విజయుడు (ధారావాహిక న‌వ‌ల‌ పార్ట్‌-16)

ఈ రోజు పత్రికలు చూశావా… క్యాబినెట్ వివరాలు వచ్చాయి.
ఆ.. చూస్తున్న వర్షాలపై ఎక్కువగా రాసినట్లున్నారు.
చిన్న పత్రికలు వస్తాయా మీకు…
లేదు రెండు తెలుగు పత్రికలు ఓ ఇంగ్లీష్ పత్రిక మాత్రమే నాకు వస్తాయి.
మా కాలేజీకి ఎక్కువ పత్రికలు వస్తుంటాయి. చిన్న పత్రికల్లో కూడా అప్పుడప్పుడు మంచి వార్తలే వస్తుంటాయి. కాలేజీ నుంచి అడ్వర్‌టైజ్‌మెంట్లు ఇస్తుంటాము కదా అందరూ ఉచితంగానే పేపర్లు ఇస్తుంటారు. అన్నింటినీ ఒకసారి అలా చూస్తుంటాను. అయితే ఒక పత్రికలో క్యాబినెట్ మీటింగ్‌కు సంబంధించి ఆసక్తికర వార్త వచ్చింది.
లీడింగ్ పేపర్లలో రాని విషయాలు చిన్న పత్రికల్లో వస్తాయా..
అవును.. ఆ చిన్న పేపర్ ఎడిటర్ నాలుగేళ్ల కిందట పెద్ద పేపర్‌లో పనిచేసిన వాడే. అతనికి మంత్రులందరితో సన్నిహిత సంబంధాలుంటాయి. వారు తమతమ శాఖలకు సంబంధించిన ప్రకటలు ఇచ్చి సహకరిస్తుంటారు. ప్రభుత్వంలో లోటుపాట్లు జరిగితే ఈ పత్రికేక మంత్రులు ఉప్పు అందిస్తారు.
అవునా నాకు ఎప్పుడు మీరు చెబుతున్న పత్రికా ఎడిటర్ తారసపడలేదు.
మీ మీడియా సమావేశాలకు వచ్చి ఉంటారు, మీరే గుర్తు పెట్టుకొని ఉండరు. ఇప్పుడు మీడియా అంటే అరవై,డెబ్బయి మంది వస్తున్నారట కదా. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత విలేకర్ల సమావేశం ఒక మీటింగ్ లాగా కనిపిస్తున్నది.
అవును..అసలు ఆ పత్రికలో ఏమి వచ్చింది సర్..
మంత్రివర్గ సమావేశం ఇన్‌సైడు స్టోరీ అంటూ మంత్రులు, ముఖ్యమంత్రి ఏమేమి మాట్లాడుకున్నారో పూసగుచ్చినట్లు రాశారు. పేర్లు రాయలేదు కానీ రాజకీయాలు తెలిసిన వారందరికీ వారెవరో తెలుస్తుంది.
అలాగా నాకు ఫోన్‌లో వాట్స్‌యాప్‌ఉంది. ఫోటో తీసి పంపుతారా?
నాకు అంతగా తెలియదు కానీ పేపర్ ఇంటికి తెస్తాను నీవు కూడా లంచ్‌కు వచ్చేయి. అక్కడచూద్దువు కానీ.
అయ్యో ఇప్పటికే చాలా సార్లు మీ ఇంటికి వచ్చాను సార్..ఇక వద్దులేండి.
బ్రహ్మచారివి రోజూ హోటల్‌లోనే కదా తినేది. భోజనానికి మొహమాటం ఎందుకండి. మేం తినేదే మీరు తిందురు. ప్రత్యేకంగా ఏమి చేసే సమయం కూడా లేదు కదా ఇంట్లో. ఒంటిగంట వరకు రండి, నేను కాలేజీ నుంచి వస్తాను.
అలాగే అంటూ విజయ్ ఫోన్‌పెట్టేశాడు. ఆ వెంటనే కుటుంబరావు, తన కూతురు విరంచికి ఫోన్ చేసి ఎంఎల్‌ఎ విజయ్ లంచ్‌కు వస్తున్నాడని చెప్పాడు. విరంచి మొఖంలో అనుకోకుండా చిరునవ్వు వచ్చింది. ఎవరే ఫోన్ చేసింది..నీ ముఖం వెలిగిపోతున్నది. అని తల్లి ప్రశ్నిండంతో విరంచి గతుక్కుమన్నది.

