంకా దేశ ప్రధాని అయితే ఏకంగా తన పదవి మకుటం లేని మహారాజుగా భావిస్తుంటారు దేవా… మంత్రివర్గాన్ని లెక్క చేయరు. పార్లమెంట్‌కు జవాబుదారిగా ఉండాల్సిన వారు రాజ్యాంగాన్ని సవరిస్తూ తమ అధికారాలను మరింత పెంచుకుంటున్నారు. న్యాయస్థానాల తీర్పులను తిరగరాసేందుకు సవరణ చట్టాలు తెస్తున్నారు. పేరుకే ప్రజాస్వామ్యం అన్నట్లుగా తయారైంది స్వామీ భారత దేశంలో.. ఒక్క ఈ దేశంలోనే కాదు పెక్కు దేశాల్లో ఇదే తరహా ప్రజాస్వామ్మం నడుస్తున్నది దేవాదిదేవా…. ఏమో అన్ని విషయాలు తెలుసుకోవడం కూడా నా మనస్సును మరింత కష్టపెడుతున్నట్లుగా అనుపిస్తున్నది.. అంటూ జాతీయ, అంతర్జాతీయ, మానవ సంబంధాలు, పాలకుల పనితీరును ప్రస్తావించాడు జీవుడు.
ఇలాంటి భూలోకంలోకి తిరిగి వెళ్లాలని ఎందుకనుకుంటున్నావు జీవి అంటూ.. లక్ష్మీదేవి ప్రస్తావించడంతో, విజయ్…
అమ్మా లోటుపాట్లు తెలిసిన నాలాంటి వాళ్లతోనే మార్పునకు శ్రీకారం చుట్టడానికి అవకాశం ఏర్పడుతుందనే విశ్వాసం ఉంది నాకు. ఎక్కడో ఒక చోట దానికి ఫుల్‌స్టాప్ పెట్టాలనేది నా ఉద్ధేశ్యం. ఇందులో నేను ఎంతవరకు కృతకృత్యుడను అవుతానో తెలియదు కానీ దుర్వవస్థ ఎక్కువ రోజులు కొనసాగరాదు.
శ్రీహరి మరో అవతారం ఎత్తి దుష్ట శిక్షణకు పూనుకోవాల్సిన పరిస్థితి భూలోకంలో ఏర్పడరాదనే నా విశ్వాసం. రామావతారం, కృష్ణావతారంలో శ్రీహరి పడిన కష్టాలు చాలు.. మళ్లీ, మళ్లీ ఆ మహావిష్ణువే భూలోకంలో అవతరించాల్సిన పరిస్థితి రాకుండా పరిపాలించే పాలకులు రావాలి, దుర్మార్గులే ఉండరాదని నా తలంపు. అందుకే నా పరిధిలో అసెంబ్లీలో వాదనలు కొనసాగిస్తున్నాను. వాస్తవ పరిస్థితి తెలిసిన మా ముఖ్యమంత్రి బాగానే స్పందిస్తుంటారు కానీ పార్టీ నిర్మాణం, ఎన్నికల వ్యయం తదితర కారణాల వల్ల అవినీతిలో భాగస్వామిగా ఉంటున్నట్లుగా చెబుతుంటారు. ప్రధాని స్థాయిలో అనేక ఆగచాట్లు ఉంటున్నాయని తెలిసినా.. వ్యవస్థలు సమర్థవంతంగా నడిపగలిగితే నిజాయితీగా వ్యవహరిస్తే, ప్రజాసమస్యలను పరిష్కరించవచ్చనేది నా నిశ్చితాభిప్రాయం అంటూ ఆవేశంగానే వివరించాడు.
అయితే నీవు మళ్లీ భూలోకం వెలితే దేశం సర్వతోముఖాభివృద్ధి జరిగి మానవాళి సుభిక్షంగా ఉంటుందని పరిస్థితులు మారుతాయని అందుకు నీవు కారణం అవుతావనే భావన నీకు ఉందా అంటూ శ్రీదేవి కొంత రెచ్చగొట్టేలా ప్రశ్నించింది విజయ్‌ను.
