విజయుడు (ధారావాహిక న‌వ‌ల‌ పార్ట్‌-3)

మనకు ఇక్కడ పరిచయం ఉన్న వారు లేరు. నేను ఎవరికి తెలియవద్దనే ప్రభుత్వ వసతి లభించే మన భవన్‌ను కాదని కరోల్‌బాగ్ హోటల్‌లో బస చేశాను. సరే నీవు అంటున్నావు కాబట్టి కారును అపు చాయ్ తాగుదాం.

డ్రైవర్ కారు ఆపి పక్కన నిలబడి చూడగా లారీ వారిని దాటి ముందుకు వెళ్లింది. దీంతో డ్రైవర్ నారాయణ మరోసారి లారీ నెంబర్ చూసి నోట్ చేసుకున్నాడు. టీ తాగి కొంత రిలాక్స్‌డ్‌గా అనిపించగా తిరుగు ప్రయాణం మరింత ఆలస్యంగా ఉంటే బావుండేమో అని విజయ్ తనలో తానే అనుకున్నాడు. అయితే సిఎం మాటలు జ్ఞప్తి చేసుకున్నారు. పదా పోదాం నారాయణ అని పురమాయించారు. కారు ముందుకు మరో పది నిమిషాలు వెళ్లిందో లేదా అదే లారీ ఎదురుగా అతి వేగంగా రావడాన్ని నారాయణ గమనించి సార్ ప్రమాదం ముంచుకు వస్తున్నది వీడేవడో కావాలని రాష్‌గా లారీని నడుపుతున్నాడు. అది మన మీదికే దూసుకు వస్తున్నట్లుగా ఉంది. ఏమి చేద్దామంటూ డ్రైవర్ నారాయణ కారును వీలైనంతగా సైడు తీసుకుంటున్న సమయంలోనే ఒక్కసారీగా ఎదురుగా వస్తున్న లారీ కార్‌ను వేగంగా సమీపించింది.

నారాయణ…….. నారాయణ……. నారాయణ

జాగ్రత్త అంటూ విజయ్ పదేపదే డ్రైవర్ వైపు చూస్తూ హెచ్చరించారు. సెకండ్‌లో పదో వంతు సమయంలో లారీ
ఢాం… అంటూ అతి వేగంగా కారును ఢీ కొట్టింది. ఆకాశంలో మేఘాల రాపిడితో పిడుగులు పడే శబ్దానికి మించిన
భ‌యంకర ధ్వనితో కారు అల్లంత దూరంలో పడిపోయి మంటలు లేచాయి. దీంతో చుట్టు పక్కల వారు అక్కడి చేరుకుంటున్నారు. సీటు బెల్టు పెట్టుకున్న నారాయణ అటు ఇటు కదలడానికి కూడా అవకాశం లేక మంటల్లోనే ఉండి పోయాడు. అదృష్టమో దురదృష్టమో కానీ వెనుక సీటులో ఉన్న విజయ్ లారీ ఢీ కొన్నవేగానికి తనవైపు ఉన్న కారు డోర్ కూడా విడిపోయి దూరంగా పడటంతో దానితోపాటు విజయ్‌కు కొద్ది దూరం వచ్చి దబాలున కిందపడిపోయాడు. అక్కడ గుమికూడిన వారిలో ఒకరు అంబులెన్స్‌కు తర్వాత పోలీసులకు సమాచారం అందించాడు.

నాకు ఏమవుతున్నది? ఏం జరిగింది? నేనేమి నేరం చేశానో? తెలిసీ ఎవరికీ అన్యాయం చేయలేదు. నాకు ఇలా ఎందుకు జరుగుతున్నదని ఆలోచిస్తూనే విజయ్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతున్నాడు. మరణం అంటే ఇదేనా అయితే నేను ఈ ప్రమాదంలో చనిపోతున్నట్లేనా? ఏమిటిది? మనస్సు కూడా తాను చెప్పినట్లుగా వినలేనంటున్నది. అసలు ఏమవుతున్నదని తనలో తానే ఏదో గొణుక్కుంటుండగా మనస్సు, తన ఆధీనంలో లేనట్లుగా పరిస్థితి మారుతున్నది.