నాన్నగారు నుంచి ఫోన్ మమ్మీ… కాలేజీ విషయాలు చెప్పాడు. మధ్యలో మొన్ననే వచ్చాడు కదా… విజయ్‌ను మరోసారి ఇంటికి రమ్మని చెప్పాడట. లంచ్‌కు వస్తాడట. ఇంట్లో ఏమి ఉంటే అది పెడదాం కంగారు పడకండి అని నాన్న చెబితే నవ్వు వచ్చింది అంతే. అంటూ తన గదిలోకి వెళ్లిపోయింది విరంచి. విజయ్ అనగానే ఎందుకో నాకు తెలియకుండానే మనస్సులో ఊహలలోకి వెళ్లిపోతున్నది. కంట్రోల్‌లో ఉండాలి. అమ్మాయిలు జాగ్రత్తగా లేకుంటే వారికే అనర్థాలు కదా… చెప్పలేం మహిళలంటే బలహీనతలుంటాయి మగవాళ్లకు కూడా… అంటూ తనతనకు తాను మనస్సు కుదటపర్చుకుంది.

పత్రికలో ఏమి వచ్చి ఉంటుంది. దానికి కుటుంబరావు ఎందుకు అంత ప్రాధాన్యతనిచ్చారు. సరే చదివితే అదే అర్ధం అవుతుందని విజయ్ ఆలోచనలో పడ్డారు. తనపై ఢిల్లీ శివారులో జరిగిన ప్రమాదం, మొన్న మరో వాహనం తనకారు పైకి దూసుకు వచ్చినట్లుగా రావడం, కుటుంబరావు కూడా జాగ్రత్తగా ఉండాలని మరీమరీ హెచ్చరించేలా మాట్లాడటం..ఏమో ఎందుకు ఇలా జరుగుతుందో అని విజయ్ మథనపడసాగారు. డిసెంబర్ 31 రాత్రి ఢిన్నర్‌లో అసలు వారు ఏమి మాట్లాడుకొని ఉంటారు. ఇది కూడా కుటుంబరావు వద్ద తెలుసుకోవాలి. మరోసారి ఆయనను కదిలించాలని నిర్ణయించుకున్నాడు విజయ్.

సార్ ఏమైనా పని ఉందా ఉండమంటారా అని తన పిఎ అడగడంతో, ఈ రోజు పెద్దగా ఏ పని పెట్టుకోలేదు నీవు వెళ్లవచ్చని పంపించాడు.

పత్రికలు చదవడం పూర్తి కాగానే తన ఆల్మారాలో ఉన్న పుస్తకాన్ని చేతులోకి తీసుకున్నాడు. చదవడంలో మునిగిపోతే విజయ్ సమయం మరిచిపోతారు. ఒంటి గంట అయింది. కుటుంబరావు ఇంటికి వెళ్లాలి కదా అంటూ రడీ అయి కారు తీసాడు విజయ్.

ఎన్ని సమస్యలున్నా, కారు డ్రైవింగ్ సమయంలో విజయ్ రోడ్డుపైనే దృష్టిసారించి కారు నడుపుతాడు. కుటుంబరావు ఇంటికి చేరుకోగానే అప్పటికే కాలేజీ నుంచి ఆయన వచ్చినట్లున్నాడు. విజయ్ కోసం ఎదురు చూస్తూ నిలబడ్డాడు. కొద్దిసేపు చూసి కాల్ చేద్దామనుకుంటున్నాను. లంచ్ లేట్ అవుతుంది, ముందుగా భోజనం చేసి తర్వాత మాట్లాడుకుందామంటూ నేరుగా డైనింగ్ టేబుల్ వద్దకు నడిచాడు. విజయ్ చేతులు కడుక్కుంటూ విరంచి ఎక్కడా అంటూ కళ్లతోనే హాలంతా వెతికాడు. ఇంతలో టేబుల్‌పై కర్రీ బౌల్ పెడుతూ గుడ్‌ఆఫ్టర్ నూన్ అంటూ విజయ్‌ను విష్ చేసింది విరంచి. ఆమెవైపు చూస్తూ తల వంచి తాను విష్‌చేశాడు విజయ్.

