విజయుడు (ధారావాహిక న‌వ‌ల‌ పార్ట్‌-30)

వీలునామా విషయం లాయర్‌తో నిన్ననే మాట్లాడాను, రెండు, మూడు రోజుల్లో పత్రాలు తీసుకొని వస్తానని చెప్పాడు. వస్తాడులే, నీవు అధికంగా ఆలోచించి, ఆరగ్యోం పాడు చేసుకోకు. నేను ఎంతో చెప్పి చూశాను కదా, మన దగ్గర ఉండటానికి వాడికి ఏమి తక్కువ చెప్పు. పిచ్చికానీ వాడు నీ స్వంత కొడుకు కాదు గా, వానికి మందలించడానికి, మధ్యలో వచ్చిన ప్రేమలు అంతే పూర్ణ. మరోసారి చెప్పి చూద్దాం, కొంత కాలం గడవని అంటూ మరోసారి భార్యను బుజ్జగించాడు జానకి రామయ్య

వాడు అందరిలాంటి వాడు కాదండీ, చెప్పాడు కదా కారణాలు. మీరే సరగ్గా అర్థం చేసుకోలేదు వాడిని. ఎంతగా బాధపడుతున్నాడో మీ మాటలు కాదన్నందుకు, ముందే చెప్పాడండి తన బలహీనతలు, మీకు వచ్చే రాజకీయ ఆటుపోట్లు, అనవరసంగా వాన్ని తప్పుపట్టకు అంటూ ఆవేశంగా భర్తకు బదులిచ్చింది.

ఎంతైనా తల్లి ప్రేమ అనుకున్నాడు సిఎం. అనుకున్నట్లుగానే అడ్వకేట్‌ రెండు రోజుల తర్వాత బంగ్లాకు వచ్చాడు. విల్‌ రాయడానికి మరింత జాప్యం జరగాలని ఆశిస్తున్న సిఎం, అన్ని సిద్ధం చేసుకొని వచ్చావా అంటూ ప్రశ్నించాడు.

అవునండి, మీ తదనంతరం, మీ సర్వదాస్తి విజయ్‌కు చెందాలని రాశాను. అంతే కదా అన్నాడు.

అంటే కేవలం నాపేరు మీద ఉన్నవి మాత్రమేనా, మరి పూర్ణ పేర కూడా చాలా ఆస్తిపాస్తులు రిజిస్టర్‌ చేయించాను. వాటి సంగతి ఏమిటి? ఈ వివరాలు కూడా ప్రత్యేకంగా రాయాలా? లీగల్‌గా ఆలోచించి చెప్పు. మార్పులు అవసరమా లేక ఇదే సరిపోతుందా అంటూ సిఎం ప్రశ్నల వర్షం కురిపించాడు. దానికి న్యాయవాది బదులిస్తూ,

దంపతులు తమ ఆస్తులను ఎవరికైనా రాసిచ్చే అవకాశం ఉంటుంది కానీ, దానిపై ఇద్దరు సంతకాలు చేయాలి, కొద్ది మార్పులు చేయాల్సి ఉంటుంది ఈ పత్రాలలో, మరి ఈ సవరణలు చేసి మళ్లీ కొత్త పత్రాలు తీసుకు వస్తాను. కొద్ది రోజుల సమయం ఇవ్వండి అన్నాడు.

సరే అంతా పకడ్భందీగా జరిగేలా చూడు. తర్వాత విజయ్‌కు ఇబ్బందులు రావద్దు అనుకుంటూ భార్య వైపు చూశాడు, ఏమంటావు పూర్ణ, కొద్దిగా మార్పులు చేసి, ఇద్దరం సంతకం చేసేలా పత్రాలు తీసుకు వస్తాడు. ఈ వారంలోనే పని పూర్తి చేద్దాం ఏమంటావు అన్నాడు.

ముందే చెప్పవచ్చు కదా లాయర్‌, ఈ సమస్య వస్తుందని, ఆరోజు ఇద్దరు సంతకం చేయాలని ఎందుకు ప్రస్తావించలేకపోయావు? నీకు అనుభవం ఉంది కదా ఆమాత్రం ఊహించలేవా? ఇప్పటికే ఆలస్యం చేశావు, ఈ సారైనా అంతా కరెక్టుగా చూసుకొని త్వరగా రా..ఇద్దరి పేర ఉన్న అన్ని ఆస్తులు విజయ్‌కే చెందుతాయని క్లారిటీగా ఉండాలి పత్రాల్లో , సరేనా అంటూ ఆదేశించింది అన్నపూర్ణమ్మ.

