విజయుడు (ధారావాహిక న‌వ‌ల‌ పార్ట్‌-37)

వైకుంఠ పురంలో…

విజయ్‌పై వరుసగా జరుగుతున్న దాడులపై ఆందోళన వ్యక్తం చేసింది లక్ష్మీదేవి. ఇది మూడోసారి, ఎందుకు ఆ జీవిపై అంతగా పగ పెంచుకుంటున్నారు. పాపం విజయ్‌ తనకు తెలిసీ ఎవరికి కావాలని కనీస ద్రోహం చేయలేదే. మంచి వాళ్లకే కష్టాలు అనుకుంటూ…

ఏమిటి స్వామి ఆ జీవికి ఇన్ని ఆటుపోట్లు, మీరు చూస్తున్నారుగా, విజయ్‌ ఏనాడు ధర్మం తప్పి ఎరుగడు. ప్రజల పక్షాన నిలబడితే చంపడమేనా ఆ మానవుల పని. పదవులను రక్షించుకోవడానికి ఎంత మంచి వాళ్లనైనా బలి చేస్తారా అంటూ ఎంతో ఆవేధనతో కనిపిస్తున్న లక్ష్మీదేవిని క్రీగంట చూస్తూ ఉండిపోయాడు శ్రీమన్నారాయణుడు.

మాట్లాడరేం స్వామి. ఆ జీవికి ప్రాణ భయం లేదుగా… నిబద్దతతో ప్రజలకు మేలు చేసే వారికి కూడా రక్షణ లేని దుస్థితిలో భూలోకం ఉందా? రాజకీయ మధాందకారంలో పడి నీచానికి పాల్పడుతున్న వారందరినీ తుదముట్టించేందుకు మీరే మరో అవతారం ఎత్తాలనుకుంటా దేవా…పేరుకే మానవులు కానీ వారి బుర్రల నిండా రాక్షస బుద్దులే…ఎంత కూడబెట్టినా సరిపోదు వారికి, తరాలకు తరాలు కూర్చొని తిన్నా కరగని స్థాయిలో నేతలు కొందరు ధనం పోగుచేసుకుంటున్నారు.

అవినీతికి అంతం లేకుండా పోయింది. పిదపకాలం, పిదప బుద్దులు..

ఆమె ఆందోళనను గమనిస్తున్నారు మహా విష్ణువు.

చూడండి స్వామి, విజయ్‌ పట్ల ప్రజాధరణ ఎలా ఉందో… ఆ ఆస్పత్రికి వస్తున్న జన సందోహం, మీరూ చూడండి ప్రభూ అంది శ్రీలక్ష్మి.తాను ఇంతగా ప్రాధేయపడుతున్నా మహాదేవుని నుంచి ఎందుకు స్పంధన లేదు అనుకుంటూ…

దేవా, మీరే మాట ఇచ్చారు. ధర్మమార్గంలో విజయ్‌ పయనిస్తున్నన్ని రోజులు మృత్యువు ఆయన దగ్గరకు రాదని…మరి ఇదేమిటి స్వామి చావు బతుకుల మధ్య విజయ్‌ ఆస్పత్రిలో…ఎలా ఉన్నాడో చూడండి, మీరు దయచూపకుంటే మళ్లీ మనవద్దకు వచ్చి, వాదనకు దిగుతాడు. తనపై దాడులు,హత్యాపరంపరలను మీకు వివరించి, మళ్లీ భూలోకానికి పంపాలని కోరుతాడు అంటూ కొంత కోపంగానే చూసింది.

ఈ సారి అలా అవకాశం ఉండదు ఈ జీవికి. గతంలో రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్‌ పేరు నారాయణ కావడంతో మృత్యుముఖంలోకి వెళ్లేమందు పలుసార్లు నారాయణ అనడంతో మన దేవ దూతలు విజయ్‌ను ఇక్కడికి తోడ్కొని వచ్చారు. ఈ సారి గమనించావా? దైవ స్మరణ చేయకుండానే విజయ్‌ సృహ కోల్పోయాడు అన్నారు విష్ణుమూర్తి.

అయ్యో, అలాగా మరి ఏమిటి దారి పాపం ఆ జీవికి.. మరి వాని భవిష్యత్తు ఏమిటి? తన అనుమాన నివృత్తి జరగకుండానే విజయ్‌ శాశ్వతంగా కన్ను మూయాల్సిందేనా? దీనికి తరుణోపాయం చూడండి స్వామి అంటూ బాధపడుతున్న తన దేవి తలపై చేయి పెట్టి…

మనలను విశ్వసించిన వారికి, సన్మార్గంలో నడిచే వారికి ఎప్పుడు దైవ కృప అండగా ఉంటుంది. నీవు ఏమాత్రం కలత చెందకు దేవీ. అంతా శుభమే జరుగుతుంది. అనడంతో మహాలక్ష్మి మొఖంలో ఆనందం కనిపించింది.