లంచ్‌కు అప్పటికే ఆలస్యం కావడంతో నలురుగు ఒకేసారి భోజనం కూర్చున్నారు. నాన్‌వెజ్ కర్రీ లేకపోయినా ఆమ్లెట్ వడ్డించారు. భోజనాల తర్వాత హాల్‌లో కూర్చున్న తర్వాత టివి ఆన్ చేసి వార్తలు చూస్తుండగా కాలేజీ నుంచి తెచ్చిన పత్రికను విజయ్‌కు అందించాడు కుటుంబరావు.

అధికారులు వెళ్లిన తర్వాత క్యాబినెట్ మీటింగ్‌లో మంత్రులు మాట్లాడిన విషయాలపై కథనం అంటూ ఆ పత్రికలో ప్రముఖంగా వార్త ప్రచురితమైంది. పత్రికలో వచ్చిన సమాచారాన్ని విజయ్ పైకే చదివాడు..

ఏమిటండీ ఆ ఎంఎల్‌ఎ…మంత్రుల పనితీరుపై ప్రతిసారి మాట్లాడుతుంటే మీరేమి కలగచేసుకోవడం లేదు. ఇలా అయితే మా పరువు ఏమవుతుంది. మీరు కంట్రోల్ చేయాల్సిందే అతనిని. అధికార పార్టీలో ఉండి విపక్షాల కంటే తీవ్రంగా ప్రభుత్వ పనితీరుతోపాటు మంత్రులపై విరుచుకుపడుతున్నాడు. మరో రెండేళ్లలో ఎన్నికలు రాబోతున్నాయి. మన భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచిస్తున్నారా.. అంటూ నలుగురైదుగురు మంత్రులు సిఎంకు వివరించారని తెలసింది. గత రెండు నెలల నుంచి మంత్రివర్గ సమావేశం జరగలేదు కదా అందుకే మీకు చెప్పలేకపోయాం. యువ ఎంఎల్‌ఎ ఏదో ఆవేశంలో మాట్లాడుతాడని మౌనం వహిస్తున్నాం. ఆయన గెలిచి మూడేళ్లు అయింది. మొదటి సంవత్సరం బాగానే ఉన్నారు. ఈ రెండేళ్ల నుంచే ప్రతి అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతాడంటే భయం వేస్తున్నది. ప్రతిపక్ష నేత లేదా ఇతర పార్టీ సభ్యులు ఏమి మాట్లాడినా వారు విపక్షం కాబట్టి ప్రజల నుంచి పెద్దగా మనకు ఇబ్బంది లేదు కానీ మన పార్టీ వాడే ఇలా చేస్తే ఎలా. మీరు కూడా చూస్తున్నారు కదా..పైగా మీరు ఆయనను అభిమానిస్తున్నారని బయట ప్రచారం ఉంది. దీంతో మన పార్టీ వారు ఎవరూ తిరిగి విజయ్‌పై విమర్శలు చేయలేకపోతున్నారు. అని వాపోయారు. దీనికి సిఎం జానకి రామయ్య బదులిస్తూ.. విజయ్ మాట్లాడేదానిలో తప్పులుంటే తాను పిలిపించి చెప్పేవానిని, కాని ప్రభుత్వ లోటుపాట్లను తోటి శాసనసభ్యుడు, అది కూడా మన పార్టీ వారే చెబితే మనం అర్థం చేసుకొని సరిదిద్దు కోవాలే కానీ ఇలా క్యాబినెట్‌లో చర్చించడం సబబేనా అంటూ వారిని వారించే ప్రయత్నం చేశారు.