సరే అమ్మా, వస్తాను సార్‌ అంటూ లాయర్‌ వెళ్లిపోగానే సణుగుతూ భర్త దగ్గరకు చేరింది అన్నపూర్ణమ్మ. ఏదో ఫోన్‌ రావడంతో సిఎం తన ఆఫీసు గదిలోకి వెళ్లిపోయాడు. ఆలోచిస్తూ అక్కడే కొద్దిసేపు కూర్చింది ఆమె.

హోటల్‌లో తనపై దాడి జరిగిన తర్వాత వచ్చిన ఫోన్‌ కాల్స్‌, మెసెజీలకు రిప్లయి ఇచ్చే కార్యక్రమం ఎంతవరకు వచ్చిందో పిఎ నగేష్‌తో చర్చిస్తున్నాడు విజయ్‌. వాటి సంఖ్య అత్యధికంగా ఉండటంతో ఒక్కరొక్కరికి తిరిగి థాక్స్‌ చెబుతూ మెసెజీలు పంపడం కష్టమని ముందుగా నెంబర్లన్నింటినీ కంప్యూటర్‌లోకి ఫీడ్‌ చేస్తున్నాడు నగేష్‌. కంప్యూటర్‌ ద్వారా బల్కు మెసేజీలు పంపే అవకాశం ఉండటంతో ఈ విధానం బాగుంటుందని విజయ్‌ చెప్పాడు. ఒక్కో నెంబర్‌ ఫీడ్‌ చేయాలి. నెంబర్‌ తేడా వస్తే రాంగ్‌ వ్యక్తికి మెసేజ్‌ వెళ్తుంది. అందుకే జాగ్రత్తలు తీసుకుంటుండంతో కొంత ఆలస్యం అవుతున్నది. పైగా ఈ వివరాలన్ని భద్రపరిస్తే , విజయ్‌ అభిమానులు రాష్ట్రంలో ఎందరు ఉన్నారో కూడా అర్థమవుతుంది.

ఏ జిల్లాపర్యటనకు వెళ్లినా, విజయ్‌ వారిని విశ్వసించి, పర్యటనలు విజయవంతం చేసుకోచ్చు,అనుకున్నాడు నగేష్‌. అందుకే ఒకటికి పదిసార్లు సరిచూసుకుంటూ అందరినెంబర్లు ఫీడు చేస్తున్నాడు. నాలుగు రోజుల సమయంలో ఈ పనిని పూర్తి చేసి విజయ్‌కు వివరించడంతో వారందరికీ పంపే మెసేజీ సారాంశాన్ని తయారు చేయడంలోనూ విజయ్‌ తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు. తనకు ఆపదవచ్చిన సమయంలో వెంటనే స్పంధించి, తన క్షేమ, సమాచారాలు తెలుసుకునేందుకు వారందరూ చూపిన, అభిమానం, ప్రేమకు కృతజ్ఞతలు చెప్పడానికి మాటలు తీర్చిదిద్దారు. అందరికీ ఇదే మెసేజీ పంపాలని నగేష్‌కు సూచించాడు. కంప్యూటర్‌ ద్వారా కావడంతో అతి తక్కువ సమయంలోనే ఈ పనిని పూర్తి చేసినందుకు నగేష్‌ను మెచ్చుకున్నాడు. ఈ రోజు తొందరగా ఇంటికి వెళ్లు, మీ భార్య సంతోషిస్తుందని పంపించడంతో థాక్స్‌ చెప్పి బయలు దేరాడు నగేష్‌.