చావు బతుకుల మధ్య ఊగిసలాట అంటే ఇదేనేమో.. రోడ్డు ప్రమాదంలోనే అక్కడికక్కడే చని పోయిన తన మాతృమూర్తి, తర్వాత ఆస్పత్రిలో తండ్రి కూడా మృత్యువాతపడిన సందర్భం ఈ ఆపత్సమయంలోనూ విజయ్ మనోఫలకంలో సాక్షాత్కరించింది. తన నియోజకవర్గ ప్రజలు, ఆత్మీయులు ఒక్కరొక్కరుగా జ్ఞప్తికి వస్తున్నారు. ఇక తన ప్రాణం ఎంతో సేపు కాదు కొన్ని సెకన్‌లు కూడా నిలవదనే సంకేతాలు అతనికి అందాయి. ఆ తర్వాత ప్రాణం విడిచాడు విజయ్.

ప్రమాదం జరిగిన ప్రాంతానికి అంబులెన్స్ చేరుకుంది. పోలీసులు వచ్చారు. యాక్సిడెంట్ జరిగిన విధానంపై పోలీసులు అన్ని కోణాల నుంచి పరిశోధనలు ప్రారంభించారు. కారు మొత్తం కాలిపోయి బూడిద అయింది. కారుకు కొద్ది దూరంలో పడి ఉన్న విజయ్ మృత దేహం చూసిన అంబులెన్స్ డాక్టర్లు ఆశ్చరం వేసింది. శవం పై ఏ ఒక్క గాయం లేదు. మనిషి నిద్ర పోయినట్లుగానే పడి ఉన్నాడు. అయితే అప్పటికే శ్వాస ఆగిపోవడం గమనించారు. దీంతో డాక్టర్లు తమ అంబులెన్స్‌లో వెళ్లిపోగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. లారీ ఒకటి వేగంగా రాంగ్ రూట్‌లో వచ్చి కారును ఢీకొనడం కనిపించిందని తిరిగి అంతే వేగంగా వెళ్లిపోయిందని స్థానికులు పోలీసులకు వివరించారు. అయితే కారులో డ్రైవర్ శరీరం ఆనవాలు పట్టకుండా కాలిపోవడంతో ఆయన ఆధారాలేవీ లభించలేదు. పెట్రోల్ ట్యాంక్ కూడా పగిలిపోవడంతో కారంతా ధ్వంసమై ఎలాంటి ఆనవాలు లభించని పరిస్థితి ఏర్పడటంతో పోలీసులకు ఏమీ తోచలేదు. అయితే కొద్ది దూరంలో పడి ఉన్న శవాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. టీషర్టు,జీన్ పాయింట్ ధరించిన వ్యక్తి శవంగా నమోదు చేసుకున్నా, ఊరు పేరును సూచించే ఎలాంటి కార్డు కూడా వారికి లభించలేదు. క్రైం సీన్ అంతా అగమ్య‌ గోచరంగా ఉంది. నలుగురు కానిస్టేబుల్స్‌తో అక్కడికి చేరకున్న సబ్ ఇన్స్‌పెక్టర్ రఘువీర్ అన్ని విధాలుగా ప్రయత్నాలు ప్రారంభించారు. ముందుకు కారు పూర్తిగా దగ్దం కావడంతో కనీసం కారు నెంబర్ ను పరిశీలించి అది ఎక్కడ రిజిస్టర్ అయిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. కానీ దాని ఆనవాలు కూడా కనిపించనంతగా కారు మాడిపోయింది. ఇక కారు సీటులో అతుక్కుపోయి ప్రాణాలు వదిలిన డ్రైవర్ ఆనవాలు ద్వారా అయినా వివరాలు తెలుస్తాయనే ఆశ కూడా మిగలలేదు. శరీరం పూర్తిగా కాలిపోయి కేవలం ఎముకలు మాత్రమే మిగిలాయి. కనీసం ఆయన డ్రైవింగ్ లైసెన్స్, ఇతర కార్డుల ద్వారా అయినా కొంత సమాచారం లభించే అవకాశాలున్నప్పటికీ వాటి ఆజపాజా లేదు. అయితే డ్రైవర్ ఉపయోగించే సెల్‌ఫోన్ ఎక్కడ అంటూ దాని కోసం వెతకాలని ఎస్‌ఐ తన కానిస్టేబుళ్లను పురమాయించారు. ఫోన్ దగ్గమైనా సిమ్ కార్డు అయినా లభిస్తుందనే లక్ష్యంతో వారు చేసిన సెర్చ్ కూడా ఫలించలేదు. కారు పెట్రోల్ ట్యాంక్‌లో అధిక పెట్రోల్ ఉందో లేక ఢీ కొట్టిన లారీ ఎంత వేగంగా దూసుకు వచ్చి కారు ఢీ కొట్టిందో కానీ ఎలాంటి ఆధారాలు లభించని స్థాయిలో కారు దగ్దమైంది.