ఇలాగే మీరు ఆ ఎంఎల్‌ఎను వెనుకేసుకు వస్తే మీ పదవికి ముప్పు ఏర్పడుతుంది. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగేలా ఆయన చేస్తున్న ప్రసంగాలు, మీడియాలో చెప్పడంతో, విపక్షాలకు మనమే ఆ అస్త్రాలు అందించినట్లు కాదా. ప్రభుత్వాన్ని తూర్పారా పట్టడానికి ప్రతిపక్ష పార్టీలకు మన శాసనసభ్యుడే అవకాశం ఇస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో మన పార్టీ ఓటమి పాలైతే పదవుల్లో మీరు ఉండరు. మేము ఉండం. ఎంఎల్‌ఎలుగా తిరిగి గెలవడమే కష్టమవుతుందేమో ఆలోచించండి. ఆయన ప్రసంగాలు, మీడియా క్లిప్పింగులు అధిష్ఠానం వద్దకు ఎప్పటికప్పుడు చేరుతున్నాయట. మా జిల్లా లోక్‌సభ సభ్యుడొకరు నాకు చెప్పాడు. ఆయన పేరు మీద పెద్ద ఫైలే ఉందట. అధిష్ఠానం కూడా ఈ విషయంపై ఆసక్తి కనబర్చుతూ మన ఎంఎల్‌ఎ ను ప్రోత్సహించాలని, భవిష్యత్తులో మంచి నాయకుడు అవుతాడని, ప్రజల్లో కూడా ఆయనకు వస్తున్న పలుకుబడిని అంచనా వేయాలని కూడా అనుకుంటున్నారట. రాష్ర్టంలో పార్టీ దెబ్బతింటుందని అనుకోకుండా అధిష్ఠానంలో ఇలా ఆలోచించడం ఏమిటో మాకు తెలియడం లేదంటూ మరో మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ దశలో ముఖ్యమంత్రి చొరవ తీసుకుంటూ మంత్రుల ఆవేధన అర్థం చేసుకున్నానని, అయితే మనవాడు అలాంటి వాడు కాదు. పార్టీతో పాటు తన పట్ల ఎంతో ఆదరణతో ఉంటున్నాడు. మనం ఆయనను తప్పు పట్టవద్దు. యువరక్తం కదా, కొంత దూకుడుగా వ్యవహరిస్తున్నాడు అంతే. ప్రతి రోజు నాతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తాడు .స్వయంగా కలువలేకపోతే ఫోన్ అయినా చేస్తాడు. మీరేమి కంగారు పడకండి. పార్టీ బతకాలంటే మనమందరం అన్ని విధాలుగా పరస్పరం సహకరించుకోవాలి. సరే మీరంతగా ఆవేధనచెందుతున్నారు కాబట్టి మీ అభిప్రాయాలను ఆయనతో ప్రస్తావించడానికి ప్రయత్నిస్తాను. సరేనా. అని సిఎం వారిని సముదాయించే ప్రయత్నం చేశారని తెలసింది.

మరో మంత్రి కలుగచేసుకుంటూ ఇటీవల ఆ యువ ఎంఎల్‌ఎ హస్తినకు వెళ్లాడట. ఆయన పర్యటన ఎంత సీక్రెట్‌గా సాగిందంటే ప్రభుత్వ భవన్‌లో బస చేయకుండా ఎక్కడో లాడ్జీలో ఎక్కువ రోజులే మకాం వేసి వచ్చాడట. అధిష్ఠానం పెద్దలెందరిని కలిసాడో..మనపై ఏమేమి ఫిర్యాదులు చేశాడో తెలియదు కానీ ఎంఎల్‌ఎగా ప్రత్యేక వసతి లభించే మన భవన్ కాదని లాడ్జీలో ఎందుకున్నాడో అనుమానించరా సిఎం గారు, అని ఇతర మంత్రుల అసంతృప్తి అగ్నిని మరింత ఎగదోసే ప్రయత్నంచేశాడు.

అదేమి లేదు ఢిల్లీకి వెళ్లేటప్పుడు తనకు చెప్పాడని ఇందులో అనుమానించాల్సింది ఏమీ లేదని సిఎం కొట్టి వేసినా మంత్రులు సంతృప్తి చెందలేదు.

సార్ ఇరిగేషన్ కంట్రాక్టులు ఖరారు చేసింది మీరే..బిల్లులు కూడా ఆర్థిక శాఖకు మీరు చెబితేనే రిలీజ్ అవుతున్నాయి. ఇందులో నా ప్రమేయం అసలే లేదనను కానీ అంతా మీకు తెలిసే జరుగుతున్నది కదా ఆ ఎంఎల్‌ఎ ఏమిటీ అంతా నేను తినేస్తున్నట్లుగా ప్రసంగాలు చేస్తున్నారు. పార్టీని నడపడానికి డబ్బు అవరమని మీరు ఆలోచిస్తారు కానీ ప్రభుత్వ అంటేనే అవినీతి మయమనే విధంగా అధికార పార్టీ శాసనసభ్యుడు ఆరోపిస్తూ పోతుంటే పార్టీకి నూకలు చెల్లుతాయి సార్ అంటే ఈ శాఖ మంత్రి ఏకరువు పెట్టారు.