అందరితో పాటు తనకు వచ్చిన కంప్యూటరైజుడు మెసేజీ చూసిన విరంచికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తనకు నేరుగా మాట్లాడకుండా ఇలాంటి సందేశం పంపడం ఏమిటని విజయ్‌కు కాల్‌ చేసింది. వేలాది మందితో సమానంగా నన్ను చూస్తున్నాడన్నట్లుగా ఆమె ఆగ్రహంగా ఉంది. అందుకే కాల్‌ రిసీవ్‌ చేసుకొని అటువైపు విజయ్‌ హాయి, హలో అంటూ పలుసార్లు చెప్పినా ఆమె నుంచి సమాధానం రాకపోవడం ఆశ్చర్యం వేసింది విజయ్‌కు. ఏమీ లైన్‌ బాగాలేదా, మీరుమాట్లాడటం లేదా అంటూ విరంచిని ప్రశ్నించాడు. లైన్‌లోనే ఉన్నట్లుగా చప్పుడు చేస్తూనే ఏమీ రిప్లయి ఇవ్వలేదు. దీంతో ఆమె కోపంగా ఉందని అర్థం అయింది కానీ కారణం ఊహించలేకపోతున్నాడు.

మీరు ఏమి చెప్పకుంటేఎలా, నాకు విషయం తెలియాలి కదా అంటూ నవ్వాడు, విజయ్‌.
అవును మీకు నవ్వులాటగా ఉంటుంది. నాతో మాట్లాడటానికి మీకు తీరిక లేదు. కనీసం స్వయంగా మెసేజ్‌ పంపడం కూడా సాధ్యం కావడం లేదు పాపం, అంత బిజీగా ఉన్నారా? భోజనానికి పిలుద్దామని నాన్న గారుకూడా పదేపదే అంటున్నారు. మీరేమో తీరిక లేదు తర్వాత చూద్దామంటున్నారు. ఎప్పటికీ మీకు వీలుకలుగుతుందో చెప్పండి, ఎదురు చూస్తూ ఉంటాం మరి అంటూ దీర్ఘాలు తీసింది విరంచి.

ఇదా మీ ఆగ్రహానికి కారణం. ఇది మా పిఎ పనండీ, దాడి తర్వాత నాకు ఫోన్‌చేసిన వారందరికీ, మెసేజీ చేసిన వారికి కూడా థాక్స్‌ మెసేజీలు పంపించాడు. బహుశ అది మీకు కూడా వచ్చి ఉంటుంది. దీనికేఅంత కోపం అయితే ఎలాగండి, మీరు ఆరోజే మాట్లాడారు. అన్నివిషయాలు మాట్లాడుకున్నాం.ఇపుడు చెప్పండి మీ ఇంటికి ఎప్పుడు రమ్మంటారు? గతంలో నేను ఎక్కడికి వెళ్లినా ఒక్కన్నే కానీ,నేడు కొత్త పద్దతండీ, పోలీసుల ఆంక్షలు, ఒంటరిగా వెళ్లవద్దు. ఎప్పుడూ అంగరక్షకులుండాల్సిందే.

అవును విన్నాను. ఇంకాచూడలే.. ఒకసారి రండి అందరినీ చూసే మహా భాగ్యం కలిగించండి అంది వ్యగ్యంగా..
ఏమిటీ ఈ రోజు ప్రతి విషయానికి పోట్టాటకు దిగుతున్నారు. మీ థీసిస్‌ ముందుకు పోవడం లేదని ఏమైనా చిరాకు ఉందా? నేను మాట ఇచ్చాను కదా సహాయం చేస్తానని, మీరే అడగడంలేదు మరి, ఉడికించాడు విజయ్‌.

అంతా మాటలే, నేను ఏవేవో చెప్పాను, అదంతా ఆమెకు తెలియదు, వెళ్లి కనుక్కుందామనే ఆలోచన మీకు లేకపాయే. పైగా నన్ను చిరాకు పడుతున్నావనే ఆరోపణలు. ఇలాగే ఉంటుందండి మగ మహారాజుల పోకడలు అంటూ విరంచి ఎకసెక్కం చేసింది.
దీనికే మగజాతినంతా ఆడిపోసుకోవడం ఎందుకులే. ఏదో కొన్ని అవాంతరాల వల్ల మీతో మాట్లాడలేక పోయాను. ఆ కారణాలు మీకూ తెలుసు, అయినా సాధింపులు తప్పడం లేదు. కానీ నేను మహిళామణుల స్వభావాన్ని ప్రస్తావించడం లేదు సుమండీ అంటూ పరోక్షంగా ఎత్తిపొడిచాడు విజయ్‌.