అమ్మా… మహావిష్ణువు కృష్ణావతారంలో తాను అనుకున్న లక్ష్యం సాధించేందుకు ఒక్కరే అన్ని పనులు స్వయంగా చేయలేదనే విషయం మీకు తెలుసు తల్లీ.. అయితే ఆశించిన లక్ష్యం సహేతుకమైతే.. దానికి అనేక మంది తోడ్పాటు లభిస్తుంది. లేదా ఉన్న వారిలో సజ్జనుల సాంగత్యం సంపాధించి విజయం వైపు సాగిపోవాలనే విషయం మీకు తెలియంది కాదు. మహాభారత గ్రంథంలోనూ శ్రీకృష్ణుడు తన అవతార లక్ష్యాన్ని సాధించుకునేందుకు పాండవులకు చేయూత నిస్తూ కురుక్షేత్రంలో పరోక్ష పాత్ర వహిస్తూ భూభారాన్ని తగ్గించిన ఘనత ఈ మహానుభావునిదే…లోకం కోసం సంధి ప్రయత్నాలు స్వయంగా నందకిషోరుడే కురుసభకు వెళ్లి కౌరవులకు వాస్తవాలు వివరించారు. యుద్ధం వస్తే రాబోయే పరిణామాలు ముందస్తుగానే వెల్లడించి తాను పాండవపక్షం వహిస్తానని కూడా స్పష్టం చేశారు. అందుకు నేటి రాజకీయనాయకులకు కూడా మహాభారతం చదివి ఒంటపట్టించుకోవాలని భూలోకంలో రాజనీతిజ్ఞులు చెబుతుంటారు తల్లీ. మంచి కార్యం సాధించాలంటే దీనికి ఎంతో ఓర్పు అవసరమని ఈ మేరకు నేర్పు జతకావాలని భారతం చెబుతున్నది. వంద తప్పులు చేసేవరకు శిశుపాలుని దుర్ణీతిని సహించాడు గోపాలుడు. జరాసంధునిని తుదముట్టించేందుకు ధర్మరాజు రాజసూయం చేసేవరకు ఆగి తర్వాతనే భీమసేనునితో ఈ కార్యం సాధించారు. మీరు ప్రస్తావించినట్లుగా అమ్మా… దేశ రాజకీయాలన్నింటినీ నేనే మార్చి వేయగలను భూలోకంలో స్వర్ణ యుగం స్థాపించగలనని చెప్పేంత అవివేకిని నేను కాదు తల్లీ… సర్వంత్యామి శ్రీహరికి తెలియదంటూ ఏమీ ఉండదు…మీరు నన్ను పరీక్షించగోరి ఈ విధంగా మాట్లాడించారు కదమ్మా? అంటూ లక్ష్మిదేవి వైపు తిరిగి నమస్కరించాడు విజయ్.
ఓె అన్ని వివరించి తిరిగి శ్రీహరికే వదిలేస్తున్నావన్నమాట… అసెంబ్లీలో కూడా ఇలానే వాదిస్తున్నావా అని మరో చురక వేసింది శ్రీదేవి.
అమ్మా నేను నిమిత్తమాత్రున్ని. శ్రీమన్నారాయనుడు ఏది ఆజ్ఞాపిస్తే అదే జరుగుతుంది. అయినా… నా మరణంపై అధిక సందేహాలే ఉన్నాయి. ఎవరికీ అపకారం చేయని నన్ను హత్య ఎందుకు చేశారో.. ఎవరు చేశారో తెలుసుకోవాలనే కుతూహలం మాత్రం తగ్గడం లేదు తల్లీ ..
ఇలాంటి విషయాలను దేవ రహస్యం. నీకు నీవే తెలుసుకోవాలి. దేవదేవున్ని ప్రార్థించు శుభం కలుగుతుందని శ్రీదేవి జీవున్ని దీవించింది.
ధన్యోస్మి మాతా అంటూ ప్రణమిల్లాడు విజయ్.