అవును స్వామి ఆ జీవి వైకుంఠం నుంచి స్వర్గ లోకం పోయాడు కదా, అక్కడ దేవతలు సేవించే అమృతం కానీ తాగాడా? అన్ని బుల్లెట్లు తగిలినా శ్వాస ఆగలేదు. నాడి కొట్టుకుంటూనే ఉండటం… పాపం ఆ డాక్టర్లకు అర్థం కాలేదు. కానీ ఎంతో నిజాయితీగా కనిపించే విజయ్‌ దొంగచాటున అమృతం తాగే అవకాశాలు లేవనే నా అభిప్రాయం. మీరేమైనా కనిపెట్టారా?

ఏమటున్నావు దేవీ… ఆ జీవి నీకు అలా కనిపించాడా? నీతికి, నిబద్ధతకు మారుపేరుగా ఉన్నాడనే కదా మనం అంతగా అవకాశం ఇచ్చింది. దుర్మార్గపు ఆలోచనలు కూడా ఆ జీవికి రావని నాకు తెలుసు. అందుకే దైవకృపకు పాత్రుడవుతున్నాడు.

నిజమే స్వామి మీ కరుణాకటాక్షవీక్షణాలు పొందిన తర్వాత మరో రకంగా చౌర్యం చేయాల్సిన అవసరం ఏముంటుంది. అమృతం అందుబాటులో ఉన్నా, తీసుకునే వీలున్నా, ఆ జీవి తన సద్బుద్ధిని ప్రదర్శించాడు అంటూ విజయ్‌ను మెచ్చుకుంది.

స్వామి ఆ జీవికి ఎన్నాళ్లు ఈ కష్టాలు … తనను ముందుగా హత్య చేసింది? చేయించింది ఎవరో ఇంకా తెలుసుకోలేకపోయాడు. ఇప్పుడు మరో పరీక్ష అతనికి పాపం అంది లక్ష్మీదేవి.

చూద్దాం, విజయ్‌ తన ప్రయత్నంలో ఎంతవరకు సఫలీకృతుడవుతాడో…అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుందని వివరించాడు దేవదేవుడు.

మీ లీలలు నాకు కూడా అర్థం కావు స్వామి. సమస్త లోకాల రక్షకుడవు. ముల్లోకాల్లో ఎవరికి ఎక్కడ కష్టం వచ్చినా…ఆర్తజనబంధువులు మీరు. విజయ్‌ వృత్తాంతం నాకు మొదటి నుంచి ఆసక్తిని పెంచింది స్వామి. రోజు హరినామ కీర్తనలతో ఉండే వారికి కూడా లభించని వైకుంఠ ప్రవేశమే కాదు, సాక్షాత్తు స్వామి దర్శనంతో ఆగకుండా ఎన్ని సదుపాయాలు లభించాయి ఆ జీవికి. మీతో స్వయంగా మాట్లాడటం కాదు…వాదించి, తన పంతం నెగ్గించుకొని తిరిగి భూలోకానికి వెళ్లిన సందర్భాలు ఇప్పటివరకు ఏనాడు లేవు. అలాంటివి నాకైతే గోచరించంలేదు. లక్ష్మీదేవి మాటలు వింటూ చిరునవ్వుతో చూస్తున్నాడు శ్రీమన్నారాయణుడు.అవును స్వామి, ఇలాంటి అవకాశం మీరు గతంలో ఏ మానవమాత్రునికైనా ఇచ్చారా? ఏ యుగంలోనూ జరిగినట్లు లేదే.

ఇప్పటివరకు మూడు యుగాలు మిగిసి, నాలుగో యుగం ప్రారంభం కాగా వాటి కాలపరిమితిని లెక్కించారు …స్వామి,భూలోక వాసులు. ఒక్కో యుగానికి కాలపరిమితిని కూడా వెల్లడిరచారు. వారు ఎలా లెక్కించారో నాకు ఆశ్చర్యం వేస్తున్నది. ప్రళయం ఎలా సంభవిస్తుందో కూడా భూలోక వాసులు తమ వారసులకు తెలిసేలా గ్రంథరచనల ద్వారా నిక్షిప్తం చేస్తున్నారు. సత్య యుగం దీనినే కృత యుగం అంటూ ఈ యుగంలో మానవ సంవత్సరాలను

17,28,000గా ప్రస్తావిస్తున్నారు. ఇక త్రేతా యుగంలో కొంత తక్కువ మానవ సంవత్సరాలంటున్నారు. అవి

12,96,000 మానవ సంవత్సరాలట, వారి అంచనాల ప్రకారం. ద్వాపర యుగంలో ఎన్ని మానవ సంవత్సరాలుండేవో మీకేమేనా తెలుసా స్వామి. వారు ఎలా లెక్క వేశారో తెలియదు కానీ అవి 8,64,000 సంవత్సరాలుగా తేల్చారు. ఇక ప్రస్తుత కలి యుగం ఎన్నాళ్లో మీకు కానీ, బ్రహ్మదేవునికి కానీ తెలుసో తెలియదో, లయ కారుడు మహా శివునికి కూడా బహుశ తెలియకపోచ్చునేమో కానీ భూలోకంలో కంప్యూటర్‌ మాయా జాలంతో ఎన్ని సంవత్సరాలో అప్పుడే కనుగొన్నారు సుమా… పైగా రమారమీ, సుమారు అంటూ చెప్పకుండానే ఏకంగా 4,32,000 మానవ సంవత్సరాల వరకు కలి యుగం ఉండి తీరుతుందని అంచనా వేస్తున్నారు.