మాటలు బాగా నేర్చారు, అనడం లేదంటూనే మీ అక్కసు వెలిబుచ్చుతున్నారంటూ తీవ్రంగానే మాట్లాడిరది విరంచి.
అమ్మో, మీరు మాటకారులే. ఇక చాలండీ ఈ విమర్శలు, ఆరోపణలు. మీరిలా అంటుంటే భయమేస్తుంది నాకు,సూటిగా అడగండీ ఏదైనా అంటూ నవ్వాడు విజయ్‌.

ముందుగా ప్రారంభించింది మీరే కదా? అంటూ నవ్వింది. సరే మా ఇంటికి భోజనానికి ఎప్పుడు వస్తారో సెలవివ్వండి చాలు.
రేపు సాయంత్రం మీ ముందుంటాను, మీ డౌట్స్‌ ఏవైనా, ఎలాంటివైనా సరే అడగవచ్చు. అనడంతో అందులో వ్యంగ్యాన్ని అర్థం చేసుకున్నా ఆమె మరో మాటకు అవకాశం ఇవ్వకుండా, ఎదురు చూస్తుంటా అని కాల్‌ కట్‌ చేసింది.విరంచితో ఏ సంభాషణ అయినా విజయ్‌కు నూతన ఉత్సాహం కలిగిస్తుంది. ఆమె సాన్నిహిత్వం ఎందుకో కొత్త ఊహల్లోకి తీసుకువెళ్తుందనుకున్నాడు విజయ్‌.

తనకు ఊహ తెలిసిన నాటి నుంచి ఏ మహిళతో ఇంత సన్నిహితంగా మాట్లాడిరది లేదు. చిన్నప్పటి నుంచి చదువుపైనే అధిక శ్రద్ధ.కాలేజీ స్థాయిలోనూ అమ్మాయిలు మాట్లాడినా, అది పాఠ్యాంశాలకు మాత్రమే పరిమితమయ్యేది. యూనివర్సిటీలో ఒకరిద్దరు క్లాస్‌మేట్స్‌ తనతో ఎక్కువగా మాటలు కలిపేందుకు ప్రయత్నించినా పని ఒత్తిడితో అనుకుంటా వారితో పెద్దగా మాట్లాడేవాడు కాదు. కాలేజీ క్లాసులు, తర్వాత మధ్యాహ్నం నుంచి చేస్తున్న ఉద్యోగం కోసం పరుగులు..అంతే జీవితం. అప్పుడప్పుడు స్వంత గ్రామానికి వెళ్లినా, రెండు రోజులకు మించి ఉన్నది లేదు. బంధువులు కూడా పెద్దగా లేరు కాబట్టి, తల్లిదండ్రులతోనే కాలక్షేపం. తర్వాత తిరిగి కాలేజీ, క్లాస్‌లు, ఉద్యోగం. ఇక అమ్మ,నాన్న ప్రమాదంలో మృత్యువాత పడిన తర్వాత అంతా ఒంటరి బతుకే. రిపోర్టర్‌గా ఉన్న రోజుల్లో ఉద్యోగం కొంత థ్రిల్లింగా ఉండేది.రోజులు ఊరికే పరిగెత్తేవి. ఉన్నత స్థాయి పరిచయాలు, ఏదో ప్రజల సమస్యకు పరిష్కారం లభించేలా వార్తలు రాయడానికి ప్రయత్నాలు, అవి మొదటి పేజీలో లేదా ప్రాధాన్యతనిచ్చి పబ్లిష్‌ అయితే పేపర్‌లో చూసుకొని ఆనందించడంతోపాటు పలువురు ప్రశంసలు లభించేవి.

సంతోషంగా గడిచినవి ఆ రోజులు. శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత ఈ మూడేళ్లలో ఎక్కువ మంది తనను కలిసేందుకు వచ్చినా, వారంతా ఏదో సమస్యలు,ఇబ్బందులనే వివరిస్తున్నారు. వాటి పరిష్కారానికి ఉన్నతాధికారులతోనో, మంత్రులతోనే మాట్లాడటంతో అవి ఒక దశకు వస్తే, సమస్య తీరిందని లేదా ప్రభుత్వ సహాయం లభించిందని వచ్చిచెప్పే వారి వల్ల కొంత తృప్తి, ఇలా సమయం గడిచిపోతున్నది. కానీ విరంచి పరిచయం తర్వాత జీవితం ఏదో మార్పును కోరుకుంటున్నట్లుగా అనిపిస్తున్నది విజయ్‌కు.