మందస్మిత ముఖంతో అంతా విన్న మహావిష్ణువు విజయ్ వైపు చూశారు. నారాయణ… మీ నుంచి వినగోరుతున్నాను. భూలోకంలో కొందరు స్వాములు, పీఠాధిపతులు, కాషాయం కట్టేసిన ఎందరో దేవుళ్ల కంటే అధికంగా పూజించబడుతున్నారు. అందులో దొంగస్వాములే అధికం దేవా..వారి వల్ల ప్రజలు మోసపోతున్నారు. నిజానిజాలు తేల్చలేక ప్రభుత్వాలు చేతులెత్తేస్తున్నాయి. ఇలాంటి వారు అన్ని మతాల్లో ఉండి దేవుని ప్రతినిధులమనే స్థాయిలో చేయని అరాచకం లేదు. వారిని అదుపు చేయడం ఎలా దేవా… అని విజయ్ అభ్యర్థించారు. దీనికి క్ష్మిదేవి కలగజేజుకుంటూ దొంగ స్వామలని నీవే అంటున్నావు కదా జీవా..ప్రభుత్వాలు వారిని అరికట్టాలని ఎంఎల్‌ఎ గా నీవే చొరవ తీసుకోవచ్చు కదా అని ప్రశ్నించింది.
ఏమిటో అమ్మా..ఆ బ్రహ్మ నుదటి రాత వల్లనే భూలోకంలో జనన,మరణాలు సంభవిస్తున్నాయని అంటారు. మరి ఆ విధాతనే అందరిని సన్మార్గంలో నడిచేలా పుట్టించవచ్చు కదా..మా లోకంలో ఇక అత్యాచారాలు, అవినీతి అరాచకాలు ఏమి ఉండవు కదా తల్లీ.. అన్నాడు విజయ్
లేదు జీవా.. గత జన్మ కర్మం, పాప,పుణ్యాల ప్రాతిపదికపైనే మరు జన్మ ఉంటుంది. అందరూ పుణ్యాత్ములు ఉండరు కదా అందుకే అన్ని రకాల పుడుతున్నారు. ఇందులో దేవదేవుడు కల్పించుకోవాల్సి ఏమీ ఉండదు అని శ్రీదేవి చెప్పడంతో మౌనంగా ఉండిపోయాడు విజయ్..
వాస్తవం ఏమిటో గానీ మాతా..త్రిమూర్తులే కాదు శ్రీహరి ఏ అవతారంలోనూ తన సంతానంగా మగ బిడ్డలనే కన్నారని నేను చదివిన, విన్న పురాణాలు, గాథలు చెబుతున్నాయి. ఎందుకు అమ్మాయిలు వారికి జన్మించలేదో… మహిళల పట్ల వివక్షత అధికంగా ఉంటున్నదని భూలోకంలో మహిళా సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. మీరు మాతృమూర్తిగా ఈ విషయంలో వారికి న్యాయంచేయాలి.
లక్ష్మీదేవి మాట్లాడుతూ స్వామి ఈ జీవుడు మన మధ్య కూడా ఏదో అంతరం ఉన్నట్లుగా ఎత్తి చూపుతున్నాడు. అలాంటి అరమరికలు ఏనాడు నాకు అనుభవం కాలేదు. అని చెబుతుండగా విజయ్ కలుగజేసుకొని …ఏదో మిడిమిడి జ్ఞానంతో నేను చేసిన అప్రస్తుత ప్రసంగానికి క్షమాపణలు కోరుతున్నాను తల్లీ..అయినా భూలోకంలో అంతా సజావుగా లేదని మాత్రం చెప్పగలను శ్రీహరి అన్నాడు.
నీ వాలకం చూస్తే భూలోకంలో మరికొంత కాలం ఉండాలనే ఉబలాటపడుతున్నట్లుగా ఉన్నావు జీవుడా..అదేనా నీ అభీష్టమా.. సూటిగా ప్రశ్నించారు.