ఏ రియల్ ఎస్టేట్ సంస్థకు అయినా బిల్డర్‌కు అయినా పర్మిషన్లు మీకు తెలియకుండా జరగడం లేదు. మీ కార్యాలయ సెక్రటరీ చెప్పిన తర్వాతనే మా శాఖాధికారులతో అనుమతులిప్పిస్తున్నాను. కానీ నగరాలు, పట్టణాల్లో అన్ని అక్రమ కట్టడాలే అని ఆయన విమర్శలు చేస్తుంటే ఎలా సహిస్తున్నారు మీరంటూ మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి నిరసన ప్రకటించారు. కొద్ది మంది మినహా మంత్రులందరూ ఆ శాసనసభ్యునిపై ఏదో ఒక చర్య తీసుకోవాలని పట్టుబట్టడంతో వారిని సముదాయించేందుకు ముఖ్యమంత్రి అధిక శ్రమపడ్డారు.

మీరే అంటున్నారు. మన పార్టీ అధిష్ఠానం వద్ద ఆయనకు మంచి పేరుందని..మనం ఇక్కడ పార్టీ అధ్యక్షునికి చెప్పి క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం కూడా లేదు. ఆయన పార్టీలో కేంద్ర కార్యవర్గ సభ్యుడు. పార్టీ పరంగా కూడా హస్తిననేతలే ఏదైనా చేయగలుగుతారు. పైగా ఆయన నిబద్ధత కలిగిన నేత. ఎవరికీ అపకారం చేయాలనే తలంపు ఉన్నట్లుగా నాకు కనిపించలేదు. ప్రజలకు మంచి జరగాలనే తపన అందరికీ ఉంటుందండి ఆ వయస్సులో. మనం కొంత సంయమనంతో వ్యవహరించాలి. ఆయనతో మీరు కూడా చర్చిస్తూ ఉండండి. మీమీ శాఖల్లో ఏమి మంచి జరుగుతుందో చెప్పి చూడండి. అంతేకానీ మన పార్టీ ఎంఎల్‌ఎపై మనమే అసంతృప్తిగా ఉన్నట్లు బయటకు తెలిస్తే ప్రతిపక్షాల నుంచి దాడి తీవ్రతరం అవుతుంది. ఇది కూడామనకు మంచిదా. ఆయనపై మీరు అపోహలు పెట్టుకోకండి. అంతా సర్దుకుంటుందని మరోసారి మంత్రులకు వివరించి, ఇక మీటింగ్ ముగిద్దామని జానకీ రామయ్య లేవడంతో ఇతర మంత్రులు కూడా తమలో తాము గొణక్కుంటూ తమతమ ఛాంబర్‌లోకి వెళ్లిపోయారు. మొత్తం వార్తా కథనాన్ని చదివిని విజయ్‌కు అంతా తన గురించే మంత్రులు మాట్లాడినట్లు అర్థమైంది. తానే స్వయంగా ముఖ్యమంత్రిని కలువాలని నిర్ణయించుకొన్నాడు. సిఎంకు కాకుండా ముఖ్యమంత్రి సతీమణి అన్నపూర్ణ దేవికి ఫోన్ చేసి…

అమ్మా మీ చేతి భోజనం తిని చాలా రోజులైంది రేపు లంచ్‌కు వస్తున్నాను ఇప్పుడే సరేనా, అన్నాడు విజయ్.

(సశేషం)

త‌ప్ప‌క‌చ‌ద‌వండి: విజయుడు (ధారావాహిక న‌వ‌ల‌ పార్ట్‌-15)
1 Comment
  1. Affiliate Marketing says

    Wow, wonderful weblog structure! How lengthy have you ever been running a blog for? you made blogging look easy. The whole glance of your site is fantastic, as well as the content!!

Leave A Reply

Your email address will not be published.