మాతృప్రేమను పంచుతున్న అన్నపూర్ణమ్మ కూడా విజయ్‌కు వెంటనే గుర్తుకు వచ్చింది.ఏ పూర్వ జన్మబంధమో ఆమెను చూసినప్పుడల్లా తనతల్లి గుర్తుకు వచ్చి,ఆమె వద్ద ఎంతో ప్రశాంతతను పొందుతున్నాడు. ఆమె మాటల్లో మమకారం కనిపిస్తున్నదతనికి. కానీ ముఖ్యమంత్రి జానకి రామయ్య గారిలో ఎందుకో మమకార భావన కనిపించ లేదు. ఆయనచేతల్లోనూ, చూపుల్లోనూ ఎలాంటి అనుభూతి లేదని విజయ్‌కు అర్థం అయింది. తనభార్యను బాధ పెట్టవద్దనే తలంపుతో మాత్రమే తనతో సన్నిహితంగా ఉంటున్నట్లుగా నటిస్తున్నాడేమో అనే అనుమానం కూడా కలుగుతున్నది విజయ్‌లో.. ఏదో మొక్కుబడిగా వ్యవహరిస్తున్న

ముఖ్యమంత్రి అంతరంగం పసిగట్టడానికి విజయ్‌ ఆయన మాటలను అప్పుడప్పుడు విశ్లేషించుకుంటున్నాడు. ఎంతతేడా, సిఎం,ఆయన భార్య, ఇద్దరి మాటలు..ఆప్యాయతకు అర్థం చెప్పేలా అన్నపూర్ణమ్మ మాటలు, చేతలుంటున్నాయి. ఇక ముఖ్యమంత్రి మాత్రం, ఏదో తప్పదన్నట్లుగా తనతో వ్యవహరిస్తున్నాడనేది విజయ్‌ భావన. ఇలా ఆలోచిస్తూ విజయ్‌ ఎక్కువ సమయమే గడిపాడు.ఇంతలో పిఎ నుంచి కాల్‌ రావడంతో మర్నాటి కార్యక్రమాల గురించి చెప్పాడు. ఈ రోజు ఇంకా ఎవరైనా విజిటర్స్‌ ఉన్నారా అంటూ ఆరా తీసాడు. లేదు సార్‌ ఇప్పటికే వచ్చిన వారందరితో మీరు మాట్లాడారు కదా అందరూ వెళ్లిపోయారు. సరే సాయంత్రం పెద్దగా పనులు లేవు, నీవు వెళ్లిపో. అన్నాడు విజయ్‌.

సార్‌ నుంచి ఎప్పుడెప్పుడు ఈ మాట వస్తుందా అని ఎదురు చూస్తున్న నగేష్‌, హుషార్‌గా ఈల వేసుకుంటూ బయటకు వెళ్తుండగా మరి నా సంగతి అంటూ ముందుకు వచ్చాడు, డ్రైవర్‌.

ఏమో నాకు చెప్పలేదు. పని ఉందేమో అందుకే నిన్ను వెళ్లిపొమ్మని చెప్పలేదనుకుంటా అంటూ నగేష్‌ మోటర్‌బైక్‌ తీసి స్టార్టు చేసి బయలు దేరారు. ఈ రోజు సెకండ్‌ సాటర్‌ డే. మా నళినికి కూడా సెలవు. సరదాగా ఎటైనా ప్రోగ్రాం వేసుకుందామనుకొని,బైక్‌ను రోడ్డు పక్కన ఆపి కాల్‌ చేశాడు. వేళకాని వేళ పతిదేవుని నుంచి ఫోన్‌ అనుకుంటూ , ఊ చెప్పండి మహాప్రభూ, ఏమి సెలవంటూ వయ్యారాలు పోయింది నళిని.