డ్రైవర్ ఎవరో తెలియదు. ఆయన లైసెన్స్ కానీ కారు ఆర్‌సి కాని లేదు. ఇక ఎలా అంటూ ఎస్‌ఐ తలపట్టుకున్నాడు. ఆ వెంటనే ఆయనకు మరో శవం ఎలాంటి గాయాలు లేకుండా పడి ఉండటం గుర్తుకు వచ్చి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకొన్నారు. ఆ శవం వద్ద కనీస ఆధారాలు లభిస్తాయనే విశ్వాసంతో పక్కనే విజయ్ మృత దేహం వద్దకు చేరుకున్నాడు. ముందుగా శవంకు ఉన్న షర్టు జేబులు వెతికారు. అది టీ షర్టు కావడంతో అందులో కొన్నికరెన్సీ నోట్లు మాత్రమే లభించాయి. వెంటనే పాయింట్ జేబులను ఆదరాబాదరాగా వెతకడం ఆరంభించారు. జీన్ పాయింట్ వెనక జేబులు, పక్క జేబుల్లో ఏ ఒక్క పేపరు లేదు. కనీసం విజయ్ చిరునామా లేదా గుర్తింపు కార్డు వంటి ఏ ఒక్క కార్డు కూడా లభించలేదు. దీంతో ఊసూరుమంటూ నిలబడిన ఎస్ ఐ కి ఏమి చేయాలో పాలుపోలేదు. దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఆగ్రాకు వెళ్లిన, కారు తిరిగి వస్తున్నట్లుగా ఆయన ఊహించగలిగాడు కానీ ఆయనకు సంబంధించిన వివరాలేమీ ఎక్కడా కనిపించడం లేదు.

ఏమి చేయాలో కూడా ఆయనకు పాలుపోలేదు. టాక్సీ కారులో కేవలం ఒక్కడే ప్రయాణించాడంటే కొంత పలుకుబడి ఉన్న వ్యక్తి గానీ లేదా బాగా డబ్బు ఉన్న వారు కానీ రాజకీయ నాయకుడు అయినా అయి ఉంటాడు. ఏ రాష్ర్టం వాడో, ఎప్పుడు వచ్చాడో, ఎందుకు వచ్చాడో, ఎక్కడ బస చేసాడో తెలిసే కనీస ఆధారాలు కూడా లభించలేదు పోలీసులకు… కిం కర్తవ్యమంటూ ఆలోచనలో పడ్డారు పోలీసులు.

(సశేషం)

త‌ప్ప‌క‌చ‌ద‌వండి episode-2: విజయుడు (ధారావాహిక న‌వ‌ల‌)

Leave A Reply

Your email address will not be published.