దేవదేవా ఏమిటీ నాకు పరీక్ష… మీ అనుగ్రహం ఎలా ఉంటే అలానే. నాకంటూ ప్రత్యేక కోరికలేవీ లేవు. ఎవరు నన్ను హత్య చేశారో తెలియదు. నాకు తెలియకుండానే అంతా జరిగింది. నా ప్రమేయం లేకుండానే మరణం, వైకుంఠ ప్రవేశం,దివ్యమంగళమైన మీ సాక్షాత్కారం. ఇంకా స్వర్గలోక సందర్శన భాగ్యం వీటన్నింటికంటే మీతో ఇలా, ఇంతసేపు మాట్లాడే మహద్భాగ్యం… అహా… ఇంకా ఏమి కావాలి స్వామి..ఇక చాలు నాకు… మీ ఆజ్ఞ కోసం ఎదురుచూస్తున్నాడు మీ సేవకుడు అంటూ సాష్టాంగ ప్రణామాలు చేశాడు విజయ్
నీ దృఢచిత్తం, సేవాతత్పరత, ప్రజల పట్ల నిబద్దత నాకు ఎంతో ఆనందం కలిగిస్తున్నాయి… శక్తి సామర్ధ్యాలనే నమ్ముకొన్న నీవు,భూలోకంలో కూడా ఏ దేవున్ని కూడా ప్రత్యేకంగా పూజించినట్లుగా లేదు. ప్రమాదం జరిగిన రోజు కారు నడిపిన డ్రైవర్ పేరు నారాయణ కావడం నీకు కలిసివచ్చింది. మరణించే సమయంలో ఎవరైనా నా పేరును స్మరిస్తే, వారిని నేరుగా వైకుంఠానికి తేవాలని మా దూతలకు తెలుసు. అందుకే నిన్ను ఇక్కడికి తెచ్చి ఉంటారు. అయితే ఇక్కడకు వచ్చే జీవులు అతి తక్కువ. కోటి మందిలో ఒక్కరు కూడా ఉండకపోచ్చు.ఎంతో కాలంగా వైకుంఠ ద్వార ప్రవేశార్హ త లభించిన వారే లేరు.
దేవాదిదేవా.. నా మనస్సు ఇంకా సందిగ్దంలోనే కొట్టుమిట్టాడుతున్నది. అనితర సాధ్యమైన మీ దర్శనభాగ్యం లభించిన తర్వాత తుచ్చ మానవ వాంఛతో
పుర్జజన్మ ఆశించే వారుండరు. కానీ శ్రీహరి, నాకు ఏకైక సందేహం కలుగుతున్నది. అదే నా హత్య .ఎందుకు జరిగిందనేది. ఈ రహస్యం ఏమిటనేది నాకు అంతుబట్టడం లేదు.
నా సమక్షంలో ఉన్న తర్వాత కూడా మరో విషయం గురించి మాట్లాడిన వారు ఇప్పటివరకు నాకు కనిపించలేదు. పైగా తిరిగి భూలోక ప్రస్తావన తెచ్చిన జీవుడు లేడు. ఏ అవతారంలోనూ నాకు ఇలాంటి దృశ్యమే లేదు. నన్ను చేరుకోవడమే అంతిమంగా అందరూ భావిస్తుంటారు. నన్ను సేవించడం మినహా ఇంకా ఏమి అక్కరలేదని అంటారు. ఏ యుగంలోనూ నీలాంటి జీవి తారసపడలేదు. అందుకే నీతో ఇంత సమయం మాట్లాడటానికి కుతూహలం వేసింది. నీ అభీష్టంలో నెరవేర్చుకోవాలనే ఇప్పటివరకు నీవు ఇన్ని ప్రస్తావనలు చేసినట్లుగా తోస్తున్నది. నీలో స్వార్థం కనిపించడం లేదు. నీకు తిరిగి భూలోకమే కావాలంటే…అని శ్రీహరి ఒకింత ఆగారు.
లక్ష్మీదేవి కలగజేసుకొని…త్రిలోకంలో ఇప్పటివరకు ఎప్పుడు ఎవరికి ఇవ్వని వరం ఇస్తూ ఈ జీవిని కృతార్థున్ని చేయాలని నిర్ణయించడం ముదావహం స్వామి.. ఏమిటో మీ లీలలు నాకు కూడా అంతుబట్టడం లేదు.
అంతా నా అదృష్టం స్వామి.. మీ దయకు ప్రాప్తుడనయ్యాను అన్నాడు విజయ్. కానీ అంటూ తనకు కలిగిన సందేహాన్ని శ్రీహరి ముందుంచాడు జీవుడు.
రోడ్డు ప్రమాదం తర్వాత నా మృత దేహం అక్కడే పడి ఉంది.. పోలీసులు వచ్చి ఉంటారు..అనాథ శవంగా అంత్యక్రియలు చేసి ఉంటారు దేవా,నేను మళ్లీ భూలోకంలో సంచరించాలంటే శరీరం లేకుండా ఎలా స్వామిఅని ప్రాదేయపడ్డాడు విజయ్.
(సశేషం)