ఓహో…అలాగా…ఇదంతా నీకు ఎలా తెలిసింది దేవీ…

ఏదో గూగుల్‌ దేవతట. దాని ద్వారా ఏదైనా తెలుసుకోవాలంటే భూలోక వాసులు తక్షణమే సమాచారం సేకరిస్తారట. ఎవరో కాషాయ వస్త్రాలు ధరించి ఎక్కడో మీ శ్రీకృష్ణావతార విశేషాలు చెబుతున్నాడంటే నేను అవలోకిస్తే ఆయన ఇదంతా చెబుతున్నాడు మరీ…ఆశ్యర్యంగా చెబుతున్నది లక్ష్మీదేవి. అయితే ఇప్పటికే ఎన్ని సంవత్సరాలు ముగిసాయట ఈ కలియుగంలో అంటూ గూగూల్‌ గణాంకాలపై ఆసక్తి కనబర్చుతూ శ్రీమన్నారాయణుడు ప్రశ్నించడంతో…

లేకేమి అ లెక్కలు కూడా వాళ్లకు గూగుల్‌ మాత చెబుతున్నది. ఈ యుగంలో ఇప్పటికే 5,124 సంవత్సరాలు మాత్రమే ముగిసాయట. ఇంకా చాలా సంవత్సరాలే భూలోకంలో జన సంచారానికి ఎలాంటి డోకా లేదని కూడా వారు ఘంటాపథంగా చెబుతున్నారు స్వామి. వాళ్ల గూగుల్‌ దేవతకు తెలియదంటూ ఉండదట. మీ గురించి ఎలాంటి సమాచారమైనా వెంటనే అందులోనే తెలుసుకోవచ్చట.

ఆహా…అంటే…చాల విషయాలు విన్నావన్నమాట.

అవునవును స్వామి. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో కొత్త వస్తువు కనిపిస్తున్నది స్వామి. అదేమిటో కూడా వాళ్లు అంటుంటే విన్నాను. సెల్‌ఫోన్‌ అట. ప్రపంచంలోని ఏ ప్రదేశంలో ఉన్న ఎవరితో అయినా వెనువెంటనే మాట్లాడే సదుపాయం ఆ ఫోన్‌ ద్వారా లభిస్తుందని,

ఒకరిని మరొకరు చూసుకుంటూనే బదులిచ్చుకోవచ్చని చెప్పుకుంటున్నారు. నగరాల్లోనే కాదు పలెపల్లెకు ఈ సౌకర్యాలున్నాయట. ఏ ఆధారం లేకుంటా అదేదో ఉపగ్రహం ద్వారా అనుసంధానం అవుతున్నాయని, వారి మాటల్లో తెలిసింది నాకు, శాస్త్ర సాంకేతిక ప్రగతి అది. ఆధునిక పరిజ్ఞానంతో ఎంతో అభివృద్ధి సాధిస్తున్నారట అంటే వింతగా చెబుతున్న లక్ష్మీదేవి వైపు సాలోచనగా చూస్తున్నాడు విష్ణుమూర్తి. శ్రీదేవి ఇంకా ఏదో చెప్పబోతుండగా, భూలోక వింతలు ఇంకా చాలా ఉన్నాయి, మరింతగా పెరుగుతాయి దేవీ, కలియుగాంతం వరకు మరెన్నో వింతలు, విడ్డూరాలు వస్తాయి. ఆధునీకీకరణ సద్వినియోగం కాకుంటే మానవాళి దుష్ఫలితాలను అనుభవించాల్సి వస్తుందని అన్నారు మహా విష్ణువు.

మళ్లీ విజయ్‌ వైపు మళ్లింది వారి సంభాషణ.

చెప్పండి స్వామి నాకు ఇంకా స్పష్టత రావడం లేదు. విజయ్‌ ఇంకా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. వాడు ప్రాణాలతో ఉంటాడా లేదా? తన ఆశయం నెరవేరుతుందా? మరింత ఆందోళనకరంగా మారుతున్నది అతని పరిస్థితి. డాక్టర్లు శ్రమిస్తున్నారు, అయినా వారికి నమ్మకం కలగడం లేదు. ఎలా స్వామి అంటూ ఆరాటపడుతున్న లక్ష్మీదేవి వైపు ప్రసన్నంగా చూస్తున్నాడే కానీ ఎలాంటి సమాచారం తెలుపకుండా యోగ నిద్ర్రలోకి వెళ్లారు శ్రీమన్నారాయణడు.

(సశేషం)

త‌ప్ప‌క‌చ‌ద‌వండి: విజయుడు (ధారావాహిక న‌వ‌ల‌ పార్ట్‌-36)

Leave A Reply

Your email address will not be published.