మా సార్‌ పర్మిషన్‌ ఇచ్చాడు, తొందరగా వస్తున్నా, రఢీగా ఉండు బయటికి వెళ్లి, అలాఅలా తిరిగి, మంచి హోటల్‌లో ఢన్నిర్‌ చేద్దాం, ఏమంటావు అంటూ అష్టవంకరలు తిరిగాడు నగేష్‌. మన సంపాదనకు హోటల్‌ భోజనం కావాల్సి వచ్చిందా ,అంటూ ఎదురు ప్రశ్నించడంతో ఒక్కసారిగా నీరుకారిపోయాడు. సరే ఏదో ఒకటి చేద్దాం, నేను వచ్చేవరకు ముస్తాబు అయితే సమయం కలిసి వస్తుందని కాల్‌ చేస్తే ఇలాగేనా బదులిచ్చేది అంటూ బుంగమూతి పెట్టాడు. సర్లే సంబరం అంటూ ఆమెనే ముందుగా కాల్‌ కట్‌ చేసింది.

అనవసరంగా భర్తను ఆడిపోసుకున్నట్లుగా నళిని ఫీలయింది. పాపం సమయం దొరికింది కదా అని ఏదో చెప్పాడు, తాను ఊ అంటే సరిపోయేది. ఉన్నంతలో పొదుపు చేసుకుంటూ గుట్టుగా కాపురం చేస్తున్నాం, చిన్న చిన్న సరదాలు తీర్చుకోవాల్సిందే. ఈ రోజు ఆయన చెప్పినట్లే నడుచుకుంటానని మురిసిపోతూ బాత్‌రూంలోకి అడుగులు వేసింది నళిని.

భర్త ఇంటికి వచ్చినట్లుగా బైక్‌ సప్పుడు వినగానే అప్పటికిే ముస్తాబై, ఉన్న నళిని చిరునవ్వుతో భర్తకు ఎదురేగింది.ఇంతలో ఎంత మార్పు అనుకుంటూ నగేష్‌ కూడా సంతోషంగా బాగున్నావోయి, సినిమాలో అచ్చం ఆ హీరోయిన్‌గా కనిపిస్తున్నావు, అంటూ కవ్వించాడు. అన్నింటికీ మందహాసంతోనే మాట్లాడిరది. మీరు త్వరగా రఢీ కండి బయటికి పోదామన్నారు కదా అంటూ చీర కుచ్చిళ్లుసర్దుకుంది. రైట్‌,రైట్‌ అంటూ హడావుడిగా తయారయ్యాడు నగేష్‌.

ఇప్పుడు చెప్పు ఫోన్‌లో కసురుకున్నావు కానీ నీ మనస్సు మంచిదే. అంటూ దగ్గరకు తీసుకోబోయాడు, అయ్యో ఎంతో కష్టపడి తయారయ్యా, ఇప్పుడిదంతా ఎందుకు అంటూ పక్కకు జరిగింది. ఊ ఊ అంటూ ఏదో కావాలన్నట్లు ముందుకు వస్తున్న భర్తను వారించి అదంతా మళ్లీ ఇంటికీ వచ్చిన తర్వాతనే, పదపద బయటికి వెళ్తూ మాట్లాడుకుందామని ఇంటికి తాళం వేద్దామని లోనికి వెళ్లి తాళం తెస్తున్న నళినీని గట్టిగా కౌగలించుకున్నాడు నగేష్‌. వద్దన్నప్పుడే నీకు అన్నీకావాలి. చీర పాడవుతుందండీ, మళ్లీ కట్టుకోవాలి అంటున్నా, ఊ అంటూ ముద్దులతో ముంచెత్తుతూ మంచం వరకు పట్టుకుపోయాడు. ఈ చీరలో చాలా బాగున్నావంటూ తమకంతో ఆమెను అల్లుకుపోయాడు. చీర,చీర పాడవుతుందనుకుంటూనే ఆమె కూడా చుట్టుకుపోయింది. గదిలో కొద్దిసేపు తీయని మూలుగులు వినిపించి, ఆగిపోయాయి.

(సశేషం)

త‌ప్ప‌క‌చ‌ద‌వండి: విజయుడు (ధారావాహిక న‌వ‌ల‌ పార్ట్‌-29)

Leave A Reply

Your email address will not be published.